Wimbledon tourney
-
ప్రిక్వార్టర్స్‌లో జ్వెరెవ్
లండన్: గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్‌లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరో వైపు మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌పై అనామక ప్లేయర్ యులివ పుతిన్‌త్సెవా (కజకిస్తాన్) సంచలన విజయాన్ని నమోదు చేసింది. శనివారం కూడా వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌లన్నీ ఆలస్యమయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్ పోరులో నాలుగో సీడ్ జ్వెరెవ్ 6–4, 6–4, 7–6 (17/15)తో కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలుపొందాడు. తొలి రెండు సెట్లను అలవోకగానే గెలుచుకున్న జర్మనీ స్టార్‌కు మూడో సెట్లో నోరీ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. దీంతో సెట్ ఫలితం తేల్చేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. మిగతా మ్యాచ్‌ల్లో వుగో హంబెర్ట్ (ఫ్రాన్స్) 7–6 (11/9), 6–3, 6–7 (5/7), 7–6 (8/6)తో బ్రాండన్ నకషిమా (అమెరికా)ను, బెన్ షెల్టన్ (అమెరికా) 6–7 (4/7), 6–2, 6–4, 4–6, 6–2తో షపొవలోవ్ (కెనడా)ను ఓడించగా, ఈ సీజన్ ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) 6–1, 6–4, 6–2తో కెక్మనొవిచ్ (సెర్బియా)పై అలవోక విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పొలాండ్) 6–3, 1–6, 2–6తో యులివ పుతిన్‌త్సెవా (కజకిస్తాన్) చేతిలో కంగుతింది. మిగతా మ్యాచ్‌ల్లో జెలీనా ఒస్టాపెంకో (లాతి్వయా) 6–1, 6–3తో బెర్నార్డ పెర (అమెరికా)పై సునాయాస విజయం సాధించింది. గత వింబుల్డన్ సెమీఫైనలిస్ట్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 7–6 (7/4)తో పదో సీడ్ జాబెర్ (ట్యూనిíÙయా)పై గెలుపొందగా, బార్బర క్రెజ్సికొవా (చెక్ రిపబ్లిక్) 6–0, 4–3తో జెస్సికా బౌజస్ మనెరో (స్పెయిన్)పై ఆధిక్యంలో ఉన్న దశలో మనెరో మ్యాచ్ నుంచి తప్పుకుంది. మనెరో ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ వొండ్రుసొవాపై సంచలన విజయం సాధించింది. ఎమ్మా రాడుకాను (బ్రిటన్) 6–2, 6–3తో తొమ్మిదో సీడ్ మరియా సకారి (గ్రీస్)ని కంగుతినిపించింది. ఈ సీజన్లో ఆ్రస్టేలియా, ఫ్రెంచ్ ఓపెన్లలో సెమీఫైనలిస్టుగా నిలిచిన కోకో గాఫ్ (అమెరికా) 6–4, 6–0తో సోనే కర్టల్ (బ్రిటన్)పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్ రోహన్ బోపన్న–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 3–6, 6–7 (4/7)తో ఫ్రాంట్జెన్–జెబెన్స్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోవడంతో వింబుల్డన్‌లో భారత్ పోరాటం ముగిసింది. సచిన్‌కు స్టాండింగ్ ఒవేషన్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ‘సెంట్రల్ కోర్టులోకి మళ్లీ మిమ్మల్ని ఆహ్వానించడం గర్వంగా ఉంది. మనతో క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ఉన్నాడు’ అని నిర్వాహకులు ప్రకటించగా...ప్రేక్షకులంతా గౌరవభావం ప్రదర్శిస్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. -
ప్రేక్షకులు లేకున్నా నిర్వహిస్తాం
లండన్: 2020లో కరోనా వైరస్ తీవ్రత ఉన్నా రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నిర్వహించారు. అయితే వింబుల్డన్ జరపడం మాత్రం సాధ్యం కాలేదు. ఇంగ్లండ్ దేశంలోని పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ఈ టోర్నీని రద్దు చేయాల్సి వచ్చింది. అయితే 2021లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వింబుల్డన్ జరిపి తీరుతామని నిర్వాహకులు ప్రకటించారు. అప్పటి వరకు పరిస్థితులు మెరుగవుతాయని ఆశిస్తున్నామని, అవసరమైతే ప్రేక్షకులు లేకుండానైనా జరుపుతామని వెల్లడించారు. ‘2021లో వింబుల్డన్ టోర్నీ నిర్వహించడానికే మా తొలి ప్రాధాన్యత. అందుకోసం ఇప్పటినుంచే అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నాం. ఆటగాళ్లు, సిబ్బంది, మా అతిథుల ఆరోగ్య పరిరక్షణ కూడా మా బాధ్యత కాబట్టి దానిపై కూడా దృష్టి పెడతాం. ప్రభుత్వ సహకారంతో ఈ విషయంలో ముందుకు వెళతాం. గ్యాలరీలు పూర్తిగా నిండిపోయే విధంగా అభిమానులను అనుమతిస్తూగానీ, పరిమిత సంఖ్యలో అనుమతిస్తూగానీ లేదంటే పూర్తిగా ప్రేక్షకులు లేకుండా గానీ... ఎలాగైనా వింబుల్డన్ జరగడం మాత్రం ఖాయం’ అని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్యాలీ బోల్టన్ స్పష్టం చేశారు. -
యూఎస్ ఓపెన్‌లో సెరెనా ‘హ్యాట్రిక్’
ఒకవైపు వయస్సు మూడు పదులు దాటింది. మరోవైపు తెరపైకి యువ క్రీడాకారిణులు దూసుకొస్తున్నారు. ఇంకోవైపు ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలోనూ కనీసం నాలుగో రౌండ్‌ను దాటలేకపోయింది. ఇంకేముంది... అందరూ సెరెనా విలియమ్స్ పనైపోయిందన్నారు. కానీ ఈ నల్లకలువ మాత్రం కష్టకాలంలో అందరిలా చింతిస్తూ డీలాపడలేదు. అనవసరంగా ఒత్తిడికి లోనై మరింతగా కుంగిపోలేదు. పొరపాట్లను సరిదిద్దుకుని సొంతగడ్డపై నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. అందరి నోళ్లు మూతపడేలా మరోసారి ‘గ్రాండ్’ విజయాన్ని సాధించి నవ్వులు చిందించింది. * ఆరోసారి ప్రతిష్టాత్మక టైటిల్ వశం * కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ హస్తగతం * నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్ సరసన చేరిక * రూ. 24 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం న్యూయార్క్: ఈ ఏడాది ఎదురైన అన్ని వైఫల్యాలను ఒక్కసారిగా మరచిపోయేలా అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ అదుర్స్ అనిపించింది. తనకెంతో కలిసొచ్చిన యూఎస్ ఓపెన్‌లో ఆరోసారి విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 75 నిమిషాల్లో 6-3, 6-3తో పదో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది చాంపియన్‌గా నిలిచిన సెరెనా ‘హ్యాట్రిక్’ను పూర్తి చేసింది. 32 ఏళ్ల సెరెనాకిది ఓవరాల్‌గా ఆరో యూఎస్ ఓపెన్ టైటిల్‌కాగా... కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. అదే జోరు... ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీల్లో నాలుగో రౌండ్ దాటలేకపోయిన సెరెనా యూఎస్ ఓపెన్‌లో మాత్రం ఆద్యంతం పూర్తి విశ్వాసంతో ఆడింది. ఫైనల్ చేరుకునే క్రమంలో తన ప్రత్యర్థులకు గరిష్టంగా ఒక్కో సెట్లో మూడు గేమ్‌లు సమర్పించుకున్న సెరెనా అదే ఆనవాయితీని టైటిల్ పోరులో కొనసాగించింది. మ్యాచ్ తొలి గేమ్‌లోనే తన సర్వీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడిన సెరెనా ‘ఏస్’తో కాపాడుకుంది. ఆ తర్వాత రెండో గేమ్‌లో వొజ్నియాకి సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రెండోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్ ఆడుతోన్న వొజ్నియాకి గట్టిపోటీనిచ్చినా సెరెనా అనుభవం ముందు తడబడింది. తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెరెనా తొలి సెట్‌ను 40 నిమిషాల్లో 6-3తో దక్కించుకుంది. సెరెనా రెండో సెట్లోనూ దూకుడుగా ఆడింది. మరోవైపు వొజ్నియాకికి అదృష్టం కూడా కలిసిరాలేదు. 20 షాట్ల ర్యాలీలో వొజ్నియాకి కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో రెండో సెట్లోని తొలి గేమ్‌లోనే సెరెనాకు బ్రేక్ లభించింది. వొజ్నియాకి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సెరెనా జోరుకు కళ్లెం వేయలేకపోయింది. కోర్టులోని అన్ని కోణాల్లో నుంచి సెరెనా పాయింట్లు గెలుస్తుండటంతో ఈ డెన్మార్క్ భామ ఏమీ చేయలేకపోయింది. తొమ్మిదో గేమ్‌లో వొజ్నియాకి కొట్టిన బ్యాక్‌హాండ్ షాట్ కోర్టు బయటకు వెళ్లడంతో సెరెనా విజయం ఖాయమైంది. మ్యాచ్ మొత్తంలో సెరెనా ఏడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు 15సార్లు దూసుకొచ్చి 13 పాయింట్లు నెగ్గింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, వొజ్నియాకి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. తాజా విజయంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన వారి జాబితాలో సెరెనా (18 టైటిల్స్) ఉమ్మడిగా నాలుగో స్థానానికి చేరుకొని... దిగ్గజాలు మార్టినా నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్ (అమెరికా) సరసన చేరింది. ఈ జాబితాలో మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్-ఆస్ట్రేలియా), స్టెఫీ గ్రాఫ్ (22 టైటిల్స్-జర్మనీ), హెలెన్ విల్స్ మూడీ (19 టైటిల్స్-అమెరికా) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. విజేతగా నిలిచిన సెరెనాకు 30 లక్షల డాలర్లు (రూ. 18 కోట్లు)... యూఎస్ ఓపెన్‌కు సన్నాహకంగా నిర్వహించిన టోర్నీల్లో రాణించినందుకు అదనంగా మరో 10 లక్షల డాలర్లు (రూ. 6 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. టెన్నిస్ చరిత్రలో ఏకకాలంలో ఒక్కరే 40 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకోవడం ఇంతకుముందెప్పుడూ జరగలేదు. రన్నరప్ వొజ్నియాకికి 14 లక్షల 50 వేల డాలర్ల (రూ. 8 కోట్ల 73 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. చాంపియన్ సెరెనాకు నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్ కలిసి విన్నర్స్ ట్రోఫీని అందజేశారు. దాంతోపాటు 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌కు సూచికగా 18 క్యారెట్ల విలువగల గోల్డ్ బ్రేస్‌లెట్‌ను బహూకరించారు. ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెరెనా ఐదోసారి (2002, 2010-వింబుల్డన్‌లో; 2002, 2008, 2014-యూఎస్ ఓపెన్‌లో) గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించి స్టెఫీ గ్రాఫ్, క్రిస్ ఎవర్ట్ సరసన చేరింది. ఈ ఘనతను మార్టినా నవ్రతిలోవా అత్యధికంగా ఆరుసార్లు సాధించింది. ‘వొజ్నియాకికి అభినందనలు. నేను ఎలాంటి కష్టాలు పడ్డానో ఆమెకు తెలుసు. దాదాపు ప్రతిరోజూ మేమిద్దరం మాట్లాడుకుంటాం. త్వరలోనే వొజ్నియాకి కూడా గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అవుతుంది. అది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సాధ్యం కావచ్చు. 18వ గ్రాండ్‌స్లామ్ నెగ్గడం ఆనందాన్నిస్తోంది. ఈ ఘనత సాధించడానికి ఇంతకంటే మంచి వేదికను ఆశించలేను. ఒకవేళ నా టైటిల్స్ వేట 18తోనే ఆగిపోతే నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్ బహూకరించిన 18 క్యారెట్ల బ్రేస్‌లెట్‌ను ఎల్లప్పుడూ ధరిస్తాను. టోర్నీ మొత్తం నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ వారంలోనే కాదు గత ఆరు నెలలుగా తీవ్రంగా సాధన చేస్తున్నాను. ఆ శ్రమకు ఇప్పడు ఫలితం కనిపిస్తోంది.’ -సెరెనా