Director Raj Kumar Hirani Birthday Special And His 5 Block Busters: బాలీవుడ్‌లో విజయవంతమైన డైరెక్టర్లలో రాజ్ కుమార్ హిరానీ ఒకరు. నూతన దర్శకులు ఆరాధించేవాళ్లలో రాజ్ కుమార్ హిరానీ తప్పకుండా ఉంటారు. 100 శాతం సక్సెస్ రేట్‌తో హిందీ సినిమా చిత్ర దర్శకుడిగా ఘనత పొందారు. ఈ విజయపథంలో ఆయన ఇప్పటివరకు కేవలం 5 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాల్లో కథన శైలి, తెరకెక్కించిన విధానం, దృష్టికోణం భారతదేశ చలనచిత్ర రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయి. పైగా ప్రేక్షకులు, విమర్శుకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. ఇవాళ (నవంబర్ 20)న రాజ్ కుమార్ హిరానీ పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసిన 5 బ్లాక్‌బస్టర్‌లపై ఓ లుక్కేద్దామా..!
1. మున్నాభాయ్ ఎంబీబీఎస్ (2003)
సంజయ్ దత్, అర్షద్ వార్సి, విద్యాబాలన్ నటించిన రాజ్ కుమార్ హిరానీ తొలి చిత్రం. ఈ సినిమా ఆయనకు మాస్టర్ స్టోరీ టెల్లర్ అనే ట్యాగ్‌ని సంపాదించిపెట్టింది. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అతిపెద్ద వసూళ్లలో ఒకటిగా నిలవడమే కాకుండా మున్నా, సర్క్యూట్ పాత్రలు బాలీవుడ్‌లో ఎప‍్పటికీ గుర్తిండిపోతాయి. అవి వారికి ఇంటి పేర్లుగా కూడా మారాయి. మహాత్మా గాంధీ ధర్మ బద్ధమైన సిద్ధాంతాలపై అవగాహన కల్పించేందుకు హాస్యంతో తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్. ఈ సినిమాను తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో రీమేక్ కూడా చేశారు.
2. లగేరహో మున్నాభాయ్ (2006)
మున్నాభాయ్ ఎంబీబీఎస్‌కు సీక్వెల్‌గా వచ్చిందే లగేరహో మున్నాభాయ్. మొదటి భాగంలో ఉన్న నటీనటులే రెండో భాగంలో కూడా ఉంటారు. సామాజిక సందేశాన్ని ఇచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాను కూడా తెలుగులో శంకర్ దాదా జిందాబాద్ పేరుతో తెరకెక‍్కించారు.
3. 3 ఇడియట్స్ (2009)
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ 10, అత్యంత పాత్ బ్రేకింగ్ చిత్రాలలో ఒకటిగా పేరొచ్చిన చిత్రం 3 ఇడియట్స్. ఒకరకంగా ఏ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థికైనా ఒక సిలబస్ లాంటిదీ సినిమా. నిజ జీవితంలో, చదువులో ముఖాముఖి పోటీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు రాజ్ కుమార్ హిరానీ. 3 ఇడియట్స్ పూర్తిస్థాయి వినోదభరితంగా ఉంటూనే మంచి సామాజిక సందేశాన్ని ఇస్తుంది.
4. పీకే (2014)
‘3 ఇడియట్స్’ ఘనవిజయం తర్వాత రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్‌తో కలిసి మళ్లీ ఒక కొత్త తరహా కథను తెరకెక్కించారు. ఒక గ్రహాంతర వాసి, మతం, దేవుడి పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాల గురించి భూమిపై ఉన్న ప్రజలను భయపెట్టే విభిన్న కోణం నుంచి ఈ ఆసక్తికరమైన కథనాన్ని అందించారు. ఈ చిత్రంలో అనుష్క శర్మ, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా నటించారు.
5. సంజు (2018)
సంజు చిత్రం 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటి. మొదటిసారిగా తెరపై సంజయ్ దత్ పాత్రను రణ్‌బీర్ కపూర్‌తో తెరకెక్కించి హిట్ కొట్టారు రాజ్ కుమార్ హిరానీ. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ కథనంలో విక్కీ కౌశల్, అనుష్క శర‍్మ కూడా నటించారు. ఈ చిత్రం అనేక అవార్డులను కూడా దక్కించుకుంది. అలాగే రణ్‌బీర్ కపూర్‌కు అపారమైన గుర్తింపు తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment