
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సందేహం’.‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి మేకర్స్ ‘చచ్చినా చావని ప్రేమిది’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజైంది. ఈ కార్యక్రమంలో దశరథ్‌తో పాటు మన చౌదరి, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ సతీష్ పరమదేవగారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో రానున్న ‘సందేహం’ మూవీ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పూర్ణాచారిగారు పాటను అద్భుతంగా రాశారు. పాట వింటుంటే చాలా క్యాచీగా ఉంది’ అన్నారు. ‘టీమ్ అంతా ఎంతో కష్టపడి అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని మన చౌదరి అన్నారు.
సుభాష్ ఆనంద్ సంగీతం ఈ చిత్రంలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment