‘‘చిత్ర పరిశ్రమకి రావాలని ఎంతోమందికి ఉంటుంది. వారిలో చాలామంది ప్రతిభావంతులుంటారు. కానీ, వారికి ఇండస్ట్రీకి ఎలా రావాలి? ఎవర్ని సంప్రదించాలి? ఎవరు అవకాశం ఇస్తారు? అనేది తెలియదు. ప్రతిభ ఉన్న కొత్తవారిని ప్రోత్సహించేందుకే ‘ఆర్జీవీ డెన్’ని ఏర్పాటు చేశాను. ఈ డెన్ ప్రతిభావంతులను తీర్చిదిద్దే క్రియేటివ్ హబ్ అవుతుంది’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఇండస్ట్రీకి రావాలనుకునే కొత్తవారికి అవకాశాలు ఇచ్చేందుకు ‘ఆర్జీవీ డెన్’ అనే కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారాయన. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో రామ్‌గోపాల్ వర్మ చెప్పిన విశేషాలు.
► గతంలో ముంబైలో ‘ఆర్జీవీ కంపెనీ’ని ప్రారంభించారు. ఇప్పుడేమో హైదరాబాద్‌లో ‘ఆర్జీవీ డెన్’ ఏర్పాటు చేశారు. ఈ డెన్ గురించి...
వర్మ: కొత్తవారికి ఓ ప్లాట్‌ఫామ్ ఇవ్వాలనే ‘ఆర్జీవీ డెన్’ ఆరంభించాను. నేనేంటో, నా మనస్తత్వం ఏంటో చూపించడానికి కూడా ‘ఆర్జీవీ డెన్’ ఉపయోగపడుతుంది. ఈ కార్యాలయానికి వచ్చి, చూశాక నాతో పని చేయాలనుకునేవారు వస్తారు.. వద్దనుకునే వాళ్లు పారిపోతారు (నవ్వుతూ). ఇప్పటి వరకూ నేను చేయని జోనర్స్‌లో దాదాపు పది సినిమాలు కొత్తవారి ద్వారా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాను.
► ఇలా కెరీర్ గురించి పక్కా ప్రణాళికలు వేసుకుంటున్న మీరు వ్యక్తిగతంగా బంధాలకు దూరంగా ఉన్నారెందుకు?
కుటుంబం, దేవుడు, సమాజం.. ఈ మూడింటికీ నేను విలువ ఇవ్వను. కానీ, మనుషులకు విలువ ఇస్తాను. మా అమ్మ, నా కూతురు అంటే నాకు ద్వేషం లేదు. ఓ మనిషిగా వాళ్లను గౌరవిస్తాను. కానీ, ఆ బంధాల్లోనే ఉండిపోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ప్రేమిస్తాను. కానీ, ఎదుటి వాళ్లు నన్ను ప్రేమిస్తే నాకు బరువుగా ఉంటుంది.
► రాజకీయాలంటే ఇష్టం లేదని పలు సందర్భాల్లో మీరు అన్నారు. కానీ, ఆ నేపథ్యంలో సినిమాలు తీస్తుంటారు?
నా కెరీర్‌లో రాజకీయ నేపథ్యంలో మూడు సినిమాలే తీశాను. గతంలో ‘సర్కార్, లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలు తీశా. ఇప్పుడు ‘వ్యూహం’ చిత్రం తీస్తున్నాను. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఎలక్షన్ సీజన్‌లోనే సేల్ అవుతాయి. ‘వ్యూహం’ తర్వాత మరో ఐదేళ్ల పాటు రాజకీయ నేపథ్యంలో సినిమాలు చేయను.
► ‘వ్యూహం’ కథేంటి? ఎంతవరకు వచ్చింది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారి వ్యక్తిత్వం అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. మాట ఇస్తే దానికోసం ఎంతవరకైనా కట్టుబడి ఉంటారాయన. వైఎస్ రాజశేఖర రెడ్డిగారు చనిపోయాక జగన్‌గారిని తొక్కేయాలని కొందరు కుట్రలు పన్నారు. జగన్‌గారి జీవితంలో 2009 నుంచి 2014 ఎన్నికల వరకు ఏం జరిగింది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది ‘వ్యూహం’ తొలి భాగంలో చూపిస్తాను. ఈ చిత్రానికి తొలుత ‘కుట్ర’ అని టైటిల్ అనుకున్నా.. అయితే చీప్‌గా ఉంటుందని ‘వ్యూహం’గా మార్చాను. షూటింగ్ 30 శాతం పూర్తయింది.సెప్టెంబరులో రిలీజ్ అవుతుంది.
► ‘వ్యూహం’ రెండో భాగం కూడా ఉందన్నారు?
2015 నుంచి 2023 అక్టోబర్ వరకు జగన్‌గారి జీవితంలోని అంశాల నేపథ్యంలో ‘వ్యూహం 2’ ఉంటుంది. జగన్‌గారు ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉంటారు? ఆయన వ్యక్తిత్వం ఏంటి? వంటి అంశాలు చూపించబోతున్నాను. 2024 ఫిబ్రవరిలో ‘వ్యూహం 2’ చిత్రాన్ని విడుదల చేస్తాం.
► వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మీపై వచ్చే ట్రోల్స్ గురించి ఏమంటారు?
నన్ను ట్రోల్స్ చేయడాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను ఏదైనా ఓ ట్వీట్ చేసినా, మాట్లాడినా కొందరు విపరీతమైన ట్రోల్స్ చేస్తుంటారు. దాని ద్వారా గంటల కొద్దీ వారి విలువైన సమయం వృథా అవుతుంది.. అందులోనే నాకు ఆనందం ఉంది.
► మీరు సివిల్ ఇంజినీర్ కదా? డైరెక్టర్ అయ్యాక ఎప్పుడైనా ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాననిపించిందా?
అలా ఎప్పుడూ అనిపించలేదు. ఇండస్ట్రీలో నేను సంతృప్తిగానే ఉన్నాను.
► మీ జీవితంలో ఏ విషయంలో అయినా పశ్చాత్తాపం?
లేదు. నేను ఏది చేసినా ఆ తర్వాత ఇలా చేశానేంటి? అని పశ్చాత్తాపపడలేదు.
► దేవుడంటే నమ్మకం లేదంటారు? అనుకోకుండా దేవుడు ప్రత్యక్షమై వరమిస్తే ఏం కోరుకుంటారు?
దేవుడు ప్రత్యక్షమైతే ముందుగా భయపడతాను.. (నవ్వుతూ). ఎందుకంటే సడన్‌గా వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి, ‘నేను వెంకటేశ్వర స్వామిని.. నీకు ఏ వరం కావాలో కోరుకో’ అంటే నమ్ముతామా? నేను, మీరు, ఎవరైనా అంతే.. భయపడతాం.
► రాజకీయాలపై మీకు ఆసక్తి లేకపోయినా ‘ఒకే ఒక్కడు’ సినిమాలోలా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే ఏం చేస్తారు?
మొదటిది.. ఇప్పుడున్న విద్యా వ్యవస్థను మార్చుతాను.
రెండోది.. నా ఆలోచనలన్నింటినీ సమాజంపై రుద్దుతాను. మూడోది.. ప్రస్తుతం ఉన్న సొసైటీని డిస్ట్రబ్ చేస్తాను (నవ్వుతూ).
RGV Interview With Sakshi: ఆర్జీవీ డెన్ వారి కోసమే!
Published Tue, Jun 13 2023 1:00 AM | Last Updated on Tue, Jun 13 2023 11:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment