అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే వారికి రూ.3 లక్షలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఖర్చుల కోసం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధును శుక్రవారం సచివాలయంలో ఆయన సన్మానించారు. భవిష్యత్తులో ఆమె పాల్గొనే అన్ని అంతర్జాతీయ క్రీడా పోటీలకు ప్రభుత్వం సాయమందిస్తుందని తెలిపారు. గతంలో ప్రకటించినట్లుగానే సింధుకు నగదు ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీ రామారావు, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పుల్లెల గోపీచంద్, ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం ప్రోత్సాహం అభినందనీయం: గోపీచంద్
క్రీడాకారులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న పోత్సాహానికి జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉన్నందున అంతర్జాతీయ స్థాయిలోమరింతగా రాణించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.