Badminton Champion
-
2021లోనే కోర్టులోకి...
హైదరాబాద్: బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఈ ఏడాది ఏ టోర్నీలోనూ బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. 2021లోనే మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాలని ఆమె దాదాపుగా నిశ్చయించుకుంది. కరోనా విరామం తర్వాత ఆగస్టులోనే మళ్లీ శిక్షణ ప్రారంభించినా... సింధు ఇప్పటి వరకు టోర్నీ ఆడలేదు. ప్రస్తుతం జరుగుతున్న డెన్మార్క్ ఓపెన్ నుంచి కూడా తప్పుకుంది. జనవరిలో జరిగే ఆసియా ఓపెన్–1, 2లలో సింధు ఆడవచ్చు. ‘బ్యాడ్మింటన్‌కు చాలా రోజులుగా దూరం కావడం వెలితిగా అనిపిస్తోంది. అయితే రోజూ సాధన చేస్తున్నాను కాబట్టి పూర్తి ఫిట్‌గా ఉన్నాను. ఒకసారి ఆడటం మొదలు పెట్టాక అలవాటయ్యేందుకు ఒకటి లేదా రెండు వారాలు పట్టవచ్చు. అంతే తప్ప ఎలాంటి ఇబ్బందీ లేదు. టోర్నీల కోసం నేను సిద్ధంగా ఉన్నా. ఏడు నెలలుగా అందరూ ఆటకు దూరంగా ఉన్నారు కాబట్టి ఒక సవాల్‌గా అనిపించవచ్చు. కానీ అందరి ఆట కూడా మెరుగు పడి ఉండవచ్చు. రాబోయే రోజుల్లో అంతా టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నవారే కాబట్టి ప్రతీ ఒక్కరి నుంచి గట్టి పోటీ తప్పదు. కోవిడ్–19తో ప్రపంచం మొత్తం ఆగిపోయింది కాబట్టి ఆటకు దూరమయ్యాననే బాధ లేదు. ఆటకంటే జీవితాలు ముఖ్యం’ అని సింధు వ్యాఖ్యానించింది. -
ఆల్ ఇంగ్లండ్‌లో అద్భుతం
సరిగ్గా 40 ఏళ్ల క్రితం... బ్యాడ్మింటన్‌కు ఒలింపిక్స్‌లో చోటు లేదు. ప్రపంచ చాంపియన్‌షిప్ మూడేళ్లకు ఒకసారి మాత్రమే జరిగేది. ఇప్పటిలా పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్ టోర్నీలు లేవు. ఒక చోట విఫలమైతే తర్వాతి వారమే మళ్లీ తప్పుదిద్దుకొని మరో చోట విజేతగా నిలిచే అవకాశం ఏమాత్రం లేదు. అందుకే అలాంటి సమయంలో సాధించిన ఒక ప్రతిష్టాత్మక ట్రోఫీ విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బ్యాడ్మింటన్‌లో అతి పురాతనమైన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ గురించి.... 1980లో ఇదే టైటిల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన దిగ్గజం ప్రకాశ్ పదుకొనే గురించి... భారత బ్యాడ్మింటన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రకాశ్ పదుకొనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు నందు నటేకర్లాంటి షట్లర్లు కొంత గుర్తింపు తెచ్చుకున్నా పెద్దగా గుర్తుంచుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు. సరిగ్గా చెప్పాలంటే ఏదో నామ్‌కేవాస్తేగానే ఆట సాగింది. ఇలాంటి స్థితిలో ప్రకాశ్ దూసుకొచ్చాడు. 1974 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన తర్వాత 1978 ఎడ్మంటన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో ప్రకాశ్ ప్రభ వెలిగింది. ఆ తర్వాత ‘వింబుల్డన్ ఆఫ్ బ్యాడ్మింటన్’ ఆల్ ఇంగ్లండ్ విజయం ప్రకాశ్‌ను శిఖరాన నిలిపింది. నిలకడైన ప్రదర్శనతో... ఆల్ ఇంగ్లండ్‌కు ముందు యూరప్‌లోనే ఉన్న ప్రకాశ్ అప్పటికే వరుసగా రెండు టైటిల్స్ డానిష్ ఓపెన్, స్వీడిష్ ఓపెన్ గెలిచి మంచి ఊపు మీదున్నాడు. అయితే ఆల్ ఇంగ్లండ్ విషయంలో మాత్రం అందరి అంచనాలు కొంత భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా 1978, 1979లలో టైటిల్స్ గెలిచి హ్యాట్రిక్ కోసం సిద్ధమైన లీమ్ స్వీ కింగ్ (ఇండోనేసియా) ఫేవరెట్‌గా నిలిచాడు. అలసటకు గురి కాకుండా ఉండేందుకు ప్రకాశ్ గెలిచిన గత రెండు టోర్నీలు ఆడకుండా కింగ్ దూరంగా ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ప్రకాశ్ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. వరుసగా తొలి మూడు మ్యాచ్‌లలో సూఫియాన్ (మలేసియా), హాదియాంతో (ఇండోనేసియా), స్వెండ్ ప్రి (డెన్మార్క్)లను చిత్తు చిత్తుగా ప్రకాశ్ ఓడించాడు. సెమీస్‌లో కొంత పోటీ ఎదురైనా ఫ్రాస్ట్ హాన్సెన్ (డెన్మార్క్)ను కూడా పడగొట్టి తుది పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ స్వీ కింగ్‌తోనే తలపడాల్సి వచ్చింది. గతంలో అతనితో తలపడిన ప్రతీసారి పదుకొనేకు పరాజయమే ఎదురైంది. కానీ ఈసారి సీన్ మారిపోయింది. దూకుడైన ప్రత్యర్థిని ప్రశాంతంగా ఎదుర్కొని ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడిన ప్రకాశ్ పైచేయి సాధించాడు. చివరకు 15–3, 15–10తో భారత షట్లర్ సృష్టించిన కొత్త చరిత్ర ముందు కింగ్ చిన్నబోయాడు. గ్రాండ్ వెల్కమ్... నిజానికి తన విజయం ఘనత ఏమిటో ఆ సమయంలో స్వయంగా ప్రకాశ్ కూడా గుర్తించలేదు. రెండేళ్ల క్రితం అతనుæ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచినప్పుడు 20–30 మంది ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి స్వాగతం పలికారు. ఇప్పుడు మహా అయితే మరో 10 మంది ఎక్కువగా వస్తారేమో అని అతనూ అనుకున్నాడు. కానీ కర్ణాటక ప్రభుత్వం నుంచి అతనికి అద్భుత రీతిలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి గుండూరావు స్వయంగా స్వాగతం పలికారు. గుర్రపు రథాలు, వరుస వాహనాల సమేతంగా ఓపెన్ టాప్ జీపులో బెంగళూరు నగరమంతా చూసే విధంగా ప్రకాశ్ విజయయాత్ర సాగింది. ఆ తర్వాత ఘనంగా పౌరసన్మానం జరిగింది. 1980లో ఒక క్రీడాకారుడికి ఈ తరహా గౌరవం దక్కడం అసాధారణం. తాజా విజయంతో పదుకొనే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా కూడా నిలిచాడు. 1981లోనూ ప్రకాశ్ పదుకొనే, లీమ్ స్వీ కింగ్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకొచ్చారు. అయితే ఈసారి లీమ్ స్వీ కింగ్‌ది పైచేయి అయింది. ప్రకాశ్ రన్నరప్‌గా నిలిచాడు. ప్రకాశ్ విజేతగా నిలిచిన 21 సంవత్సరాల తర్వాత 2001లో మన పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ సాధించి ఈ విజయం అందుకున్న రెండో భారతీయుడిగా నిలిచాడు. ఆ తర్వాత గత 19 ఏళ్లలో ఈ టైటిల్ మన భారత షట్లర్లు ఎవరికీ దక్కలేదు. ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు... ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్, ఆసియా, కామన్వెల్త్ పతకాలు, లెక్క లేనన్ని సూపర్ సిరీస్ విజయాలు... బ్యాడ్మింటన్ వేదికపై గత కొన్నేళ్ళలో భారత క్రీడాకారులు ఎన్నో ఘనతలు సాధించారు. కానీ ప్రకాశ్ పదుకొనే సాధించిన నాటి విజయానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. -
బీజేపీలోకి సైనా
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. ఆమె సోదరి చంద్రాన్షు సైతం బీజేపీలో చేరారు. బుధవారం వారిద్దరూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం పార్టీలో చేరి మీడియాతో మాట్లాడారు. ‘క్రీడారంగంలో అనేక టైటిల్స్ గెలిచాను. దేశం పేరు నిలబెట్టాను. దేశం కోసం మంచి చేసే బీజేపీలో నేడు చేరాను. కష్టపడి పనిచేసే వారంటే చాలా ఇష్టం. మోదీ రాత్రి పగలూ కష్టపడి దేశం కోసం పనిచేస్తున్నారు. ఆయనతో కలిసి దేశం కోసం పనిచేయడం నా అదృష్టం. మోదీ దేశంలో క్రీడారంగానికి చాలా మేలు చేశారు. నరేంద్ర మోదీ నుంచి నాకు స్ఫూర్తి లభిస్తుంది. దేశం కోసం మంచి చేస్తానన్న నమ్మకం ఉంది..’ అని పేర్కొన్నారు. -
వెల్డన్.. టాప్ స్టార్..!
సాక్షి, సిటీబ్యూరో: విశ్వ విజేతగా నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుపై నగర వాసులు అభినందన జల్లులు కురిపించారు.హైదరాబాదీ స్టైల్‌తో దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన సింధు నేటి తరానికి ఆదర్శమని తోటి క్రీడాకారులు, ఆమె క్లాస్మేట్లు కొనియాడారు. సింధు ఇప్పుడు మరింత మందికి రోల్‌మాడల్ అయ్యారంటూ వందల కొద్ది ట్వీట్లువెల్లువెత్తాయి. పలువురు నగర ప్రముఖులు కూడా సింధును ప్రత్యేకంగా అభినందించారు. శభాష్ సింధు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీభారత్ చరిత్రలో తొలిసారి షటిల్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన పీవీ సింధుకు అభినందనలు. భారత జాతి పోరాట పటిమకు పీవీ సింధు నిదర్శనం. గణపతి ఆశీస్సులతో..: దొర రాజు, ‘ఆలివ్’ నిర్వాహకులు టోర్నీకి వెళ్లే ముందు సింధు ‘ఆలివ్’ మట్టి గణపతిని ఆవిష్కరించారు. దాంతో విఘ్నాలన్నీ తొలగిపోయి...ఆమె ఘన విజయం సులభమైంది. హ్యాట్సాఫ్ సింధు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు: దగ్గుబాటి సురేష్, సినీ నిర్మాత మన తెలుగు అమ్మాయి ప్రపంచ కప్‌ను గెలిచి భారత జెండాను ఎగురవేయడం మనందరికి చాలా గర్వకారణం. ఆటలో గెలుపు ఓటములు సహజం. ఆమె ఓటమి చెందినప్పుడు నిరుత్సాహపడకుండా హార్డ్ వర్క్‌తో ప్రాక్టీస్ చేసి చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గర్వంగా ఉంది సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ విజేతగా నిలవడంచాలా గర్వంగా ఉంది. నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసిన అమ్మాయి ప్రపంచ స్థాయి వేదికలలో గెలవడం సంతోషాన్నిచ్చింది. – వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ -
అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వారికి రూ.3 లక్షలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఖర్చుల కోసం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో కాంస్యం సాధించిన పీవీ సింధును శుక్రవారం సచివాలయంలో ఆయన సన్మానించారు. భవిష్యత్తులో ఆమె పాల్గొనే అన్ని అంతర్జాతీయ క్రీడా పోటీలకు ప్రభుత్వం సాయమందిస్తుందని తెలిపారు. గతంలో ప్రకటించినట్లుగానే సింధుకు నగదు ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీ రామారావు, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పుల్లెల గోపీచంద్, ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం ప్రోత్సాహం అభినందనీయం: గోపీచంద్ క్రీడాకారులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న పోత్సాహానికి జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉన్నందున అంతర్జాతీయ స్థాయిలోమరింతగా రాణించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.