'హ్యాపీ వెడ్డింగ్'లో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఆర్నెల్లు పట్టింది. ఈ సారి అలాంటి తప్పు జగరకూడదని, ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’’ కథ రాసుకున్నాను. ఆ తర్వాత ఈ కథకు హీరో ఎవరైతే బాగుంటుందని ఆలోచించగా రావు రమేశ్ గుర్తుకు వచ్చారు. ఆయన సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా చేయరేమో అని చాలా మంది చెప్పారు. అయితే ఒక్కసారి కథ చెప్పి చూద్దాం అని ఆయనను సంప్రదించాను. ఫస్ట్ డైలాగ్ చెప్పిన వెంటనే నవ్వేశాఉ. 15,20 నిమిషాల్లో కథ వివరించా. వెంటనే రావు రమేశ్ ఓకే చేశారు’ అని అన్నారు దర్శకుడు లక్ష్మణ్ కార్య. ఆయన దర్శకత్వంతో రావు రమేశ్, అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మారుతి నగర్ సూర్య’. హర్ష వర్దన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ లక్ష్మణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ 'ఎందుకిలా' వెబ్ సిరీస్‌తో నేను దర్శకుడిని అయ్యా. అందులో సుమంత్ అశ్విన్ గారు హీరో. ఆ సిరీస్ అయ్యాక ఆయన, నిహారిక జంటగా 'హ్యాపీ వెడ్డింగ్' చేశా. దర్శకుడిగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' నా రెండో సినిమా.
→ ఈ సినిమాలో రావు రమేష్ , అంకిత్ కొయ్య తండ్రి కుమారులుగా నటించారు. అంకిత్ కొయ్యకు తానొక గొప్ప ఇంటి బిడ్డను అని, 'అల వైకుంఠపురములో' కాన్సెప్ట్ టైపులో తనను చిన్నప్పుడు మార్చేశారని అనుకుంటాడు. అల్లు అరవింద్ కొడుకు అని అతడి ఫీలింగ్. అల్లు అర్జున్ తన అన్నయ్య అనుకుంటాడు. ప్రేమించిన అమ్మాయిని చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమాల్లో జరిగినట్టు ఊహించుకున్నాడు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో చూస్తారు.
→ ఇంద్రజ గారి క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయడం లేదు. రావు రమేష్ గారి భార్యగా, కళామణి పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమాలో ఇంపార్టెంట్ సీన్ ఒకటి ఉంది. ప్రతి రోజూ ఆవిడకు ఆ సీన్ గురించి చెబుతూ వస్తున్నా. షూటింగ్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆవిడకు చెబితే క్యాజువల్ గా అటు ఇటు చూశారు. యాక్షన్ చెప్పిన తర్వాత సింగిల్ షాట్‌లో చేసేశారు. ఆవిడ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు.
→ డైరెక్టర్ సుకుమార్ భార్య తబితకు ఈ సినిమా ప్రివ్యూ వేశాం. ఒకవేళ ఆవిడకు సినిమా నచ్చకపోతే నాకు సుకుమార్ రైటింగ్స్ సంస్థల్లోకి ఎప్పటికీ ఎంట్రీ ఉండదు. అందుకని భయపడ్డా. భయపడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫస్ట్ కాపీ రెడీ చేసి చూపించా. ప్రివ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని మా టీంలో ఒకరిని లోపల పెట్టాను. నాకే బయటకు నవ్వులు వినిపించాయి. అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. తబిత గారు సినిమా బావుందని మెచ్చుకున్నారు.
→ సుకుమార్ సినిమా చూసి నాకు ఫోన్ చేశాడు. రావు రమేష్ గారు అద్భుతంగా చేశారని, సినిమా బాగా తీశావని చెప్పారు. మొదట ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత ఏం చెప్పారో నాకు గుర్తు లేదు. నేను ఆనందంలో తేలిపోయా. ఆయన మాటలు నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఆగస్టు 23న ప్రేక్షకులు కూడా సినిమా చూసినప్పుడు అంతే ఆనందంగా నవ్వుతారని ఆశిస్తున్నాను
Comments
Please login to add a commentAdd a comment