లండన్: 2020లో కరోనా వైరస్ తీవ్రత ఉన్నా రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నిర్వహించారు. అయితే వింబుల్డన్ జరపడం మాత్రం సాధ్యం కాలేదు. ఇంగ్లండ్ దేశంలోని పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ఈ టోర్నీని రద్దు చేయాల్సి వచ్చింది. అయితే 2021లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వింబుల్డన్ జరిపి తీరుతామని నిర్వాహకులు ప్రకటించారు. అప్పటి వరకు పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నామని, అవసరమైతే ప్రేక్షకులు లేకుండానైనా జరుపుతామని వెల్లడించారు.
‘2021లో వింబుల్డన్ టోర్నీ నిర్వహించడానికే మా తొలి ప్రాధాన్యత. అందుకోసం ఇప్పటినుంచే అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నాం. ఆటగాళ్లు, సిబ్బంది, మా అతిథుల ఆరోగ్య పరిరక్షణ కూడా మా బాధ్యత కాబట్టి దానిపై కూడా దృష్టి పెడతాం. ప్రభుత్వ సహకారంతో ఈ విషయంలో ముందుకు వెళతాం. గ్యాలరీలు పూర్తిగా నిండిపోయే విధంగా అభిమానులను అనుమతిస్తూగానీ, పరిమిత సంఖ్యలో అనుమతిస్తూగానీ లేదంటే పూర్తిగా ప్రేక్షకులు లేకుండా గానీ... ఎలాగైనా వింబుల్డన్ జరగడం మాత్రం ఖాయం’ అని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్యాలీ బోల్టన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment