నంబర్‌వన్ స్వియాటెక్ అవుట్
వింబుల్డన్ టోర్నీ
లండన్: గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్‌లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరో వైపు మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌పై అనామక ప్లేయర్ యులివ పుతిన్‌త్సెవా (కజకిస్తాన్) సంచలన విజయాన్ని నమోదు చేసింది.
శనివారం కూడా వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌లన్నీ ఆలస్యమయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్ పోరులో నాలుగో సీడ్ జ్వెరెవ్ 6–4, 6–4, 7–6 (17/15)తో కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలుపొందాడు. తొలి రెండు సెట్లను అలవోకగానే గెలుచుకున్న జర్మనీ స్టార్‌కు మూడో సెట్లో నోరీ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. దీంతో సెట్ ఫలితం తేల్చేందుకు టైబ్రేక్ అనివార్యమైంది.
మిగతా మ్యాచ్‌ల్లో వుగో హంబెర్ట్ (ఫ్రాన్స్) 7–6 (11/9), 6–3, 6–7 (5/7), 7–6 (8/6)తో బ్రాండన్ నకషిమా (అమెరికా)ను, బెన్ షెల్టన్ (అమెరికా) 6–7 (4/7), 6–2, 6–4, 4–6, 6–2తో షపొవలోవ్ (కెనడా)ను ఓడించగా, ఈ సీజన్ ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) 6–1, 6–4, 6–2తో కెక్మనొవిచ్ (సెర్బియా)పై అలవోక విజయం సాధించాడు.
మహిళల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పొలాండ్) 6–3, 1–6, 2–6తో యులివ పుతిన్‌త్సెవా (కజకిస్తాన్) చేతిలో కంగుతింది. మిగతా మ్యాచ్‌ల్లో జెలీనా ఒస్టాపెంకో (లాతి్వయా) 6–1, 6–3తో బెర్నార్డ పెర (అమెరికా)పై సునాయాస విజయం సాధించింది.
గత వింబుల్డన్ సెమీఫైనలిస్ట్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 7–6 (7/4)తో పదో సీడ్ జాబెర్ (ట్యూనిíÙయా)పై గెలుపొందగా, బార్బర క్రెజ్‌సికొవా (చెక్ రిపబ్లిక్) 6–0, 4–3తో జెస్సికా బౌజస్ మనెరో (స్పెయిన్)పై ఆధిక్యంలో ఉన్న దశలో మనెరో మ్యాచ్ నుంచి తప్పుకుంది. మనెరో ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ వొండ్రుసొవాపై సంచలన విజయం సాధించింది. ఎమ్మా రాడుకాను (బ్రిటన్) 6–2, 6–3తో తొమ్మిదో సీడ్ మరియా సకారి (గ్రీస్)ని కంగుతినిపించింది.
ఈ సీజన్‌లో ఆ్రస్టేలియా, ఫ్రెంచ్ ఓపెన్‌లలో సెమీఫైనలిస్టుగా నిలిచిన కోకో గాఫ్ (అమెరికా) 6–4, 6–0తో సోనే కర్టల్ (బ్రిటన్)పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్ రోహన్ బోపన్న–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 3–6, 6–7 (4/7)తో ఫ్రాంట్‌జెన్–జెబెన్స్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోవడంతో వింబుల్డన్‌లో భారత్ పోరాటం ముగిసింది.
సచిన్‌కు స్టాండింగ్ ఒవేషన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ‘సెంట్రల్ కోర్టులోకి మళ్లీ మిమ్మల్ని ఆహ్వానించడం గర్వంగా ఉంది. మనతో క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ఉన్నాడు’ అని నిర్వాహకులు ప్రకటించగా...ప్రేక్షకులంతా గౌరవభావం ప్రదర్శిస్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment