దర్శకుడిగా ది డీల్‌.. నటనే తన జీల్‌.. | Dr Hanu Kotla's The Deal Movie Song Launched By Manchu Vishnu, Deets Inside | Sakshi
Sakshi News home page

దర్శకుడిగా ది డీల్‌.. నటనే తన జీల్‌..

Published Mon, Oct 14 2024 12:57 PM | Last Updated on Mon, Oct 14 2024 1:28 PM

Dr Hanu Kotla's The Deal Movie Song Launched by Manchu Vishnu

నాంపల్లి: సినిమాలకు మూలం నాటకం.. తొలితరం నటులందరూ నాటకరంగం నుంచి వచ్చిన వారే.. ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, ఎన్‌వి రంగారావు, సావిత్రి వంటివారెందరో ఈ రంగంలోకి వచ్చినవారే. ఇతర భాషల్లోనూ అనేక మంది నటులు నాటక రంగం నుంచి వెండితెరకు పరిచయమైనవారే. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బిఏ.యాక్టింగ్, ఎంఏ దర్శకత్వం పూర్తి చేసి ఆధునిక తెలుగు నాటక రంగంలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న డాక్టర్‌ హనుకోట్ల మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎంఏ పూర్తి చేసిన వెంటనే ఈశ్వర్‌ సినిమాలో ప్రభాస్‌ ఫ్రెండ్‌గా మూగ పాత్రలో అందరినీ మెప్పించాడు. ఆ తర్వాత అదే వర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరి ప్రొఫెసర్‌గా, రంగస్థల కళల శాఖాధిపతిగా, లలిత కళాపీఠం పీఠాధిపతిగా(డీన్‌) ఎందరో నటులను తీర్చిదిద్దుతున్నారు. 

దర్శకుడిగా, రచయితగా... 
తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులతో కలిసి స్వీయ రచన, దర్శకత్వంలో కె2 నాటకాన్ని ప్రదర్శించి ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత కళ్యాణి నాటకానికి తన బృందంతో ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు వెండి నందిని అందుకున్నారు. నాటక రంగ ఆచార్యుడిగా తెలుగులో నాయకురాలు, గంగిరెద్దు, జయ జయహే తెలంగాణ, రామప్ప వంటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాటకాలను నిర్మించారు. తెలుగులో మొట్టమొదటి నాటకత్రయం ‘ప్రతాపరుద్రమ’ దర్శకత్వం వహించి మెప్పించారు. రచయితగా గంగిరెద్దు, కాశీ్మర్‌ టు కన్యాకుమారి, గబ్బర్‌సింగ్, ధనత్రయోదశి, నాటకాలలో నూతన థోరణులను ప్రవేశపెట్టాడు.  

మరోసారి 
వెండితెరకు.. కేవలం రంగస్థలానికే పరిమితం కాకుండా రేడియో జాకీగా, టెలివిజన్‌ నటుడిగా, దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించి ఈటీవీ– 2లో ప్రసారమైన ‘మాయాబజార్‌’ రాజకీయ వ్యంగ్య రూపకంతో పాటు దూరదర్శన్‌లో అనేక ఎపిసోడ్‌లకు దర్శకత్వం వహించారు. ఈశ్వర్‌ సినిమా తర్వాత ఆగిపోయిన తన సినీ ప్రస్థానాన్ని తిరిగి కొనసాగిస్తూ తన స్వీయ దర్శకత్వంలో హెచ్‌.పద్మారమాకాంతరావు, రామకృష్ణ నిర్మాతలుగా ‘ద డీల్‌’ అనే సినిమాతో అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పోస్టర్‌ లాంచ్‌ చేయగా, ప్రముఖ హీరో మంచు విష్ణు ఈ సినిమా పాటను విడుదల చేశారు. దసరా సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ద డీల్‌ టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement