న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రస్తుతం ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. గత 18 నెలలుగా అటు టోర్నీల్లో వైఫల్యంతోపాటు గాయాలు కూడా ఆమెను వెంటాడాయి. 2023లో ఆమె ఒక్క టోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత సింధు మళ్లీ బరిలోకి దిగుతోంది.
పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోణంలో చూస్తే ఈ ఏడాది సింధుకు కీలక ఏడాది కానుంది. ఈ నెల 13 నుంచి మలేసియాలో జరిగే ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో సింధు పాల్గొంటోంది. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌కు తనకు పెద్ద సవాల్‌గా కనిపిస్తున్నాయని, ఈసారి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని సింధు అభిప్రాయపడింది.
గత కొంత కాలంగా సింధు బెంగళూరులో దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పడుకోన్ , ఇండోనేసియా కోచ్ అగుస్ ద్వి సాంతోసో వద్ద శిక్షణ తీసుకుంటోంది. ప్రకాశ్‌తో పాటు ఆమె ఇతర కోచింగ్ బృందంలో కూడా మార్పులు జరిగాయి. దీంతో మంచి ఫలితాలు రాబట్టగలనని ఆమె విశ్వాసంతో ఉంది. పలు అంశాలపై సింధు అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... |
♦ గత రెండు ఒలింపిక్స్‌లతో పోలిస్తే ఈసారి జరగబోయే పోటీలు నాకు భిన్నమైన అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి. 2016, 2020 ఒలింపిక్స్‌లతో పోలిస్తే నాకు పారిస్‌లో పెద్ద సవాల్ ఎదురు కానుంది. అయితే నాకు అనుభవం కూడా పెరిగింది. మరింత జాగ్రత్తగా, తెలివిగా ఆడాల్సి ఉంటుంది.
♦ మహిళల సర్క్యూట్‌లో టాప్ 10–15 షట్లర్లు బాగా బలమైనవారు. వారిని ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలు అనుసరించాలి. ప్లాన్ ‘ఎ’ పని చేయకపోతే ప్లాన్ ‘బి’ కోసం సిద్ధంగా ఉండాలి. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండే మానసిక దృఢత్వం కూడా అవసరం.
♦ ప్రకాశ్ సర్ లాంటి గొప్ప ఆటగాడితో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఆలోచనలు, శిక్షణా పద్ధతులు నాకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. కొత్త ట్రెయినర్, ఫిజియో, న్యూట్రిషనిస్ట్, కోచ్, మెంటార్... ఇలా అందరూ మారారు. వీరంతా నాకు ఎంతో సహకరిస్తున్నారు. దీని వల్ల నా ఆటలో వచ్చిన మార్పులు మున్ముందు కనిపిస్తాయి. పూర్తి ఫిట్‌గా నేను ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ కోసం సిద్ధమయ్యాను.
♦ గాయం నుంచి కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఆటలో వేగం అందుకునేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం నేను అదే స్థితిలో ఉన్నాను. గతంలో ఇలాంటి కఠిన పరిస్థితులను అధిగమించాను. 2015లో కూడా నేను గాయాలతో బాధపడుతూనే ఆరు నెలల పాటు ఆడాను. అయితే కోలుకొని రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగాను.
నా మీద నాకున్న నమ్మకంతో పోరాడి రజతం గెలిచాను. నాలుగేళ్ల తర్వాత మరిన్ని అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగి సెమీస్‌లో ఓడటం చాలా బాధించింది. ఫైనల్ చేరకపోవడంతో ఏడ్చేశాను. కానీ నాలుగో స్థానానికి, కాంస్య పతకానికి తేడా చాలా ఉంటుందని నా కోచ్ ప్రోత్సహించడంతో మూడో స్థానం కోసం మ్యాచ్‌లో సత్తా చాటి గెలిచాను. ఈ కాంస్యం కోసం నేను ఎంతో కష్టపడ్డానని అనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment