అవే నాకు వెయ్యి ఏనుగుల బలం ఇస్తాయి: దేవిశ్రీ ప్రసాద్‌ | Devisri prasad interview about Naga Chaitanya thandel movie | Sakshi
Sakshi News home page

అవే నాకు వెయ్యి ఏనుగుల బలం ఇస్తాయి: దేవిశ్రీ ప్రసాద్‌

Published Wed, Feb 5 2025 3:11 AM | Last Updated on Wed, Feb 5 2025 3:11 AM

Devisri prasad interview about Naga Chaitanya thandel movie

ఆరు పాటలూ లవ్‌ సాంగ్స్‌ ఉండే ఓ ప్రేమకథ చేయాలనే కోరిక బన్నీకి (అల్లు అర్జున్‌) ఎప్పట్నుంచో ఉంది. ‘గుర్తుపెట్టుకో.. మనం అలాంటి సినిమా చేద్దాం’ అంటూ మొన్న ఓ పేపర్‌ మీద రాసిచ్చారు (నవ్వుతూ). ‘తండేల్‌’ మూవీ మ్యూజిక్‌కి దేవిని ఫిక్స్‌ అయిపోమని అరవింద్‌ అంకుల్‌తో బన్నీ ముందే చెప్పారు.  

‘‘చాలా రోజుల తర్వాత వస్తున్న అందమైన ప్రేమకథా చిత్రం ‘తండేల్‌’. ఈ సినిమాలోని ‘బుజ్జి తల్లి...’ పాట విన్న సుకుమార్‌గారు.. ‘నీ ఆల్‌ టైమ్‌ టాప్‌ ఫైవ్‌లో ఉంటుంది’ అన్నారు. ఆ సాంగ్‌ రిలీజైన వెంటనే ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే శివుని పాట, హైలెస్సో... పాటలు గొప్పగా జనాల్లోకి వెళ్లాయి. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్‌ అవడం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అన్నారు.

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ విలేకరులతో పంచుకున్న విశేషాలు. 

నా కెరీర్‌ ఆరంభంలో నేను చేసిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఆర్య, 100% లవ్‌’ వంటి ప్రేమకథలతో పాటు ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్, మాస్‌’ లాంటి కమర్షియల్‌ సినిమాలకు కూడా మ్యూజిక్‌ పరంగా ప్రేక్షకుల నుంచి అంతే అద్భుతమైన స్పందన వచ్చింది. ఎలాంటి సినిమా అయినా చేయగలననే పేరు రావడం, అందులోనూ ప్రేమకథలకి మంచి సంగీతం ఇస్తానని అందరూ అనుకోవడం దేవుడి ఆశీస్సులుగా భావిస్తాను

‘తండేల్‌’ స్వచ్ఛమైన ప్రేమకథ. వాస్తవ ఘటనల ఆధారంగా రాసుకున్న కథ. చందు మొండేటి గ్రేట్‌ విజన్‌తో ఈ సినిమా తీశాడు. చైతన్యగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కొత్త నాగచైతన్యని చూడబోతున్నారు. సాయిపల్లవి నటన కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది

యంగ్‌ ఏజ్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశా. నేనే నా మ్యూజిక్‌ వింటూ పెరిగాను (నవ్వుతూ). అన్ని జానర్‌ సినిమాలు చేసే అవకాశం రావడం, అన్ని వయసుల వారికి నచ్చే మ్యూజిక్‌ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. లైవ్‌ షోస్‌ చేయడం నాకు వెయ్యి ఏనుగుల బలం ఇస్తుంది. ప్రేక్షకులు అభిమానం, ఆదరణ నాకు గొప్ప ఎనర్జీతో పాటు ఇంకా గొప్ప మ్యూజిక్‌ చేయాలనే స్ఫూర్తినిస్తాయి. ప్రస్తుతం ‘కుబేర’ సినిమాకి సంగీతం అందిస్తున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement