Prakash Padukone
-
ఓటములకు ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలి: ప్రకాశ్ పడుకోన్
ప్యారిస్ ఒలింపిక్స్-2024 బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండానే భారత క్రీడాకారులు ఇంటిబాట పట్టారు. పీవీ సింధు, హెచ్ ఎస్ ప్రణయ్, సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ స్టార్ షట్లర్లు క్వార్టర్స్‌లో ఓటమి చెందడంతో.. అందరి ఆశలు సెమీఫైనల్‌కు చేరిన యువ షట్లర్ లక్ష్య సేన్‌పైనే ఉండేవి. లక్ష్య సేన్ కూడా సెమీఫైనల్లో ఓటమి చవి చూసి నిరాశపరిచాడు. కనీసం కాంస్య పతకమైన ఈ యువ షట్లర్ సాధించాలని అందరూ ఆశించారు. కానీ కాంస్య పతకపోరులోనూ లక్ష్య సేన్ బోల్తాపడ్డాడు. సోమవారం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో 21–13, 16–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో లక్ష్యసేన్ ఓడిపోయాడు. ఇక ఈ ఓటమిపై లక్ష్య సేన్ కోచ్ ప్రకాశ్ పడుకోన్ స్పందించాడు."పరాజయాలకు ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాల్సిన సమయం వచ్చింది. ఫలానా సౌకర్యాలు కావాలని అడగడమే కాదు... అవన్నీ ఇచ్చాక ఫలితాలతోపాటు పతకాలు కూడా తీసుకురావాలి. లక్ష్య సేన్ మరింత మెరుగవ్వాల్సి ఉంది. తప్పులు జరగడం సహజమే కానీ కోర్టులో పరిస్థితిని బట్టి ఆటను మార్చుకోవాలి. ఈ విషయంలో సేన్‌కు మానసికంగా కూడా కొంత శిక్షణ అవసరం. భారత బ్యాడ్మింటన్‌లో ఒకరిద్దరు టాప్ ఆటగాళ్లపై మాత్రమే దృష్టి పెట్టకుండా తర్వాతి స్థాయిలో వారిని కూడా తీర్చిదిద్దితేనే విజయాలు లభిస్తాయని" ప్రకాశ్ పడుకోన్ పేర్కొన్నాడు. -
కొత్త సవాళ్లకు సిద్ధం
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. గత 18 నెలలుగా అటు టోర్నీల్లో వైఫల్యంతోపాటు గాయాలు కూడా ఆమెను వెంటాడాయి. 2023లో ఆమె ఒక్క టోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత సింధు మళ్లీ బరిలోకి దిగుతోంది. పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోణంలో చూస్తే ఈ ఏడాది సింధుకు కీలక ఏడాది కానుంది. ఈ నెల 13 నుంచి మలేసియాలో జరిగే ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో సింధు పాల్గొంటోంది. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌కు తనకు పెద్ద సవాల్‌గా కనిపిస్తున్నాయని, ఈసారి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని సింధు అభిప్రాయపడింది. గత కొంత కాలంగా సింధు బెంగళూరులో దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పడుకోన్ , ఇండోనేసియా కోచ్ అగుస్ ద్వి సాంతోసో వద్ద శిక్షణ తీసుకుంటోంది. ప్రకాశ్‌తో పాటు ఆమె ఇతర కోచింగ్ బృందంలో కూడా మార్పులు జరిగాయి. దీంతో మంచి ఫలితాలు రాబట్టగలనని ఆమె విశ్వాసంతో ఉంది. పలు అంశాలపై సింధు అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... | ♦ గత రెండు ఒలింపిక్స్‌లతో పోలిస్తే ఈసారి జరగబోయే పోటీలు నాకు భిన్నమైన అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి. 2016, 2020 ఒలింపిక్స్‌లతో పోలిస్తే నాకు పారిస్‌లో పెద్ద సవాల్ ఎదురు కానుంది. అయితే నాకు అనుభవం కూడా పెరిగింది. మరింత జాగ్రత్తగా, తెలివిగా ఆడాల్సి ఉంటుంది. ♦ మహిళల సర్క్యూట్లో టాప్ 10–15 షట్లర్లు బాగా బలమైనవారు. వారిని ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలు అనుసరించాలి. ప్లాన్ ‘ఎ’ పని చేయకపోతే ప్లాన్ ‘బి’ కోసం సిద్ధంగా ఉండాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండే మానసిక దృఢత్వం కూడా అవసరం. ♦ ప్రకాశ్ సర్ లాంటి గొప్ప ఆటగాడితో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఆలోచనలు, శిక్షణా పద్ధతులు నాకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. కొత్త ట్రెయినర్, ఫిజియో, న్యూట్రిషనిస్ట్, కోచ్, మెంటార్... ఇలా అందరూ మారారు. వీరంతా నాకు ఎంతో సహకరిస్తున్నారు. దీని వల్ల నా ఆటలో వచ్చిన మార్పులు మున్ముందు కనిపిస్తాయి. పూర్తి ఫిట్‌గా నేను ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమయ్యాను. ♦ గాయం నుంచి కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఆటలో వేగం అందుకునేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం నేను అదే స్థితిలో ఉన్నాను. గతంలో ఇలాంటి కఠిన పరిస్థితులను అధిగమించాను. 2015లో కూడా నేను గాయాలతో బాధపడుతూనే ఆరు నెలల పాటు ఆడాను. అయితే కోలుకొని రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగాను. నా మీద నాకున్న నమ్మకంతో పోరాడి రజతం గెలిచాను. నాలుగేళ్ల తర్వాత మరిన్ని అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగి సెమీస్‌లో ఓడటం చాలా బాధించింది. ఫైనల్ చేరకపోవడంతో ఏడ్చేశాను. కానీ నాలుగో స్థానానికి, కాంస్య పతకానికి తేడా చాలా ఉంటుందని నా కోచ్ ప్రోత్సహించడంతో మూడో స్థానం కోసం మ్యాచ్‌లో సత్తా చాటి గెలిచాను. ఈ కాంస్యం కోసం నేను ఎంతో కష్టపడ్డానని అనిపించింది. -
అవును... ఆయన వద్దే శిక్షణ సాగుతోంది
హైదరాబాద్: ఈ సీజన్ ఆసాంతం నిరాశపరిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త సీజన్ కోసం కసరత్తు ప్రారంభించింది. భారత దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మాజీ చాంపియన్ ప్రకాశ్ పడుకోన్ వద్ద గత ఆగస్టు నుంచి ఆమె శిక్షణ తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఆమె నిర్ధారించింది. ‘ప్రకాశ్ సర్ మార్గదర్శనంలో నేను ట్రెయినింగ్ మొదలుపెట్టాను. ఆగస్టులోనే నా శిక్షణ ప్రారంభమైంది. నిజం చెప్పాలంటే ఆయన నాకు కోచింగ్ గురువు కంటే ఎక్కువ. మెంటార్‌గా, మంచి గైడ్‌గా... అంతకుమించి నా నిజమైన శ్రేయోభిలాషిగా ఆయన నా ఆటతీరుకు మెరుగులు దిద్దుతున్నారు. నాలోని పూర్తిస్థాయి నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఆయన ఎంతగానో శ్రమిస్తున్నారు. జపాన్‌లో ఉండగా కేవలం ఒక ఫోన్కాల్కే ఆయన స్పందించడం... ఇంతలా వ్యక్తిగత శ్రద్ధ కనబరచడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని సింధు వివరించింది. -
17 ఏళ్లకు జాతీయ స్థాయిలో దూసుకొచ్చిన కుర్రాడు.. బ్యాడ్మింటన్‌లో ప్రకాశం
దాదాపు యాభై ఏళ్ల క్రితం.. దక్షిణ భారతదేశంలో బ్యాడ్మింటన్ అంటే బాల్ బ్యాడ్మింటన్ మాత్రమే! దిగువ స్థాయిలో గ్రామాల్లోకి కూడా చొచ్చుకుపోయి.. ఆటంటే బాల్ బ్యాడ్మింటన్ మాత్రమే అనేంతగా పరిస్థితి కనిపించేది. నగరాల్లో కూడా ‘షటిల్ బ్యాడ్మింటన్ ’ గా పిలుచుకునే ఆటకు పెద్దగా ప్రాచుర్యం లేదు. ఇలాంటి స్థితిలో బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడొకడు జాతీయ స్థాయిలో దూసుకొచ్చాడు. నేపథ్యం కారణంగా తొలి అవకాశం తొందరగానే లభించినా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు అతనికి పదేళ్లు పట్టింది. ఆ విజయం తర్వాత అతను ఆగలేదు. దేశంలో బాడ్మింటన్ ఆటకే దిక్సూచిగా మారాడు. ఒక దేశంలో ఒక క్రీడ గురించి చెప్పుకోవడం మొదలు పెట్టగానే అందరికంటే ముందుగా ఒక పేరు స్ఫురిస్తుందంటే ఆ ఆటగాడు సాధించిన ఘనత ఏమిటో, ఆ ఆటకు అతను తెచ్చిన గుర్తింపు ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. అతని పేరే ప్రకాశ్ పడుకోణ్.. భారత బ్యాడ్మింటన్‌కు తొలితరం చిరునామా. ప్రకాశ్ పడుకోణ్ కంటే ముందు కూడా భారత ఆటగాళ్లు అంతర్జాతీయ బ్యాడ్మింట¯Œ లో కొన్ని విజయాలు సాధించారు. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన దినేశ్ ఖన్నా తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన కెరీర్ ఎక్కువ భాగం ఆసియాకే పరిమితమైంది. 60, 70వ దశకాల్లో బ్యాడ్మింటన్ లో చైనా ఆధిపత్యం లేదు. అలాంటి సమయంలో దినేశ్ ఆసియా స్థాయిలో విజేతగా నిలిచినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అప్పట్లో బ్యాడ్మింటన్ అడ్డా యూరోప్ మాత్రమే. ఇంగ్లండ్, డెన్మార్క్‌లతో పాటు ప్రతిష్ఠాత్మక యూరోపియన్ లీగ్‌లు, క్లబ్‌లలో బ్యాడ్మింటన్ హవా నడిచేది. విజయాలు సాధించిన వారికే అక్కడ అందలం. సరిగ్గా ఇక్కడే ప్రకాశ్ పడుకోణ్ మిగతావారి కంటే భిన్నంగా నిలిచాడు. ఒక వైపు ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే యూరోప్‌లో సత్తా చాటడంతో ప్రకాశ్ ప్రత్యేకత కనిపించింది. కఠోర శ్రమతో.. ప్రకాశ్ తండ్రి మైసూరు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శిగా పని చేస్తుండటంతో సహజంగానే ప్రకాశ్‌కి ఆ ఆటపై ఆసక్తి కలిగింది. అయితే ఆటలో పదును ఉంటేనే మున్ముందు అవకాశాలు దక్కుతాయని త్వరలోనే ప్రకాశ్‌కి అర్థమైంది. 1962లో అమితోత్సాహంతో రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్ షిప్ బరిలోకి దిగిన అతను తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత మరో రెండేళ్ల శ్రమతో అదే టైటిల్ గెలుచుకున్నాడు. అయినా సరే, ప్రకాశ్ ఆట ఉత్తరాది షట్లర్లతో పోలిస్తే ఇంకా పేలవంగానే ఉండేది. జాతీయ స్థాయికి ఎదగాలంటే అది సరిపోదని గ్రహించాడు. అందుకే తన ఆట శైలిని మార్చుకున్నాడు. దూకుడును పెంచి ప్రత్యర్థిపై చెలరేగేందుకు తగిన అస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు. అయినా సరే.. రాష్ట్ర స్థాయి విజేత నుంచి జాతీయ స్థాయికి చేరేందుకు ప్రకాశ్‌కు చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో అతణ్ణి ఎన్నో పరాజయాలు పలకరించాయి. పట్టుదలగా నిలబడ్డాడు. ఏ దశలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఫలితంగా.. దాదాపు ఏడేళ్ల తర్వాత తొలిసారి జాతీయ జూనియర్ టైటిల్ ప్రకాశ్ చేతికి చిక్కింది. అప్పటికే.. పదునెక్కిన ప్రకాశ్ ఆట సీనియర్లనూ నిలువరిస్తోంది. దాంతో జూనియర్ చాంపియన్ గా మారిన సంవత్సరమే పడుకోణ్ జాతీయ సీనియర్ చాంపియన్ గానూ మారాడు. అది మొదలు మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా ఏడు సంవత్సరాల పాటు ప్రకాశ్ జాతీయ చాంపియన్ గా నిలబడ్డాడు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో.. భారత బ్యాడ్మింటన్ లో శిఖరానికి చేరాక ప్రకాశ్ తర్వాతి అడుగు అంతర్జాతీయ టోర్నీల వైపే. 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో టీమ్ ఈవెంట్లో కాంస్యం సాధించినా.. వ్యక్తిగత విభాగంలో విజయాలకు హైదరాబాద్ నగరమే తొలి వేదికగా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఆసియా చాంపియన్ షిప్లో 21 ఏళ్ల ప్రకాశ్ కాంస్యం సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్లకు కెనడాలోని ఎడ్మాంటన్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల సింగిల్స్‌లో స్వర్ణపతకంతో మెరిశాడు. వరుసగా రెండు వరల్డ్ కప్‌లలో పతకాలు, వరల్డ్ గేమ్స్‌తో పాటు ఆసియా చాంపియన్ షిప్లో మరో పతకంతో ప్రకాశ్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అప్పటికే బ్యాడ్మింటన్ అంటే దేశంలో ఒక్క ప్రకాశ్ పడుకోణ్ పేరు మాత్రమే వినిపించేంతగా ప్రసిద్ధికెక్కాడు. యూరోప్ గడ్డపై.. వేర్వేరు అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లిన సమయంలో ప్రకాశ్ ప్రత్యర్థుల ఆటపై దృష్టి పెట్టాడు. ప్రధానంగా యూరోప్ ఆటగాళ్లతో పోలిస్తే తన ఆట చాలా వెనుకబడి ఉన్నట్లు గ్రహించాడు. అప్పటికే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా.. ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆటలో మార్పు తీసుకురాకపోతే వెనుకబడి పోతాననీ అర్థంచేసుకున్నాడు. యూరోప్ వెళ్లి శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే శిక్షణ అంటూ వెళితే ఫలితం ఉండదని.. వీలైనన్ని ఎక్కువ టోర్నీలకు ఆడటంతో ఆటను సానబెట్టుకోవచ్చని అత్యంత సన్నిహితులు అతనికి సూచించారు. దాంతో తన మకాంను యూరోప్‌కు మార్చుకున్నాడు ప్రకాశ్. ఇంగ్లండ్, డెన్మార్క్, స్వీడన్ , నెదర్లాండ్స్.. ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి క్లబ్‌లలో ఆడుతూ పోయాడు. అతను ఆశించినట్లుగానే అతని ఆట పైస్థాయికి చేరుకుంది. 1979లో లండన్ లో ‘ఈవెనింగ్ ఆఫ్ చాంపియన్స్’ టోర్నీలో విజయంతో అతను అందరి దృష్టిలో పడ్డాడు. ఇదే ఆట చివరకు ఒక చరిత్రాత్మక గెలుపుకి బాటలు వేసింది. కొనసాగిన విజయపరంపర ఆల్ ఇంగ్లండ్ గెలిచిన తర్వాత ప్రకాశ్‌కు స్వదేశంలో లభించిన స్వాగతం, పెద్ద ఊరేగింపుతో జరిగిన పౌర సన్మానం అప్పట్లో పెద్ద సంచలనం. ఆ విక్టరీ తర్వాత అతని స్థాయి మరింత పెరిగిపోయింది. వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోవడంతో పాటు డెన్మార్క్‌లోని కోపెన్ హాగెన్ లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్‌లోనూ అతను కాంస్యం గెలుచుకున్నాడు. కోపెన్ హాగెన్ నగరంతో అనుబంధాన్ని ఆ తర్వాత కొనసాగిస్తూ ప్రకాశ్ సుదీర్ఘ కాలం అక్కడే ఉండి లీగ్‌లలో పాల్గొన్నాడు (అతని కూతురు, పాపులర్ నటి దీపికా పడుకోణ్ అక్కడే పుట్టింది). 1986 సియోల్ ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్లో మరో పతకం అతని ఖాతాలో చేరింది. ప్రతిభను ప్రోత్సహిస్తూ.. అర్జున, పద్మశ్రీ పురస్కారాలు గెలుచుకున్న ప్రకాశ్ 90వ దశకం ఆరంభంలో ఆటకు దూరంగా జరిగినా, కోచ్‌గా కొత్త బాధ్యతను తీసుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రకాశ్ పడుకోణ్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రస్తుతం దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చి దిద్దుతోంది. ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ ప్రకాశ్ ముందుచూపుకి ప్రతిరూపం. వేర్వేరు క్రీడాంశాల్లో ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి వారికి శిక్షణ, తగిన డైట్నివ్వడం, టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుగా ఆర్థిక సహకారాన్ని అందించడం.. ఇలా అన్ని రకాలుగా వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ తనదైన రీతిలో అండగా ఉంటోంది. బిలియర్డ్స్ స్టార్ గీత్ సేథీతో కలసి ప్రకాశ్ నెలకొల్పిన ఈ ఫౌండేషన్ ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసింది. ఆల్ ఇంగ్లండ్ ఘనత... బ్యాడ్మింటన్ లో అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్. 1899లోనే మొదలైన ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవడం అంటే అతి పెద్ద ఘనత. ఆ సమయంలో వరల్డ్ చాంపియన్ షిప్‌తో పాటు దానికి సమాన హోదా ఉన్న టోర్నమెంట్ ఇది. యూరోపియన్ సర్క్యూట్లో వరుస విజయాలతో ప్రకాశ్ మంచి ఊపు మీదున్నాడు. కొన్నాళ్ల క్రితమే పెద్ద టోర్నీలు డానిష్ ఓపెన్ , స్వీడిష్ ఓపెన్ లలో అతను టైటిల్ కూడా దక్కించుకున్నాడు. 1980 ఆల్ ఇంగ్లండ్ టోర్నీ మొదలయ్యాక ఏకపక్ష విజయాలతో ఫైనల్ వరకు దూసుకొచ్చాడు. అప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఏ గేమ్‌లోనూ ప్రత్యర్థులు గరిష్ఠంగా 12 పాయింట్లకు మించి సాధించలేకపోయారంటే ప్రకాశ్ దూకుడు ఎలా సాగిందో అర్థమవుతుంది. 15–7, 15–12, 15–0, 15–10, 15–4, 15–4, 15–8, 15–10.. ఇవీ స్కోర్లు! ఫైనల్లో ఇండోనేసియాకు చెందిన లీమ్ స్వీ కింగ్ ఎదురయ్యాడు. ఆ సమయంలో అతను అత్యద్భుత ఫామ్‌లో ఉండి చెలరేగిపోతున్నాడు. ‘స్మాష్ కింగ్’గా గుర్తింపు తెచ్చుకొని అంతకు ముందు వరుసగా రెండేళ్లు ఇదే టోర్నీలో విజేతగా నిలిచాడు. దాంతో ప్రకాశ్‌కు కష్టమే అనిపించింది. అయితే భారత స్టార్ ఎక్కడా తొణకలేదు. ప్రత్యర్థి గుర్తింపును పట్టించుకోలేదు. అన్నేళ్లుగా యూరోప్‌లో ఆడిన తన అనుభవాన్ని రంగరించాడు. ఫలితంగా 15–3, 15–10 తేడాతో ఘన విజయం.. ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు. ‘నన్ను ప్రకాశ్ హిప్నటైజ్ చేసినట్లు అనిపించింది’ అంటూ ఓటమి తర్వాత స్వీకింగ్ చేసిన వ్యాఖ్య ఈ గెలుపు ప్రత్యేకతను మరింత పెంచింది. 1980 నుంచి ఇప్పటి వరకు పుల్లెల గోపీచంద్ (2001) మినహా మరే భారత షట్లర్ పురుషుల, మహిళల విభాగాల్లో ఈ టోర్నీ గెలుచుకోలేకపోయారు. -
Deepika Padukone దీపిక తండ్రి బయోపిక్.. పనులు మొదలుపెట్టిన కూతురు
‘‘మా నాన్న (ప్రకాశ్ పదుకోన్) జీవితం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే ఆయన బయోపిక్ తీయాలనుకుంటున్నాను’’ అన్నారు దీపికా పదుకోన్. దీపిక తండ్రి ప్రకాశ్ పేరున్న బ్యాడ్మింటన్ ప్లేయరన్న సంగతి తెలిసిందే. 1980లో వరల్డ్ నంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలవడంతో పాటు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను గెలిచి, రికార్డు సృష్టించారు ప్రకాశ్. జీవితంలో ఇంత సాధించిన తన తండ్రి బయోపిక్‌ను నిర్మించే పనులు మొదలుపెట్టినట్లు దీపిక పేర్కొన్నారు. ఈ విషయం గురించి దీపికా పదుకోన్ మాట్లాడుతూ – ‘‘భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవకముందే (1983లో క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది) మా నాన్నగారు అథ్లెట్‌గా దేశ క్రీడా ఖ్యాతిని విశ్వవేదికపైకి తీసుకుని వెళ్లారు. అథ్లెట్‌గా నాన్న సాధన చేయడానికి అప్పట్లో మెరుగైన సౌకర్యాలు కూడా లేవు. పెళ్లి మండపాల్లో సాధన చేసేవారు. తన బలహీనతలను బలాలుగా మార్చుకునేందుకు నిరంతరం కృషి చేసేవారు. ఆయన జీవితం ఓ స్ఫూర్తి’’ అన్నారు. -
ప్రకాశ్ పడుకోన్‌కు అరుదైన గౌరవం
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్‌ను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సముచిత రీతిలో గౌరవిస్తూ ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’కు ఎంపిక చేసింది. 1980లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీని గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన మాజీ వరల్డ్ నంబర్‌వన్ ప్రకాశ్ పడుకోన్ ఆ తర్వాత 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు. రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా వ్యవహరించడంతో పాటు ఓజీక్యూ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, బెంగళూరు: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో దీపికా త్వరగా కోలుకోవాలంటూ అమె అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ వార్తను దీపిక ఇంకా ధృవీకరించలేదు. కానీ ఇప్పటికే దీపికా కుటుంబం కరోనాతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో దీపికా భర్త రణవీర్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు, సోదరి కరోనా సోకింది. దీపికా తండ్రి , ప్రముఖ క్రీడాకారుడు ప్రకాష్ పడుకొనే బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతోపాటు దీపికా తల్లి ఉజ్జల, సోదరి అనీషాకు కూడా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవలే ప్రకాష్ వ్యాక్సిన్ మొదటి డోసును స్వీకరించారు. అయితే ప్రకాష్ పదుకొనే ఆరోగ్యం నిలకగానే ఉందని, మరో రెండో రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ప్రకాష్ పడుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ డైరెక్టర్ విమల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి : విషాదం: కరోనాతో హీరోయిన్ సోదరుడు మృతి దీపికా ఫ్యామిలీని తాకిన కరోనా, ఆసుపత్రిలో ప్రకాష్ పడుకొనే -
దీపికా ఫ్యామిలీని తాకిన కరోనా, ఆసుపత్రిలో ప్రకాష్ పడుకొనే
సాక్షి, బెంగళూరు: లెజెండరీ బ్యాడ్మింటన్ ఆటగాడు, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తండ్రి ప్రకాష్ పడుకొనే (65)కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని క్రీడాభిమానులు కోరు కుంటున్నారు. దాదాపు10 రోజుల క్రితం దీపికా తల్లి ఉజ్జల, సోదరి అనిషా కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో వీరు హోం ఐపోలేషన్‌లో ఉన్నారు. అయితే ప్రకాష్ పడుకొనేకు జ్వరం తగ్గకపోవడంతో గత శనివారం బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చేర్చారని ప్రకాష్ పడుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ డైరెక్టర్ విమల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండో రోజుల్లో ప్రకాష్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. కాగా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన పడుకొనే 1970, 1980 లలో తన ప్రతిభాపాటవాలతో రోల్ మోడల్‌గా అవతరించారు. 1980లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడు ప్రకాష్ పడుకొనే కావడం విశేషం.1983 ఎడిషన్‌లో కాంస్యం సాధించి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారతీయుడుగా ఖ్యాతి గడించారు.డెన్మార్క్ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్స్ , స్వీడిష్ ఓపెన్‌లో బ్యాక్-టు-బ్యాక్ టైటిల్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. 1991లో పదవీ విరమణ అనంతరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గాను, 1993 నుండి 1996 వరకు భారత జట్టుకు కోచ్ గా కూడా ప్రకాష్ పనిచేశారు. (విషాదం: కరోనాతో హీరోయిన్ సోదరుడు మృతి) -
‘ ఆ విషయంలో దీపిక చాలా క్రూరం’
ముంబై: లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు ఇండస్ట్రీ జనాలు. కానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ చెత్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎలెవన్ ఆన్ టెన్’ కార్యక్రమం ద్వారా అభిమానులతో ముచ్చటించారు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో సునీల్ చెత్రీ ‘బ్యాడ్మింటన్‌లో మీరు ఎప్పుడైనా దీపికను ఓడించారా’ అని రణ్వీర్ను ప్రశ్నించాడు. అందుకు రణ్వీర్ తాను ‘త్రీ పాయింట్ చాంపియన్’ని అని చెప్పుకొచ్చాడు. అంటే 21 పాయింట్స్ సెట్లో రణ్వీర్ కేవలం మూడు పాయింట్స్ మాత్రమే సాధించానని తెలిపాడు. అంతేకాక బ్యాడ్మింటన్ కోర్టులో దీపిక చాలా క్రూరంగా ఉంటుందని.. తనను చాలా ఇబ్బంది పెడుతుందన్నాడు రణ్వీర్. (ఆట వాయిదా) అయితే ఇక మీదట తాను బాగా కష్టపడతానని.. కనీసం 10 పాయింట్లు అయినా సాధిస్తానని అభిమానులకు ప్రామిస్ చేశాడు రణ్వీర్. ఈ లైవ్ చాట్ షోలో దీపికా పదుకొనే కూడా కొన్ని సెకన్ల పాటు కనిపించింది. అనంతరం తన భర్తను ఉద్దేశించి ‘మీ మామగారి అకాడమీలో చేరి శిక్షణ పొందు’ అంటూ కామెంట్ చేసింది. దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్యాడ్మింటన్ కోచింగ్ సెంటర్ స్థాపించి ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపిక, రణ్వీర్ ‘83’ చిత్రంలో కలిసి నటించారు. 1983లో భారతజట్టు మొదటిసారి క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన మధుర సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రానికి కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ పాత్రలో నటించారు రణ్వీర్ సింగ్. అలాగే కపిల్‌దేవ్ భార్య రోమీగా నటించారు రణ్వీర్ సింగ్ భార్య దీపికాపదుకోన్. ‘83’ సినిమాను తొలుత ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించడానికి చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. (దీపికకు రణ్వీర్ భావోద్వేగ లేఖ!) -
ఆల్ ఇంగ్లండ్‌లో అద్భుతం
సరిగ్గా 40 ఏళ్ల క్రితం... బ్యాడ్మింటన్‌కు ఒలింపిక్స్‌లో చోటు లేదు. ప్రపంచ చాంపియన్‌షిప్ మూడేళ్లకు ఒకసారి మాత్రమే జరిగేది. ఇప్పటిలా పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్ టోర్నీలు లేవు. ఒక చోట విఫలమైతే తర్వాతి వారమే మళ్లీ తప్పుదిద్దుకొని మరో చోట విజేతగా నిలిచే అవకాశం ఏమాత్రం లేదు. అందుకే అలాంటి సమయంలో సాధించిన ఒక ప్రతిష్టాత్మక ట్రోఫీ విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బ్యాడ్మింటన్‌లో అతి పురాతనమైన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ గురించి.... 1980లో ఇదే టైటిల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన దిగ్గజం ప్రకాశ్ పదుకొనే గురించి... భారత బ్యాడ్మింటన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రకాశ్ పదుకొనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు నందు నటేకర్లాంటి షట్లర్లు కొంత గుర్తింపు తెచ్చుకున్నా పెద్దగా గుర్తుంచుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు. సరిగ్గా చెప్పాలంటే ఏదో నామ్‌కేవాస్తేగానే ఆట సాగింది. ఇలాంటి స్థితిలో ప్రకాశ్ దూసుకొచ్చాడు. 1974 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన తర్వాత 1978 ఎడ్మంటన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో ప్రకాశ్ ప్రభ వెలిగింది. ఆ తర్వాత ‘వింబుల్డన్ ఆఫ్ బ్యాడ్మింటన్’ ఆల్ ఇంగ్లండ్ విజయం ప్రకాశ్‌ను శిఖరాన నిలిపింది. నిలకడైన ప్రదర్శనతో... ఆల్ ఇంగ్లండ్‌కు ముందు యూరప్‌లోనే ఉన్న ప్రకాశ్ అప్పటికే వరుసగా రెండు టైటిల్స్ డానిష్ ఓపెన్, స్వీడిష్ ఓపెన్ గెలిచి మంచి ఊపు మీదున్నాడు. అయితే ఆల్ ఇంగ్లండ్ విషయంలో మాత్రం అందరి అంచనాలు కొంత భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా 1978, 1979లలో టైటిల్స్ గెలిచి హ్యాట్రిక్ కోసం సిద్ధమైన లీమ్ స్వీ కింగ్ (ఇండోనేసియా) ఫేవరెట్‌గా నిలిచాడు. అలసటకు గురి కాకుండా ఉండేందుకు ప్రకాశ్ గెలిచిన గత రెండు టోర్నీలు ఆడకుండా కింగ్ దూరంగా ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ప్రకాశ్ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. వరుసగా తొలి మూడు మ్యాచ్‌లలో సూఫియాన్ (మలేసియా), హాదియాంతో (ఇండోనేసియా), స్వెండ్ ప్రి (డెన్మార్క్)లను చిత్తు చిత్తుగా ప్రకాశ్ ఓడించాడు. సెమీస్‌లో కొంత పోటీ ఎదురైనా ఫ్రాస్ట్ హాన్సెన్ (డెన్మార్క్)ను కూడా పడగొట్టి తుది పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ స్వీ కింగ్‌తోనే తలపడాల్సి వచ్చింది. గతంలో అతనితో తలపడిన ప్రతీసారి పదుకొనేకు పరాజయమే ఎదురైంది. కానీ ఈసారి సీన్ మారిపోయింది. దూకుడైన ప్రత్యర్థిని ప్రశాంతంగా ఎదుర్కొని ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడిన ప్రకాశ్ పైచేయి సాధించాడు. చివరకు 15–3, 15–10తో భారత షట్లర్ సృష్టించిన కొత్త చరిత్ర ముందు కింగ్ చిన్నబోయాడు. గ్రాండ్ వెల్కమ్... నిజానికి తన విజయం ఘనత ఏమిటో ఆ సమయంలో స్వయంగా ప్రకాశ్ కూడా గుర్తించలేదు. రెండేళ్ల క్రితం అతనుæ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచినప్పుడు 20–30 మంది ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి స్వాగతం పలికారు. ఇప్పుడు మహా అయితే మరో 10 మంది ఎక్కువగా వస్తారేమో అని అతనూ అనుకున్నాడు. కానీ కర్ణాటక ప్రభుత్వం నుంచి అతనికి అద్భుత రీతిలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి గుండూరావు స్వయంగా స్వాగతం పలికారు. గుర్రపు రథాలు, వరుస వాహనాల సమేతంగా ఓపెన్ టాప్ జీపులో బెంగళూరు నగరమంతా చూసే విధంగా ప్రకాశ్ విజయయాత్ర సాగింది. ఆ తర్వాత ఘనంగా పౌరసన్మానం జరిగింది. 1980లో ఒక క్రీడాకారుడికి ఈ తరహా గౌరవం దక్కడం అసాధారణం. తాజా విజయంతో పదుకొనే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా కూడా నిలిచాడు. 1981లోనూ ప్రకాశ్ పదుకొనే, లీమ్ స్వీ కింగ్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకొచ్చారు. అయితే ఈసారి లీమ్ స్వీ కింగ్‌ది పైచేయి అయింది. ప్రకాశ్ రన్నరప్‌గా నిలిచాడు. ప్రకాశ్ విజేతగా నిలిచిన 21 సంవత్సరాల తర్వాత 2001లో మన పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ సాధించి ఈ విజయం అందుకున్న రెండో భారతీయుడిగా నిలిచాడు. ఆ తర్వాత గత 19 ఏళ్లలో ఈ టైటిల్ మన భారత షట్లర్లు ఎవరికీ దక్కలేదు. ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు... ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్, ఆసియా, కామన్వెల్త్ పతకాలు, లెక్క లేనన్ని సూపర్ సిరీస్ విజయాలు... బ్యాడ్మింటన్ వేదికపై గత కొన్నేళ్ళలో భారత క్రీడాకారులు ఎన్నో ఘనతలు సాధించారు. కానీ ప్రకాశ్ పదుకొనే సాధించిన నాటి విజయానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. -
‘అంతా సైనా నిర్ణయమే’
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం తన అకాడమీని వదిలి సైనా నెహ్వాల్ బెంగళూరు వెళ్లిపోవడం తనను తీవ్రంగా బాధించిందని... ప్రకాశ్ పదుకొనే, విమల్ కుమార్ ఆమెకు నచ్చజెప్పి ఉండాల్సిందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ (పీపీబీఏ) స్పందించింది. సైనా తన ఇష్ట్రపకారమే వ్యవహరించింది తప్ప తమ పాత్ర ఏమీ లేదని ఒక ప్రకటన ద్వారా వివరణ ఇచి్చంది. ‘గోపీచంద్ అకాడమీని వదిలి పీపీబీఏలో శిక్షణ పొందాలనేది పూర్తిగా సైనా నెహా్వల్ సొంత నిర్ణయం. అందులో మా పాత్ర అసలేమాత్రం లేదు. అయితే కష్టకాలంలో విమల్ కుమార్ కోచింగ్ ఆమెకు ఉపకరించిందనేది వాస్తవం. ఆయన మార్గనిర్దేశనంలోనే సైనా వరల్డ్ నంబర్‌వన్‌గా నిలవడంతో పాటు ఆల్ ఇంగ్లండ్, ప్రపంచ చాంపియన్ షిప్‌లలో ఫైనల్ వరకు వెళ్లగలిగింది. ఆటగాడిగా, కోచ్‌గా గోపీచంద్ ఘనతలపై మాకు అపార గౌరవం ఉంది. ఆయన దగ్గర శిక్షణ పొందిన వారు మంచి ఫలితాలు సాధించినప్పుడు అభినందించాం. ఆయనతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. గత 25 ఏళ్లుగా పీపీబీఏ షట్లర్లను తీర్చిదిద్దుతోంది. వారిని ప్రోత్సహించడమే తప్ప కెరీర్లో వేర్వేరు దశల్లో ఎక్కడైనా వెళ్లిపోతామంటే ఎప్పుడూ ఆపలేదు. అది మా విధానం కూడా. అంతర్జాతీయ ప్రొఫెషనల్ క్రీడాకారుల కెరీర్ చాలా చిన్నది. తమ లక్ష్యాలు చేరుకునే క్రమంలో దక్కిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం కాబట్టి ఏం చేయాలనేది ఆటగాళ్లే నిర్ణయించుకోవాలి’ అని పీపీబీఏ స్పష్టం చేసింది. -
‘నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు’
ముంబై : మోడలింగ్‌కి వెళ్లిన తొలినాళ్లలో తన తల్లిదండ్రులు చాలా భయపడ్డారని, తన కోసం వారు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారని బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ చెప్పారు. కొత్త ప్రపంచంలోకి వెళ్లాలని 18ఏళ్ల వయసులో తాను తీసుకున్ననిర్ణయం ఎంత గొప్పదో ఆలోచిస్తే ఇప్పుడ ఆశ్చర్యం కలుగుతోందని చెబుతోంది. తన కేరీర్‌లోని తొలి రోజుల గురించి దీపికా తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘18 ఏళ్ల వయస్సులో ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు పెద్దగా ఆలోచించలేదు. సంబరపడుతూ ముంబైకి వెళ్లాను. కానీ అది ఎంత పెద్ద నిర్ణయం ఇప్పుడు అర్థమయింది. అప్పుడు నాకు ఆ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది’ అని దీపికా చెప్పారు ఇదే విషయంపై దీపికా తండ్రి, ప్రముఖ బాడ్మీంటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకోన్ మాట్లాడుతూ.. దిపికా ముంబైకి షిప్ట్ అయినప్పుడు చాలా భయపడ్డామన్నారు. ‘దిపికా నిర్ణయంతో తల్లిదండ్రులుగా మేం చాలా భయపడ్డాం. ఎందుకంటే అప్పుడు దీపికకి 18ఏళ్లు కూడా నిండలేదు. కొత్త రంగం( మోడలింగ్)లోకి అడుగుపెడుతోంది. ముంబైలో తెలినవారు కూడా ఎవరూ లేరు. అక్కడ దిపికా ఎలా ఉంటుందోనని భయపడ్డాం. కానీ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే.. తను సరైన నిర్ణయం తీసుకుందనిపిస్తుంది. సీనీ రంగంలో తక్కువ వయసులోనే కెరీర్ ప్రారంభిండం మంచిది’ అని అన్నారు. 18ఏళ్ల వయసులో దీపిక మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో దీపికను ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ చూశారు. ఆమె దర్శకత్వం వహించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో దీపిక బాలీవుడ్‌కు నటిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు. హాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందారు. మా అమ్మనాన్నలే నాకు ఆదర్శం : దీపికా -
శ్రీకాంత్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ ర్యాంకును సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్ బ్యాడ్మింటన్ చరిత్రలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను ప్రకాశ్ పదుకొనే తర్వాత తెలుగు వాడైన శ్రీకాంత్ సాధించినందుకు గర్వకారణంగా ఉందని ఒక ప్రకటనలో ప్రశంసించారు. శ్రీకాంత్ సాధించిన ఈ ఘనత పట్ల తెలుగువారందరూ ఎంతో గర్వపడుతున్నారని మెచ్చుకున్నారు. డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అలెక్సన్ వెనక్కి నెట్టి శ్రీకాంత్ నంబర్ వన్ ర్యాంక్ సాధించడం గొప్ప విషయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఇలాంటి మరెన్నో విజయాలు, పతకాలను సాధిస్తూ మరింత ఉన్నత శిఖరాలను శ్రీకాంత్ అధిరోహించాలని ఆకాంక్షించారు. అలానే నంబర్ వన్ ర్యాంకును ఎప్పటికీ సుస్థిరంగా ఉంచుకోవాలన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య గురువారం అధికారికంగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తం 76,895 పాయింట్లతో శ్రీకాంత్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. -
నన్ను మోసం చేశారు : రాహుల్ ద్రావిడ్
సాక్షి, బెంగళూరు : తనను బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మోసం చేసిందని టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ విమర్శించారు. ఆ కంపెనీపై సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన విక్రమ్ ఇన్వెస్టిమెంట్స్ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటే రూ.20కోట్లు పెట్టుబడి పెట్టానని తెలిపారు. అయితే లాభాలు ఇవ్వకపోగా అసలు పెట్టుబడిలో రూ.4కోట్లు ఆ కంపెనీ తమను మోసం చేసిందని వాపోయారు. ఆ కంపెనీ ఇదివరకే 800 మంది పెట్టుబడిదారులను మోసం చేసి దాదాపు రూ.300 కోట్ల మేర డబ్బు మాయం చేసినట్లు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన పీఆర్.బాలాజీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఇటీవల ఈ ఉదంతం వెలుగుచూసింది. ఈ కంపెనీపై ఇప్పటివరకు 100కుపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఇందులో పెట్టుబడి పెట్టి మోసపోయిన వారిలో ద్రావిడ్‌తో పాటు బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తండ్రి, బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకోన్ కూడా ఉన్నారు. -
ఇక కోచ్‌లకు శిక్షణ ఇవ్వాలి
ముంబై: అంతర్జాతీయస్థాయిలో కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ విజయాలతో భారత్‌లో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగింది. ఈ సమయంలోనే దేశంలో ఉన్న బ్యాడ్మింటన్ కోచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు విదేశాల నుంచి అగ్రశ్రేణి కోచ్‌లను రప్పించే విషయాన్ని ఆలోచించాలని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకొనె అభిప్రాయపడ్డారు. ‘దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతోంది. దీనికి సరిపడా నాణ్యమైన కోచ్‌ల అవసరం చాలా ఉంది. దీనిపై ‘బాయ్’, ‘సాయ్’ ప్రత్యేక దృష్టిపెట్టాలి. మన దగ్గర చాలా గొప్ప కోచ్‌లున్నారు. కానీ దురదృష్టవశాత్తూ వారి ప్రమాణాలను పెంచుకునే అవకాశాల్లేవు’ అని పడుకొనె అన్నారు. -
37 ఏళ్ల నిరీక్షణకు తెర.. తెలుగు తేజం సంచలనం
ఒడెన్స్: 37 ఏళ్ల నిరీక్షణకు తెలుగు తేజం తెరదించాడు. ప్రతిష్టాత్మక డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ సాధించాడు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 21-10, 21-5 తేడాతో 37 ఏళ్ల లీ హున్ ఇల్ (దక్షిణ కొరియా)పై వరుస సెట్లలో గెలుపొందాడు. డెన్మార్క్ సూపర్ సిరీస్ విజేతలో నిలవడంతో భాగంగా.. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ను ఓడించిన ఈ తెలుగు తేజం సెమీస్‌లోనూ వరుస గేముల్లో తన ప్రత్యర్థి వోంగ్ వింగ్ కీ విన్సెంట్‌ను చిత్తు చేసిన విజయం తెలిసిందే. టైటిల్ పోరులోనూ అదే పోరాట పటిమను ప్రదర్శించిన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ వరుస సెట్లలో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి లీ హున్ ఇల్ కు పోరాడే అవకాశమూ ఇవ్వలేదు. 1980లో ప్రకాశ్ పదుకొనె తర్వాత ఈ మెగా టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా శ్రీకాంత్ గుర్తింపు పొందాడు. 1980లో ప్రకాశ్ పదుకొనె ఈ టోర్నీలో విజేతగా నిలవగా, 37 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శ్రీకాంత్ ఈ సూపర్ సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున సైనా నెహ్వాల్ (2012లో) టైటిల్ నెగ్గగా... పీవీ సింధు (2015లో) రన్నరప్‌గా నిలిచింది. -
ప్రకాశ్ పడుకోన్‌కు జీవిత సాఫల్య పురస్కారం
కొచ్చి: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్ ‘బాయ్’ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఈ ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డుకు శ్రీకారం చుట్టడం ఇదే తొలిసారి. బాయ్ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘కొత్తగా ప్రవేశపెట్టిన ఈ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక అందజేస్తాం. బ్యాడ్మింటన్‌లో విశేష సేవలందించిన వారికి ప్రతీ ఏడాది ఈ అవార్డు ఇస్తాం. బెంగళూరులో జరిగిన గత ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాం. తొలి అవార్డును పడుకోన్‌కు ఇవ్వాలని కోర్ కమిటీ ప్రతిపాదించింది’ అని అన్నారు. 1980లో ప్రకాశ్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించారు. 1983లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 1978 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచారు. కేంద్ర ప్రభు త్వం ద్వారా 1972లో ‘అర్జున’, 1982లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు అందుకున్నారు. -
కొత్త స్కోరింగ్ విధానంతో మరింత ఆదరణ: ప్రకాశ్ పదుకొనె
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కోరింగ్ పద్ధతి వల్ల ఈ ఆటకు మరింత ప్రేక్షకాదరణ లభిస్తుందని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనె అభిఫ్రాయపడ్డారు. జనవరి 1న మొదలయ్యే పీబీఎల్–2లో 11 పాయింట్ల స్కోరింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. తక్కువ పాయింట్ల కారణంగా మ్యాచ్‌లో కచ్చితమైన ఫేవరెట్లు ఉండరని... ఎవరికైనా విజయావకాశాలు ఉంటాయని... దీంతో ఆట చూసేవారిలో ఆసక్తి అంతకంతకూ పెరుగుతుందని ఆయన అన్నారు. -
అది ఇల్లా...ఇంద్ర భవనమా?
ఇప్పుడు బాలీవుడ్లో అందరూ చెప్పుకుంటున్న విషయాల్లో దీపికా పదుకొనే కొనాలనుకుంటున్న ఇల్లు గురించిన వార్త ఒకటి. ఆ ఇంటి ఖరీదు 40 లక్షలు కాదు.. 4 కోట్లు కాదు.. ఏకంగా 40 కోట్లు అని సమాచారం. అయితే.. దీన్ని కచ్చితంగా ఇల్లు అనకూడదు.. ఇంద్ర భవనం అనాలని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం ముంబయ్‌లో దీపిక ఉంటున్న ఫ్లాట్ ఖరీదు 16 కోట్ల రూపాయలు. నాలుగు పడక గదులు ఉన్న ఆ ఫ్లాట్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెబితే... కామెడీగా ఉంటుంది. అన్ని కోట్లు పోసి కొన్నాక సౌకర్యాలు ఉండటం సహజం. మరి.. ఇప్పుడు 40 కోట్ల ఫ్లాట్ అంటే.. అది ఏ రేంజ్లో ఉంటుందో? ఆ సంగతి అన్నేసి కోట్లు పెట్టి కొన్నవాళ్లకి తెలుస్తుంది కానీ సామాన్యులు ఊహించడం కష్టం. ఇంతకీ దీపికా పదుకొనే ఈ ఖరీదైన ఫ్లాట్ ఎవరి కోసం కొన్నారో తెలుసా? ఓ వ్యక్తికి బహుమతిగా ఇవ్వడానికి. అంత స్పెషల్ పర్సన్ ఎవరా అని ఊహాగానాలు చేయొద్దు. ఆయనెవరో కాదు.. దీపికా తండ్రి ప్రకాశ్ పదుకొనే. దీపిక తల్లితండ్రులు బెంగళూరులో ఉంటారు. కూతుర్ని చూడ్డానికి అప్పుడప్పుడూ ముంబయ్ వస్తుంటారు. అలా వచ్చినప్పుడు మమ్మీ డాడీ ఉండడం కోసమే దీపికా పదుకొనే 40 కోట్ల ఫ్లాట్ కొన్నారట. -
నాన్నకు ప్రేమతో..!
ఇటు బాలీవుడ్లోనే కాదు అటు హాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది దీపికా పదుకొనే. ఆమె నటించిన తొలి హాలీవుడ్ సినిమా ‘ ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ముంబైలో తాను నివసించే టవర్లోనే ఓ ఖరీదైన ఫ్లాట్‌ను బుక్ చేసింది. 30వ అంతస్తులో ఉండే ఈ ఫ్లాట్ ధర అక్షరాలు 40 కోట్లు. ప్రస్తుతం 16 అంతస్తులో తాను ఉంటున్న 4బీహెచ్‌కే ఫ్లాట్‌ను గతంలో రూ. 16 కోట్లకు దీపిక కొనుగోలు చేసింది. మరీ ఈ ఖరీదైన ఫ్లాట్ ఎవరి కోసమంటే.. తన జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి కోసమని చెప్తోంది దీపిక. ఆయన ఎవరో కాదు దీపిక తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పదుకొనే. ఆయన కోసం ఈ ఖరీదైన కానుకను కొనుగోలు చేసింది. తనను చూసేందుకు ముంబైకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఈ విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉంటారట. ఎంతైనా నాన్న అంటే ఎంతో ప్రేమ కాబట్టి.. ఆయన కోసం ఈ కానుక ఇచ్చిందంటున్నారు సన్నిహితులు. -
సైనా మళ్లీ పతకం గెలవొచ్చు
బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే విశ్వాసం ముంబై: వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు పతకం గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సైనా ఆటతీరులో వైవిధ్యం కనిపిస్తోందని... ఇదే తరహా ఆటను ఆమె రియో ఒలింపిక్స్‌లోనూ ప్రదర్శిస్తే పతకం రావడం ఖాయమని ఆయన అన్నారు. లండన్ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన సైనా... ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఈ మాజీ నంబర్‌వన్ ప్లేయర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘సైనా ఆటలో వైవిధ్యం కనిపిస్తోంది. గతంలో ఆమె ఆటతీరును ప్రత్యర్థులు తొందరగానే అంచనా వేసేవారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం నెట్ గేమ్ ఎక్కువగా ఆడుతోంది. ఒక వ్యూహం విఫలమైతే మరో వ్యూహాన్ని అమలు చేస్తూ ఫలితాలు సాధిస్తోంది’ అని ఈ ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ విశ్లేషించారు. ఇటీవల కాలంలో ఎంత మెరుగ్గా ఆడినా... ఒలింపిక్స్ జరిగే సమయంలో కనబరిచే ఆటతీరే పతకావకాశాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. ‘ఒలింపిక్స్‌లో గత ప్రదర్శనను లెక్కలోకి తీసుకోలేం. ఆ రెండు వారాల్లో ఎవరైతే తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తారో వారికే పతకాలు వస్తాయి’ అని ప్రకాశ్ పదుకొనే అన్నారు. -
30 ఇయర్స్ థండర్!
జీవితం విలువ తెలిసింది! వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదురైన ఒడిదొడుకులు కొన్ని జీవిత సత్యాలను నేర్పాయని దీపిక పేర్కొన్నారు. ‘‘నేను ఒక పుస్తకంలో మంచి ఇన్స్పైరింగ్ లైన్ ఒకటి చదివాను. అదేంటంటే.. మనకు రెండు జీవితాలు ఉన్నాయి. రెండో జీవితం ఎప్పుడు మొదలవుతుందంటే.. మనకు ఒకే ఒక్క జీవితం ఉందని తెలిసినప్పుడు. ఈ మాటలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి కదూ. ఇప్పుడు జీవితం విలువ నాకు బాగా తెలుసు. కష్టాలను ఎలా అధిగమించాలో తెలిసింది. పాజిటివ్‌కి, నెగటివ్‌కి సమానంగా స్పందించడం నేర్చుకున్నాను’’ అని దీపిక తెలిపారు. గాలికి ఎగిరిపోయేట్లు ఉంది... ఈవిడగారు హీరోయిన్నా? కాస్త తెల్లగా ఉంటే బాగుండేది... ఎట్రాక్టివ్‌గా కనబడేది... పదుకొనే.. అదేం పేరు? ఎప్పుడూ పడుకునే ఉంటుందా...? ప్చ్.. అమ్మడు అస్సలు హీరోయిన్ మెటీరియల్ కానే కాదు... ఇలాంటి విమర్శలను దీపికా పదుకొనే ఎదుర్కొన్నారంటే అంత నమ్మశక్యంగా అనిపించదు. కానీ, ఇది వంద శాతం నిజం. పదేళ్ల క్రితం పదుకొనే గురించి ఇలాంటి విమర్శలు చేసింది స్వయంగా దక్షిణాది పరిశ్రమే. ఇప్పుడు బాలీవుడ్ కథానాయికగా ‘మోస్ట్ వాంటెడ్’ లిస్ట్‌లో ఉన్న దీపిక దక్షిణాదికి అందనంత ఎత్తుకి ఎదిగిపోయారు. నేడు ఈ బ్యూటీ బర్త్‌డే. 30 ఏళ్లు పూర్తి చేసుకుని, 31లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దీపిక గురించి కొన్ని ఇంట్రస్టింగ్ పాయింట్స్. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే మొదటి కూతురు దీపిక. డెన్మార్క్ లోని కోపెన్హ్యాగన్లో పుట్టింది. ఆ తర్వాత ఏడాదికి ఈ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. దీపికాకు ఓ చెల్లెలు ఉంది. పేరు అనీషా. ఆమె క్రీడా రంగంలో ఉంది. దీపిక చదువంతా బెంగళూరులోనే సాగింది. మోడలింగ్‌తో బిజీగా ఉండటంతో డిగ్రీ మధ్యలోనే ఆపేశారామె. జాతీయ స్థాయిలో దీపిక బ్యాడ్మింటన్ ఆడారు. ఒకవైపు చదువు, మరోవైపు బ్యాడ్మింటన్‌తో పాటు మోడల్‌గా కూడా చేసేవారు. క్రీడా రంగంలో కొనసాగలేననీ, తనకంతగా ఆసక్తి లేదని తండ్రి దగ్గర చెప్పడానికి తటాపటాయించారామె. చివరకు ధైర్యం చేసుకుని చెప్పేశారు. ప్రకాశ్ పదుకొనే ఫ్రెండ్లీ ఫాదర్. పిల్లల ఇష్టాలను కాదనరు. అందుకని మోడల్‌గా చేయడానికి దీపికాకు అనుమతి ఇచ్చేశారు. దాంతో 2004లో ఫుల్ టైమ్ మోడల్‌గా చేయడం మొదలుపెట్టారు. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించడం ద్వారా సినీ దర్శక-నిర్మాతల దృష్టిలో పడ్డారామె. ముఖ్యంగా కింగ్‌ఫిషర్ క్యాలండర్‌పై దర్శనమిచ్చిన తర్వాత దీపిక పాపులార్టీ పెరిగిపోయింది. అప్పుడే కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’లో అవకాశం దక్కించుకున్నారామె. ఇక, కథానాయికగా కొనసాగాలనే ఆకాంక్షతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ముంబయ్‌కి మకాం మార్చేశారు దీపిక. అక్కడ తన అత్తయ్యవాళ్ల ఇంట్లో ఉండేవారు. అప్పుడే హిమేష్ రేష్మియా రూపొందించిన ‘నామ్ హై తేరా’ మ్యూజిక్ వీడియోలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆ వీడియో ద్వారా బాలీవుడ్లో పాపులరయ్యారు దీపిక. ఎంత పాపులర్ అయినా సినిమా హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోవడం అంటే మాటలు కాదు. అందుకే ఓ ఏజెన్సీని సంప్రదించారు. ఆ ఏజెన్సీ ద్వారా తన ఫొటోలను ప్రొడక్షన్ ఆఫీసులకు పంపించారు. ఆ ఫొటోలు తెలుగు పరిశ్రమ వరకూ వచ్చాయి. 2006లో టాలీవుడ్‌కి దీపిక ఫొటోలు వచ్చాయి. కానీ, వాటిని చూసి ‘ఈ అమ్మాయి హీరోయినా?’ అని కొంతమంది వెటకారంగా మాట్లాడారు. పెద్ద దర్శక-నిర్మాతలు కూడా ఆమెను రిజెక్ట్ చేశారు. ఒకవైపు దక్షిణాదిన అవకాశాలు రాకపోవడం, హిందీలో తొలి చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆగిపోవడంతో దీపిక కొంచెం కంగారుపడ్డారు. కానీ, చిత్రదర్శకురాలు ఫరా ఖాన్ మాత్రం దీపికాకి ఎలాగైనా అవకాశం ఇవ్వాలనుకున్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆగిపోయిన తర్వాత ఫరా ఖాన్ ‘ఓం శాంతి ఓం’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ సరసన దీపిక పదుకొనేకి అవకాశం ఇచ్చారామె. అంతే.. ఆమె జీవితం మారిపోయింది. ఒక్క సినిమాతో దీపికా కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. మొదటి చిత్రంతోనే కుర్రకారు కలల రాణి అయిపోవడంతో పాటు దర్శక-నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారు. 2007లో ‘ఓం శాంతి ఓం’ రిలీజైంది. మలి చిత్రంగా చేసిన ‘బచ్నా ఏ హసీనో’తో దీపిక స్టార్ హీరోయిన్ అయిపోయారు. అక్కణ్ణుంచీ మొన్నా మధ్య విడుదలైన ‘బాజీరావ్ మస్తానీ’ వరకూ దీపికకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండాపోయింది. లవ్ ఆజ్ కల్, ఆరక్షణ్, కాక్టైల్, ఏ జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్‌లీల, పీకు, తమాషా, బాజీరావ్ మస్తానీ.. ఇలా దీపిక నటించిన చిత్రాల్లో కొన్ని బంపర్ హిట్ సాధిస్తే, కొన్ని నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చాయి. కోట్లు సంపాదిస్తూ దూసుకెళుతున్న దీపిక ముంబయ్‌లో సొంత ఇల్లు, కారు కొనుక్కున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బోల్డంత ఉంది. ‘‘ఎవరి మీదా ఆధారపడకుండా బతకడం చాలా ఆనందంగా ఉంది. దేవుడు నాకు ఎక్కువ ఇచ్చాడు. సంతృప్తిగా ఉంది’’ అని ఓ సందర్భంలో దీపిక పేర్కొన్నారు. రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో పడి, విడిపోయిన సమయంలో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. అందులోంచి బయటపడానికి కౌన్సిలింగ్ తీసుకున్నారు.. మందులు వాడారు. ఎట్టకేలకూ బయటపడ్డారు. ఇది జరిగి ఏడాది పైనే అయ్యింది. డిప్రెషన్లో ఉన్న విషయం గురించి దీపిక ఓపెన్‌గా చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారట. ‘ఇల్లు ఉంది.. కారు ఉంది. కోట్లు ఉన్నాయి.. అయినా డిప్రెషనా?’ అని దీపిక దగ్గర అనేవారట. ‘‘అన్నీ ఉన్నవాళ్లు డిప్రెషన్‌కి గురి కాకూడదా? నాకు ఆశ్చర్యం వేసింది. డిప్రెషన్ అనేది మనసుకి సంబంధించినది. ఐశ్వర్యవంతులు డిప్రెషన్‌కి గురి కాకూడదన్నప్పుడు... ‘మనకు ఆ మాత్రం హక్కు కూడా లేదా?’ అని డైలమాలో పడ్డాను’’ అని ఓ సందర్భంలో దీపిక పేర్కొన్నారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు దీపిక బెంగళూరు వెళ్లిపోయారు. దాదాపు మూడు, నాలుగు నెలలు తన తల్లిదండ్రులతోనే గడిపారు. ‘‘కంటి మీద కునుకు పట్టేది కాదు. ఆకలి వేసేది కాదు. నరకం కనిపించింది’’ అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ రోజులు తనను మానసికంగా బలవంతురాల్ని చేశాయని దీపిక అన్నారు.రణ్‌బీర్ కపూర్ నుంచి విడిపోయాక రణ్వీర్ సింగ్‌తో ప్రేమలో పడ్డారనే వార్త వినిపిస్తోంది. మరి.. దీపిక మెడలో మూడు ముళ్లు వేయబోయేది రణ్వీరేనా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. 2015లో దీపిక కెరీర్ బాగుంది. తమాషా, పీకు, బాజీరావ్ మస్తానీ వంటి విజయాలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. 2016 కూడా ఆమెదేనని బాలీవుడ్‌కి చెందిన ఓ జ్యోతిష్కుడు అంటున్నారు. ఈ ఏడాది ఆమె ఖాతాలో దాదాపు హిట్సే ఉంటాయనీ, నటిగా కూడా మరింత మంచి పేరు వచ్చే అవకాశం ఉందనీ జోస్యం చెబుతున్నారు. మరి... 2016 కూడా దీపికాదే అవుతుందా? వేచి చూద్దాం. -
ఎన్నోసార్లు తిరస్కరించారు!
‘‘నేను సినిమా పరిశ్రమకొచ్చిన ఈ ఎనిమిదేళ్లల్లో ఎన్నో జయాపజయాలు చవిచూశాను. కొన్నిసార్లు ‘ఈ సినిమాకి దీపికా పనికి రాదు’ అని తిరస్కరణకు కూడా గురయ్యాను. ఆ గాయం మానడానికి టైమ్ పట్టేది. అది మానేలోపు పుండు మీద కారం చల్లినట్లు ‘దీపికా కెరీర్ అంతే సంగతులు’ అనే మాటలు వినిపించేవి. స్వతహాగా క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని కాబట్టి, గెలుపు ఓటములను తేలికగా తీసుకోవడం అలవాటయ్యింది. మా నాన్న ప్రకాశ్ పదుకొనె (బ్యాడ్మింటన్ ప్లేయరు) జీవితమే నాకా మనస్తత్వాన్ని అలవాటు చేసింది. అందుకే, ఆటుపోట్లను తట్టుకోగలిగాను. ఇవాళ నన్ను అందరూ ‘స్టార్ హీరోయిన్’ అంటున్నారు. నీకు తిరుగు లేదంటున్నారు. డేట్స్ ఇస్తే చాలు.. సినిమా చేస్తామంటున్నారు. ఇదంతా సక్సెస్ మహిమే. ఈ స్టార్ డమ్‌ని నెత్తికెక్కించుకోకుండా ఎప్పటిలానే ఉండాలని అనుకు న్నాను. ఎందుకంటే, ఇవాళ ఎత్తేసినవాళ్లే రేపు పడేస్తారని నాకు తెలుసు. నా ఎనిమిదేళ్ల కెరీర్ నేర్పించిన విషయం ఒకటే. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడకూడదు. మనకు మనమే సహాయం చేసుకోవాలి’’. - దీపికా పదుకొనె