30 ఇయర్స్ థండర్! | deepika padukone birthday special story | Sakshi
Sakshi News home page

30 ఇయర్స్ థండర్!

Published Mon, Jan 4 2016 11:08 PM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

30 ఇయర్స్ థండర్!

30 ఇయర్స్ థండర్!

జీవితం విలువ తెలిసింది!
 వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదురైన ఒడిదొడుకులు కొన్ని జీవిత సత్యాలను  నేర్పాయని దీపిక పేర్కొన్నారు. ‘‘నేను ఒక పుస్తకంలో మంచి ఇన్‌స్పైరింగ్ లైన్ ఒకటి చదివాను. అదేంటంటే.. మనకు రెండు జీవితాలు ఉన్నాయి. రెండో జీవితం ఎప్పుడు మొదలవుతుందంటే.. మనకు ఒకే ఒక్క జీవితం ఉందని తెలిసినప్పుడు. ఈ మాటలు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి కదూ. ఇప్పుడు జీవితం విలువ నాకు బాగా తెలుసు. కష్టాలను ఎలా అధిగమించాలో తెలిసింది. పాజిటివ్‌కి, నెగటివ్‌కి సమానంగా స్పందించడం నేర్చుకున్నాను’’ అని దీపిక తెలిపారు.
 
 గాలికి ఎగిరిపోయేట్లు ఉంది... ఈవిడగారు హీరోయిన్నా?
 కాస్త తెల్లగా ఉంటే బాగుండేది...
 ఎట్రాక్టివ్‌గా కనబడేది...
 పదుకొనే.. అదేం పేరు? ఎప్పుడూ పడుకునే ఉంటుందా...? ప్చ్.. అమ్మడు అస్సలు
 హీరోయిన్ మెటీరియల్ కానే కాదు... ఇలాంటి విమర్శలను దీపికా పదుకొనే ఎదుర్కొన్నారంటే అంత నమ్మశక్యంగా అనిపించదు. కానీ, ఇది వంద శాతం నిజం. పదేళ్ల క్రితం పదుకొనే గురించి ఇలాంటి విమర్శలు చేసింది స్వయంగా దక్షిణాది పరిశ్రమే. ఇప్పుడు బాలీవుడ్ కథానాయికగా ‘మోస్ట్ వాంటెడ్’ లిస్ట్‌లో ఉన్న దీపిక దక్షిణాదికి అందనంత ఎత్తుకి ఎదిగిపోయారు. నేడు ఈ బ్యూటీ బర్త్‌డే. 30 ఏళ్లు పూర్తి చేసుకుని, 31లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దీపిక గురించి కొన్ని ఇంట్రస్టింగ్ పాయింట్స్.

 
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే మొదటి కూతురు దీపిక. డెన్మార్క్ లోని కోపెన్‌హ్యాగన్‌లో పుట్టింది. ఆ తర్వాత ఏడాదికి ఈ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. దీపికాకు ఓ చెల్లెలు ఉంది. పేరు అనీషా. ఆమె క్రీడా రంగంలో ఉంది.  దీపిక చదువంతా బెంగళూరులోనే సాగింది. మోడలింగ్‌తో బిజీగా ఉండటంతో డిగ్రీ మధ్యలోనే ఆపేశారామె. జాతీయ స్థాయిలో దీపిక బ్యాడ్‌మింటన్ ఆడారు. ఒకవైపు చదువు, మరోవైపు బ్యాడ్‌మింటన్‌తో పాటు మోడల్‌గా కూడా చేసేవారు. క్రీడా రంగంలో కొనసాగలేననీ, తనకంతగా ఆసక్తి లేదని తండ్రి దగ్గర చెప్పడానికి తటాపటాయించారామె. చివరకు ధైర్యం చేసుకుని చెప్పేశారు. ప్రకాశ్ పదుకొనే ఫ్రెండ్లీ ఫాదర్. పిల్లల ఇష్టాలను కాదనరు. అందుకని మోడల్‌గా చేయడానికి దీపికాకు అనుమతి ఇచ్చేశారు. దాంతో 2004లో ఫుల్ టైమ్ మోడల్‌గా చేయడం మొదలుపెట్టారు.

  పలు వాణిజ్య ప్రకటనల్లో నటించడం ద్వారా సినీ దర్శక-నిర్మాతల దృష్టిలో పడ్డారామె. ముఖ్యంగా కింగ్‌ఫిషర్ క్యాలండర్‌పై దర్శనమిచ్చిన తర్వాత దీపిక పాపులార్టీ పెరిగిపోయింది. అప్పుడే కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’లో అవకాశం దక్కించుకున్నారామె.
 
  ఇక, కథానాయికగా కొనసాగాలనే ఆకాంక్షతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ముంబయ్‌కి మకాం మార్చేశారు దీపిక. అక్కడ తన అత్తయ్యవాళ్ల ఇంట్లో ఉండేవారు. అప్పుడే హిమేష్ రేష్మియా రూపొందించిన ‘నామ్ హై తేరా’ మ్యూజిక్ వీడియోలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆ వీడియో ద్వారా బాలీవుడ్‌లో పాపులరయ్యారు దీపిక. ఎంత పాపులర్ అయినా సినిమా హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకోవడం అంటే మాటలు కాదు. అందుకే ఓ ఏజెన్సీని సంప్రదించారు. ఆ ఏజెన్సీ ద్వారా తన ఫొటోలను ప్రొడక్షన్ ఆఫీసులకు పంపించారు. ఆ ఫొటోలు తెలుగు పరిశ్రమ వరకూ వచ్చాయి.
 
  2006లో టాలీవుడ్‌కి దీపిక ఫొటోలు వచ్చాయి. కానీ, వాటిని చూసి ‘ఈ అమ్మాయి హీరోయినా?’ అని కొంతమంది వెటకారంగా మాట్లాడారు. పెద్ద దర్శక-నిర్మాతలు కూడా ఆమెను రిజెక్ట్ చేశారు.
 ఒకవైపు దక్షిణాదిన అవకాశాలు రాకపోవడం, హిందీలో తొలి చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆగిపోవడంతో దీపిక కొంచెం కంగారుపడ్డారు. కానీ,  చిత్రదర్శకురాలు ఫరా ఖాన్ మాత్రం దీపికాకి ఎలాగైనా అవకాశం ఇవ్వాలనుకున్నారు.
 
  ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆగిపోయిన తర్వాత ఫరా ఖాన్ ‘ఓం శాంతి ఓం’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ సరసన దీపిక పదుకొనేకి అవకాశం ఇచ్చారామె. అంతే.. ఆమె జీవితం మారిపోయింది. ఒక్క సినిమాతో దీపికా కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. మొదటి చిత్రంతోనే కుర్రకారు కలల రాణి అయిపోవడంతో పాటు దర్శక-నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారు.
 
 2007లో ‘ఓం శాంతి ఓం’ రిలీజైంది. మలి చిత్రంగా చేసిన ‘బచ్‌నా ఏ హసీనో’తో దీపిక స్టార్ హీరోయిన్ అయిపోయారు. అక్కణ్ణుంచీ మొన్నా మధ్య విడుదలైన ‘బాజీరావ్ మస్తానీ’ వరకూ దీపికకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండాపోయింది. లవ్ ఆజ్ కల్, ఆరక్షణ్, కాక్‌టైల్, ఏ జవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్‌లీల, పీకు, తమాషా, బాజీరావ్ మస్తానీ.. ఇలా దీపిక నటించిన చిత్రాల్లో కొన్ని బంపర్ హిట్ సాధిస్తే, కొన్ని నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చాయి.

 కోట్లు సంపాదిస్తూ దూసుకెళుతున్న దీపిక ముంబయ్‌లో సొంత ఇల్లు, కారు కొనుక్కున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బోల్డంత ఉంది. ‘‘ఎవరి మీదా ఆధారపడకుండా బతకడం చాలా ఆనందంగా ఉంది. దేవుడు నాకు ఎక్కువ ఇచ్చాడు. సంతృప్తిగా ఉంది’’ అని ఓ సందర్భంలో దీపిక పేర్కొన్నారు. రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో పడి, విడిపోయిన సమయంలో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అందులోంచి బయటపడానికి కౌన్సిలింగ్ తీసుకున్నారు.. మందులు వాడారు. ఎట్టకేలకూ బయటపడ్డారు. ఇది జరిగి ఏడాది పైనే అయ్యింది.
 
  డిప్రెషన్‌లో ఉన్న విషయం గురించి దీపిక ఓపెన్‌గా చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారట. ‘ఇల్లు ఉంది.. కారు ఉంది. కోట్లు ఉన్నాయి.. అయినా డిప్రెషనా?’ అని దీపిక దగ్గర అనేవారట. ‘‘అన్నీ ఉన్నవాళ్లు డిప్రెషన్‌కి గురి కాకూడదా? నాకు ఆశ్చర్యం వేసింది. డిప్రెషన్ అనేది మనసుకి సంబంధించినది. ఐశ్వర్యవంతులు డిప్రెషన్‌కి గురి కాకూడదన్నప్పుడు... ‘మనకు ఆ మాత్రం హక్కు కూడా లేదా?’ అని డైలమాలో పడ్డాను’’ అని ఓ సందర్భంలో దీపిక పేర్కొన్నారు.
 
 డిప్రెషన్‌లో ఉన్నప్పుడు దీపిక బెంగళూరు వెళ్లిపోయారు. దాదాపు మూడు, నాలుగు నెలలు తన తల్లిదండ్రులతోనే గడిపారు. ‘‘కంటి మీద కునుకు పట్టేది కాదు. ఆకలి వేసేది కాదు. నరకం కనిపించింది’’ అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ రోజులు తనను మానసికంగా బలవంతురాల్ని చేశాయని దీపిక అన్నారు.రణ్‌బీర్ కపూర్ నుంచి విడిపోయాక రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో పడ్డారనే వార్త వినిపిస్తోంది. మరి.. దీపిక మెడలో మూడు ముళ్లు వేయబోయేది రణ్‌వీరేనా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
 
 2015లో దీపిక కెరీర్ బాగుంది. తమాషా, పీకు, బాజీరావ్ మస్తానీ వంటి విజయాలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. 2016 కూడా ఆమెదేనని బాలీవుడ్‌కి చెందిన ఓ జ్యోతిష్కుడు అంటున్నారు. ఈ ఏడాది ఆమె ఖాతాలో దాదాపు హిట్సే ఉంటాయనీ, నటిగా కూడా మరింత మంచి పేరు వచ్చే అవకాశం ఉందనీ జోస్యం చెబుతున్నారు.  మరి... 2016 కూడా దీపికాదే అవుతుందా? వేచి చూద్దాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement