All england
-
ప్రేక్షకులు లేకున్నా నిర్వహిస్తాం
లండన్: 2020లో కరోనా వైరస్ తీవ్రత ఉన్నా రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నిర్వహించారు. అయితే వింబుల్డన్ జరపడం మాత్రం సాధ్యం కాలేదు. ఇంగ్లండ్ దేశంలోని పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ఈ టోర్నీని రద్దు చేయాల్సి వచ్చింది. అయితే 2021లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వింబుల్డన్ జరిపి తీరుతామని నిర్వాహకులు ప్రకటించారు. అప్పటి వరకు పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నామని, అవసరమైతే ప్రేక్షకులు లేకుండానైనా జరుపుతామని వెల్లడించారు. ‘2021లో వింబుల్డన్ టోర్నీ నిర్వహించడానికే మా తొలి ప్రాధాన్యత. అందుకోసం ఇప్పటినుంచే అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నాం. ఆటగాళ్లు, సిబ్బంది, మా అతిథుల ఆరోగ్య పరిరక్షణ కూడా మా బాధ్యత కాబట్టి దానిపై కూడా దృష్టి పెడతాం. ప్రభుత్వ సహకారంతో ఈ విషయంలో ముందుకు వెళతాం. గ్యాలరీలు పూర్తిగా నిండిపోయే విధంగా అభిమానులను అనుమతిస్తూగానీ, పరిమిత సంఖ్యలో అనుమతిస్తూగానీ లేదంటే పూర్తిగా ప్రేక్షకులు లేకుండా గానీ... ఎలాగైనా వింబుల్డన్ జరగడం మాత్రం ఖాయం’ అని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్యాలీ బోల్టన్ స్పష్టం చేశారు. -
ఆల్ ఇంగ్లండ్‌లో అద్భుతం
సరిగ్గా 40 ఏళ్ల క్రితం... బ్యాడ్మింటన్‌కు ఒలింపిక్స్‌లో చోటు లేదు. ప్రపంచ చాంపియన్‌షిప్ మూడేళ్లకు ఒకసారి మాత్రమే జరిగేది. ఇప్పటిలా పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్ టోర్నీలు లేవు. ఒక చోట విఫలమైతే తర్వాతి వారమే మళ్లీ తప్పుదిద్దుకొని మరో చోట విజేతగా నిలిచే అవకాశం ఏమాత్రం లేదు. అందుకే అలాంటి సమయంలో సాధించిన ఒక ప్రతిష్టాత్మక ట్రోఫీ విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బ్యాడ్మింటన్‌లో అతి పురాతనమైన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ గురించి.... 1980లో ఇదే టైటిల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన దిగ్గజం ప్రకాశ్ పదుకొనే గురించి... భారత బ్యాడ్మింటన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రకాశ్ పదుకొనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు నందు నటేకర్లాంటి షట్లర్లు కొంత గుర్తింపు తెచ్చుకున్నా పెద్దగా గుర్తుంచుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు. సరిగ్గా చెప్పాలంటే ఏదో నామ్‌కేవాస్తేగానే ఆట సాగింది. ఇలాంటి స్థితిలో ప్రకాశ్ దూసుకొచ్చాడు. 1974 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన తర్వాత 1978 ఎడ్మంటన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో ప్రకాశ్ ప్రభ వెలిగింది. ఆ తర్వాత ‘వింబుల్డన్ ఆఫ్ బ్యాడ్మింటన్’ ఆల్ ఇంగ్లండ్ విజయం ప్రకాశ్‌ను శిఖరాన నిలిపింది. నిలకడైన ప్రదర్శనతో... ఆల్ ఇంగ్లండ్‌కు ముందు యూరప్‌లోనే ఉన్న ప్రకాశ్ అప్పటికే వరుసగా రెండు టైటిల్స్ డానిష్ ఓపెన్, స్వీడిష్ ఓపెన్ గెలిచి మంచి ఊపు మీదున్నాడు. అయితే ఆల్ ఇంగ్లండ్ విషయంలో మాత్రం అందరి అంచనాలు కొంత భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా 1978, 1979లలో టైటిల్స్ గెలిచి హ్యాట్రిక్ కోసం సిద్ధమైన లీమ్ స్వీ కింగ్ (ఇండోనేసియా) ఫేవరెట్‌గా నిలిచాడు. అలసటకు గురి కాకుండా ఉండేందుకు ప్రకాశ్ గెలిచిన గత రెండు టోర్నీలు ఆడకుండా కింగ్ దూరంగా ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ప్రకాశ్ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. వరుసగా తొలి మూడు మ్యాచ్‌లలో సూఫియాన్ (మలేసియా), హాదియాంతో (ఇండోనేసియా), స్వెండ్ ప్రి (డెన్మార్క్)లను చిత్తు చిత్తుగా ప్రకాశ్ ఓడించాడు. సెమీస్‌లో కొంత పోటీ ఎదురైనా ఫ్రాస్ట్ హాన్సెన్ (డెన్మార్క్)ను కూడా పడగొట్టి తుది పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ స్వీ కింగ్‌తోనే తలపడాల్సి వచ్చింది. గతంలో అతనితో తలపడిన ప్రతీసారి పదుకొనేకు పరాజయమే ఎదురైంది. కానీ ఈసారి సీన్ మారిపోయింది. దూకుడైన ప్రత్యర్థిని ప్రశాంతంగా ఎదుర్కొని ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడిన ప్రకాశ్ పైచేయి సాధించాడు. చివరకు 15–3, 15–10తో భారత షట్లర్ సృష్టించిన కొత్త చరిత్ర ముందు కింగ్ చిన్నబోయాడు. గ్రాండ్ వెల్కమ్... నిజానికి తన విజయం ఘనత ఏమిటో ఆ సమయంలో స్వయంగా ప్రకాశ్ కూడా గుర్తించలేదు. రెండేళ్ల క్రితం అతనుæ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచినప్పుడు 20–30 మంది ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి స్వాగతం పలికారు. ఇప్పుడు మహా అయితే మరో 10 మంది ఎక్కువగా వస్తారేమో అని అతనూ అనుకున్నాడు. కానీ కర్ణాటక ప్రభుత్వం నుంచి అతనికి అద్భుత రీతిలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి గుండూరావు స్వయంగా స్వాగతం పలికారు. గుర్రపు రథాలు, వరుస వాహనాల సమేతంగా ఓపెన్ టాప్ జీపులో బెంగళూరు నగరమంతా చూసే విధంగా ప్రకాశ్ విజయయాత్ర సాగింది. ఆ తర్వాత ఘనంగా పౌరసన్మానం జరిగింది. 1980లో ఒక క్రీడాకారుడికి ఈ తరహా గౌరవం దక్కడం అసాధారణం. తాజా విజయంతో పదుకొనే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా కూడా నిలిచాడు. 1981లోనూ ప్రకాశ్ పదుకొనే, లీమ్ స్వీ కింగ్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకొచ్చారు. అయితే ఈసారి లీమ్ స్వీ కింగ్‌ది పైచేయి అయింది. ప్రకాశ్ రన్నరప్‌గా నిలిచాడు. ప్రకాశ్ విజేతగా నిలిచిన 21 సంవత్సరాల తర్వాత 2001లో మన పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ సాధించి ఈ విజయం అందుకున్న రెండో భారతీయుడిగా నిలిచాడు. ఆ తర్వాత గత 19 ఏళ్లలో ఈ టైటిల్ మన భారత షట్లర్లు ఎవరికీ దక్కలేదు. ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు... ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్, ఆసియా, కామన్వెల్త్ పతకాలు, లెక్క లేనన్ని సూపర్ సిరీస్ విజయాలు... బ్యాడ్మింటన్ వేదికపై గత కొన్నేళ్ళలో భారత క్రీడాకారులు ఎన్నో ఘనతలు సాధించారు. కానీ ప్రకాశ్ పదుకొనే సాధించిన నాటి విజయానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. -
కల చెదిరింది...
‘ఆల్ ఇంగ్లండ్’ ఫైనల్లో ఓడిన సైనా రన్నరప్‌తో సరి ప్రపంచ చాంప్ మారిన్‌కు టైటిల్ బర్మింగ్హమ్: తన కెరీర్లో మరో ‘తొలి’ ఘనతను సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్’ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి తుది మెట్టుపై తడబడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా నెహ్వాల్ 21-16, 14-21, 7-21 స్కోరుతో ప్రస్తుత ప్రపంచ, యూరో చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. వరుసగా తొమ్మిదోసారి ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగిన సైనా తొలిసారి ఫైనల్‌కు చేరుకొని ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. అయితే విజేతగా నిలిచి ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ సరసన నిలవాలని ఆశించిన సైనాకు ప్రత్యర్థి మారిన్ నిరాశను మిగిల్చింది. గతేడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మారిన్ ఈ విజయంతో తన కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించింది. క్వార్టర్స్‌లో, సెమీస్‌లో పటిష్టమైన చైనా క్రీడాకారిణులను ఓడించిన సైనా అదే జోరును ఫైనల్లోనూ కనబరిచింది. తొలి గేమ్‌లో పూర్తి విశ్వాసంతో ఆడిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఆరంభంలో 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పదునైన స్మాష్‌లు, కోర్టులో చురుకైన కదలికలతో మారిన్‌పై ఆధిపత్యాన్ని చలాయించిన సైనా అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ దూకుడుగా ఆడిన సైనా 6-1తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంవైపు సాగుతున్నట్లు అనిపించింది. అయితే అప్పటిదాకా సైనా ఆటతీరును బేరీజు వేసుకున్న మారిన్ నెమ్మదిగా పుంజుకోవడం ప్రారంభించింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ... సైనాను కోర్టుకిరువైపులా ఆడిస్తూ... అవకాశం దొరికినప్పుడల్లా కళ్లు చెదిరే స్మాష్‌లు సంధిస్తూ... ఈ స్పెయిన్ అమ్మాయి జోరు పెంచింది. 12-13తో వెనుకబడిన దశ నుంచి తేరుకొని వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే ఊపులో మారిన్ రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. ళీ నిర్ణాయక మూడో గేమ్‌లో మారిన్ చెలరేగిపోగా... సైనా డీలా పడింది. అనవసర తప్పిదాలకు తోడు షటిల్స్ గమనాన్ని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమై వరుసగా పాయింట్లు కోల్పోయింది. అసలేం జరుగుతుందో సైనా తెలుసుకునేలోగా మారిన్ వరుసగా 8 పాయింట్లు గెలిచి 16-4తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. చివరకు స్మాష్ షా ట్‌తో విజయాన్ని ఖాయం చేసుకొని ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించింది. రన్నరప్‌గా నిలిచిన సైనా నెహ్వాల్‌కు 19 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 లక్షల 92 వేలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. విజేత కరోలినా మారిన్‌కు 37,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 23 లక్షల 54 వేలు)తోపాటు 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. సూపర్ సిరీస్ స్థాయి టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకొని ఓడిపోవడం సైనాకిది మూడోసారి. గతంలో సైనా 2011 ఇండోనేసియా ఓపెన్ ఫైనల్లో యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో; 2012 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో మినత్సు మితాని (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. రెండో గేమ్ నుంచి ఏకాగ్రత కోల్పోయాను. త్వరగా పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను తొందరగా ముగించాలని చూశాను. అనవసర పొరపాట్లు చేసి ఒత్తిడికి లోనయ్యాను. అగ్రశ్రేణి క్రీడాకారిణులతో ఆడుతున్నపుడు ఏ దశలోనైనా ఏమైనా జరగొచ్చు. ఎవరైనా ఏదో ఒకదశలో ఒత్తిడికి లోనవ్వచ్చు. ఫైనల్లో నా విషయంలో అదే జరిగింది. -సైనా నెహ్వాల్ మోదీ, కేసీఆర్ అభినందన ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచినా... సైనాను చూసి గర్విస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిందని, చక్కని ఆటతీరు కనబరిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అభినందించారు.