ఆల్‌ ఇంగ్లండ్‌లో అద్భుతం | Special Story About First Badminton Superstar Prakash Padukone | Sakshi
Sakshi News home page

ఆల్‌ ఇంగ్లండ్‌లో అద్భుతం

Published Sat, May 2 2020 2:30 AM | Last Updated on Sat, May 2 2020 9:59 AM

Special Story About First Badminton Superstar Prakash Padukone - Sakshi

సరిగ్గా 40 ఏళ్ల క్రితం... బ్యాడ్మింటన్‌కు ఒలింపిక్స్‌లో చోటు లేదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌ మూడేళ్లకు ఒకసారి మాత్రమే జరిగేది. ఇప్పటిలా పెద్ద సంఖ్యలో సూపర్‌ సిరీస్‌ టోర్నీలు లేవు. ఒక చోట విఫలమైతే తర్వాతి వారమే మళ్లీ తప్పుదిద్దుకొని మరో చోట విజేతగా నిలిచే అవకాశం ఏమాత్రం లేదు. అందుకే అలాంటి సమయంలో సాధించిన ఒక ప్రతిష్టాత్మక ట్రోఫీ విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బ్యాడ్మింటన్‌లో అతి పురాతనమైన ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ గురించి.... 1980లో ఇదే టైటిల్‌ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన దిగ్గజం ప్రకాశ్‌ పదుకొనే గురించి...

భారత బ్యాడ్మింటన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రకాశ్‌ పదుకొనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు నందు నటేకర్‌లాంటి షట్లర్లు కొంత గుర్తింపు తెచ్చుకున్నా పెద్దగా గుర్తుంచుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు. సరిగ్గా చెప్పాలంటే ఏదో నామ్‌కేవాస్తేగానే ఆట సాగింది. ఇలాంటి స్థితిలో ప్రకాశ్‌ దూసుకొచ్చాడు. 1974 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన తర్వాత 1978 ఎడ్మంటన్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణంతో ప్రకాశ్‌ ప్రభ వెలిగింది. ఆ తర్వాత ‘వింబుల్డన్‌ ఆఫ్‌ బ్యాడ్మింటన్‌’ ఆల్‌ ఇంగ్లండ్‌ విజయం ప్రకాశ్‌ను శిఖరాన నిలిపింది.

నిలకడైన ప్రదర్శనతో... 
ఆల్‌ ఇంగ్లండ్‌కు ముందు యూరప్‌లోనే ఉన్న ప్రకాశ్‌ అప్పటికే వరుసగా రెండు టైటిల్స్‌ డానిష్‌ ఓపెన్, స్వీడిష్‌ ఓపెన్‌ గెలిచి మంచి ఊపు మీదున్నాడు. అయితే ఆల్‌ ఇంగ్లండ్‌ విషయంలో మాత్రం అందరి అంచనాలు కొంత భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా 1978, 1979లలో టైటిల్స్‌ గెలిచి హ్యాట్రిక్‌ కోసం సిద్ధమైన లీమ్‌ స్వీ కింగ్‌ (ఇండోనేసియా) ఫేవరెట్‌గా నిలిచాడు. అలసటకు గురి కాకుండా ఉండేందుకు ప్రకాశ్‌ గెలిచిన గత రెండు టోర్నీలు ఆడకుండా కింగ్‌ దూరంగా ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ప్రకాశ్‌ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

వరుసగా తొలి మూడు మ్యాచ్‌లలో సూఫియాన్‌ (మలేసియా), హాదియాంతో (ఇండోనేసియా), స్వెండ్‌ ప్రి (డెన్మార్క్‌)లను చిత్తు చిత్తుగా ప్రకాశ్‌ ఓడించాడు. సెమీస్‌లో కొంత పోటీ ఎదురైనా ఫ్రాస్ట్‌ హాన్సెన్‌ (డెన్మార్క్‌)ను కూడా పడగొట్టి తుది పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో టైటిల్‌ ఫేవరెట్‌ స్వీ కింగ్‌తోనే తలపడాల్సి వచ్చింది. గతంలో అతనితో తలపడిన ప్రతీసారి పదుకొనేకు పరాజయమే ఎదురైంది. కానీ ఈసారి సీన్‌ మారిపోయింది. దూకుడైన ప్రత్యర్థిని ప్రశాంతంగా ఎదుర్కొని ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడిన ప్రకాశ్‌ పైచేయి సాధించాడు. చివరకు 15–3, 15–10తో భారత షట్లర్‌ సృష్టించిన కొత్త చరిత్ర ముందు కింగ్‌ చిన్నబోయాడు.

గ్రాండ్‌ వెల్‌కమ్‌... 
నిజానికి తన విజయం ఘనత ఏమిటో ఆ సమయంలో స్వయంగా ప్రకాశ్‌ కూడా గుర్తించలేదు. రెండేళ్ల క్రితం అతనుæ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచినప్పుడు 20–30 మంది ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి స్వాగతం పలికారు. ఇప్పుడు మహా అయితే మరో 10 మంది ఎక్కువగా వస్తారేమో అని అతనూ అనుకున్నాడు. కానీ కర్ణాటక ప్రభుత్వం నుంచి అతనికి అద్భుత రీతిలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి గుండూరావు స్వయంగా స్వాగతం పలికారు.

గుర్రపు రథాలు, వరుస వాహనాల సమేతంగా ఓపెన్‌ టాప్‌ జీపులో బెంగళూరు నగరమంతా చూసే విధంగా ప్రకాశ్‌ విజయయాత్ర సాగింది. ఆ తర్వాత ఘనంగా పౌరసన్మానం జరిగింది. 1980లో ఒక క్రీడాకారుడికి ఈ తరహా గౌరవం దక్కడం అసాధారణం. తాజా విజయంతో పదుకొనే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌గా కూడా నిలిచాడు. 1981లోనూ ప్రకాశ్‌ పదుకొనే, లీమ్‌ స్వీ కింగ్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకొచ్చారు. అయితే ఈసారి లీమ్‌ స్వీ కింగ్‌ది పైచేయి అయింది. ప్రకాశ్‌ రన్నరప్‌గా నిలిచాడు.

ప్రకాశ్‌ విజేతగా నిలిచిన 21 సంవత్సరాల తర్వాత 2001లో మన పుల్లెల గోపీచంద్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ సాధించి ఈ విజయం అందుకున్న రెండో భారతీయుడిగా నిలిచాడు. ఆ తర్వాత గత 19 ఏళ్లలో ఈ టైటిల్‌ మన భారత షట్లర్లు ఎవరికీ దక్కలేదు. ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్, ఆసియా, కామన్వెల్త్‌ పతకాలు, లెక్క లేనన్ని సూపర్‌ సిరీస్‌ విజయాలు... బ్యాడ్మింటన్‌ వేదికపై గత కొన్నేళ్ళలో భారత క్రీడాకారులు ఎన్నో ఘనతలు సాధించారు. కానీ ప్రకాశ్‌ పదుకొనే సాధించిన నాటి విజయానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement