‘‘కనీసం ఒక్క ప్రాణాన్నైనా కాపాడలన్నది నా లక్ష్యం. అప్పుడే ఈ జీవితానికి సార్థకత’’.. ఏళ్లపాటు మనోవ్యాకులత సమస్యను ఎదుర్కోవడమే కాకుండా దాన్నుంచి విజయవంతంగా బయటపడి అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దీపికా పదుకునె ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. ఓ కార్యక్రమంలో దీపిక మనోవ్యాకులత సమస్యను ఎలా ఎదుర్కొన్నది వివరించారు.
‘‘2014లో మొదటిసారి సమస్యను గుర్తించారు. అకస్మాత్తుగా చిత్రంగా అనిపించేది నాకు. పనిచేయాలని అనిపించేది కాదు. ఎవర్నీ కలవాలనిపించేది కాదు. బయటికి వెళ్లాలన్నా చిరాకు వచ్చేది. అసలు ఏమీ చేయకుండా ఉండిపోవాలనిపించేది. చాలాసార్లు ఈ జీవితానికి ఓ అర్థం లేదని, ఇంకా బతికి ఉండకూడదని అనిపించేది’’ అని తెలిపారు. ఈ సమయంలోనే తన తల్లిదండ్రులు తనను చూసేందుకు బెంగళూరు నుంచి ముంబై వచ్చారని చెబుతూ.. ‘‘వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో ఉన్నట్టుండి ఏడ్చేశా.
ఏదో తేడాగా ఉందని అమ్మ గుర్తించింది. అది మామూలు ఏడుపు కాదని అనుకుంది. ఓ సైకియాట్రిస్ట్‌ను కలవమని సూచించింది. ఆ తర్వాత కొన్ని నెలలకు కానీ కోలుకోవడం సాధ్యం కాలేదు’’ అని దీపిక తెలిపారు. ‘‘మనోవ్యాకులత సమస్య నాకే అనుభవమైందంటే నాలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నారో? అని అప్పట్లో నాకనిపించింది. అందుకే ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగినా ఈ జీవితానికి సార్థకత ఏర్పడినట్లే అనుకుంటున్నా..’’ అని దీపిక తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment