ప్యారిస్ ఒలింపిక్స్-2024 బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండానే భారత క్రీడాకారులు ఇంటిబాట పట్టారు. పీవీ సింధు, హెచ్ ఎస్ ప్రణయ్, సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ స్టార్ షట్లర్లు క్వార్టర్స్‌లో ఓటమి చెందడంతో.. అందరి ఆశలు సెమీఫైనల్‌కు చేరిన యువ షట్లర్ లక్ష్య సేన్‌పైనే ఉండేవి.
లక్ష్య సేన్ కూడా సెమీఫైనల్లో ఓటమి చవి చూసి నిరాశపరిచాడు. కనీసం కాంస్య పతకమైన ఈ యువ షట్లర్ సాధించాలని అందరూ ఆశించారు. కానీ కాంస్య పతకపోరులోనూ లక్ష్య సేన్ బోల్తాపడ్డాడు.
సోమవారం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో 21–13, 16–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో లక్ష్యసేన్ ఓడిపోయాడు. ఇక ఈ ఓటమిపై లక్ష్య సేన్ కోచ్ ప్రకాశ్ పడుకోన్ స్పందించాడు.
"పరాజయాలకు ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాల్సిన సమయం వచ్చింది. ఫలానా సౌకర్యాలు కావాలని అడగడమే కాదు... అవన్నీ ఇచ్చాక ఫలితాలతోపాటు పతకాలు కూడా తీసుకురావాలి. లక్ష్య సేన్ మరింత మెరుగవ్వాల్సి ఉంది. తప్పులు జరగడం సహజమే కానీ కోర్టులో పరిస్థితిని బట్టి ఆటను మార్చుకోవాలి.
ఈ విషయంలో సేన్‌కు మానసికంగా కూడా కొంత శిక్షణ అవసరం. భారత బ్యాడ్మింటన్‌లో ఒకరిద్దరు టాప్ ఆటగాళ్లపై మాత్రమే దృష్టి పెట్టకుండా తర్వాతి స్థాయిలో వారిని కూడా తీర్చిదిద్దితేనే విజయాలు లభిస్తాయని" ప్రకాశ్ పడుకోన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment