సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్న 'డాన్‌' దర్శకుడు | Director Cibi Chakravarthy Get Married | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్న 'డాన్‌' దర్శకుడు

Sep 6 2024 3:53 PM | Updated on Sep 6 2024 5:24 PM

Director Cibi Chakravarthy Get Married

కోలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ సీబీ చక్రవర్తి వివాహబంధంలో అడుగుపెట్టాడు. ‌ హీరో శివ కార్తికేయన్‌కు 'డాన్' వంటి హిట్ సినిమా అందించి సౌత్‌ ఇండియాలో పాపులర్‌ డైరెక్టర్‌గా చక్రవర్తి గుర్తింపు తెచ్చుకున్నాడు. తను డైరెక్షన్‌ చేసిన మొదటి సినిమా 'డాన్‌'తో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కోలీవుడ్‌లో రికార్డ్‌ సెట్‌ చేశాడు. 2022లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇందులో శివకార్తికేయన్‌తో పాటు ప్రియాంక మోహన్, ఎస్.జె. సూర్య తదితరులు నటించారు.

ద‌ర్శ‌కుడు సీబీ చక్రవర్తి సెప్టెంబర్‌ 5న వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీ వర్షిణితో కలిసి ఏడడుగులు వేశాడు. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. చెన్నై ఈరోడ్‌లోని ఆర్‌ఎన్‌ ఫంక్షన్‌ హాల్‌లో సెప్టెంబర్‌ 5న వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు అట్లీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా సీబీ చక్రవర్తి పనిచేశాడు. తన మొదటి సినిమాతోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా జరిగిన తన వివాహ వేడుకలో శివ కార్తికేయన్‌, అట్లీ పాల్గొన్నారు. సీబీ చక్రవర్తి చేతిలో ఒక బిగ్‌ సినిమా ఉంది. శివ కార్తికేయన్‌, రష్మిక మందన్న జోడీగా ఆయన ఒక భారీ ప్రాజెక్ట్‌ ప్లాన్‌ చేశారు. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య కూడా నటించనున్నారు. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన రానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement