
‘‘డిజె టిల్లు’ ట్రైలర్‌లో రొమాంటిక్ ఫ్లేవర్ చూసి ఇది పూర్తి రొమాంటిక్ సినిమా అనుకుంటున్నారు. సినిమాలో కథానుసారం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి.. అయితే అవి హద్దులు దాటేలా ఉండవు. కుటుంబంతో కలిసి ‘డిజె టిల్లు’ చూడొచ్చు’’ అని విమల్ కృష్ణ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డిజె టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా విమల్ కృష్ణ చెప్పిన విశేషాలు.
♦ కొన్ని షార్ట్ ఫిలింస్‌కి దర్శకత్వం వహించాను. ఒకట్రెండు చిత్రాల్లో నటించాను కూడా. అయితే నా ఆలోచనంతా దర్శకత్వంపైనే. ‘డిజె టిల్లు’తో పాటు మరో మూడు నాలుగు కథలు ఉన్నాయి. అయితే డైరెక్టర్‌గా నా తొలి సినిమా జనాల్లోకి బాగా వెళ్లాలనే ఆలోచనతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కథతో ‘డిజె టిల్లు’ చేశాను.
♦ పదేళ్లుగా సిద్ధు తెలుసు. టిల్లు పాత్రకు తను దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. తనకు కథ చెప్పగానే చాలా బాగుందని చేసేందుకు ముందుకొచ్చాడు. నేను కథ రాస్తే, సిద్ధు డైలాగ్స్ రాశాడు. త్రివిక్రమ్‌గారు స్క్రిప్టు విషయంలో సలహాలిచ్చారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ రిలీజయ్యాక నిర్మాత వంశీగారి నుంచి సిద్ధూకు కాల్ వచ్చింది. మేము రెడీ చేసిన ‘డిజె టిల్లు’ కథ వంశీగారికి నచ్చడంతో సితార బేనర్‌లో సినిమా మొదలైంది. ఈ బ్యానర్‌కి కుటుంబ కథా చిత్రాల సంస్థ అని పేరుంది.. అలాగని ‘డిజె టిల్లు’ తెరకెక్కించడంలో రాజీ పడలేదు. ఈ సినిమా ట్రైలర్ చూశాక ఇద్దరు ముగ్గురు నిర్మాతలు సినిమా చేద్దామని ఫోన్ చేశారు.. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను.
Comments
Please login to add a commentAdd a comment