టైటిల్: ధూం ధాం
నటీనటులు: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
నిర్మాత:ఎంఎస్ రామ్ కుమార్
స్టోరీ, స్క్రీన్‌ప్లే: గోపీ మోహన్
దర్శకత్వం: సాయి కిషోర్ మచ్చా
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామి
ఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల
విడుదల తేది: నవంబర్ 8, 2024
కథేంటంటే..
రామరాజు(సాయి కుమార్)కి అతని కొడుకు కార్తిక్(చేతన్ కృష్ణ)అంటే చాలా ఇష్టం. కొడుకు సంతోషం కోసం ఏ పనైనా చేస్తాడు. అన్ని విషయాలు కొడుకుతో చర్చించుకుంటాడు. కార్తిక్ కూడా అంతే. నాన్నను చాలా ప్రేమిస్తాడు. అమ్మా నాన్న, స్నేహితులే ప్రపంచంగా బతుకున్న కార్తిక్ జీవితంలోకి సుహానా(హెబ్బా పటేల్) వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇరు కుటుంబాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటి? కార్తిక్, సుహానా కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి? తండ్రి కోసం కార్తిక్ చేసిన తప్పేంటి? అంతకు ముందు కొడుకు కోసం రామరాజు చేసిన మిస్టేక్ ఏంటి? ఆ తప్పు కారణంగా సుహాన ఫ్యామిలీ పడిన ఇబ్బందులు ఏంటి? ఈ కథలో వెన్నెక కిశోర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు రావడం లేదు. ఎక్కువ రా, రస్టిక్, యాక్షన్ సినిమాలే వస్తున్నాయి. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ధూం ధాం’. దర్శకుడు సాయి కిషోర్ ఎంచుకున్న కథ పాతదే అయినా.. దానికి ఇచ్చిన ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంది.
ఫాదర్-సన్ ఎమోషన్, తండ్రీ- కూతుళ్ల బాండింగ్‌తో ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఓ మంచి ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా చెప్పారు. ఫస్టాప్ అంతా హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ చుట్టూ సరదాగా సాగుతుంది. పరిచయమే లేని ఓ అమ్మాయి వచ్చి ప్రేమిస్తున్నానంటూ హీరోకి చెప్పడం.. ఆమె ఎవరో తెలియక హీరో పడే తిప్పలు, ఈక్రమంలో వచ్చే పాటలు, ఫన్నీ సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్‌స్టోరీ పాత సినిమాలను గుర్తు చేసినా.. దాని చుట్టు అల్లుకున్న సీన్లు కథకి ఫ్రెస్‌నెస్‌ని తెచ్చాయి.
ఇక సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనం హిలేరియస్‌గా సాగుతుంది. ముఖ్యంగా మందు సిట్టింగ్ సీన్‌లో ‘ఎక్స్‌ప్రెషన్స్’ పేరుతో సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ సినిమాల్లోని డైలాగ్స్‌ని వెన్నెల కిశోర్ చెప్పడం సినిమాకే హైలెట్. వెన్నెల కిశోర్‌కి సంబంధించిన ప్రతీ సీన్ థియేటర్‌లో నవ్వులు పూయిస్తుంది. ఎక్కడా వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీతో కథనాన్ని నడిపించడం సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి. కొత్తదనం కోరుకోకుండా.. ఎంటర్‌టైమెంట్ ఉంటే చాలు అనుకునే ప్రేక్షకులకు ధూం ధాం సినిమా నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
హీరో చేతన్ కృష్ణకి ఇది తొలి సినిమా. అయినా కూడా ఉన్నంతలో చక్కగానే నటించాడు. అయితే నటన పరంగా ఇంకొంత కసరత్తు చేస్తే..భవిష్యత్తులో మంచి హీరో అయ్యే చాన్స్ ఉంది. హెబ్బా పటేల్ ఈ తరహా పాత్రలు గతంలో చాలానే చేసింది కాబట్టి సుహాన పాత్రలో ఈజీగా నటించేసింది. హీరోహీరోయిన్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర వెన్నెల కిశోర్‌ది. హీరో కజిన్‌గా ఆయన పండించిన కామెడీ సినిమా స్థాయిని పెంచేసింది.
సెకండాఫ్ మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది. ఓ రకంగా ఈ సినిమాకు వెన్నెల కిశోరే హీరో అని చెప్పొచ్చు. హీరో తండ్రిగా సాయి కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరో స్నేహితులుగా ప్రవీణ్, నవీన్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. గోపరాజు రమణ, వినయ్ వర్మ, బెనర్జీతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. గోపీ సుందర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. చివరిలో వచ్చే మంగ్లీ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పోలెండ్ అందాలను తెరపై చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. క్వాలిటీ విషయంలో నిర్మాత రామ్ కుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది.
రేటింగ్: 2.75/5
Comments
Please login to add a commentAdd a comment