
దుల్కర్ సెల్యూట్
దుల్కర్ సల్మాన్ హీరోగా రోషన్ ఆండ్రూ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు ‘సెల్యూట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో దుల్కర్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ ఈ సినిమా ద్వారా మలయాళ చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి çసంగీతం: సంతోష్ నారాయణన్.
యువత కథ
‘‘ఓ మహిళ నిర్మిస్తున్న ‘ఒక యువత కథ’ చిత్రం లోగో ఆవిష్కరణ మహిళా దినోత్సవం సందర్భంగా మా చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. 30 మంది కొత్త వారిని తెరకు పరిచయం చేస్తూ, రూపొందుతోన్న ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని నిర్మాతలు తమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్ అన్నారు. ఆపతి ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఒక యువత కథ’. ప్రవీణ్ ఎంటర్‌టైన్మెంట్స్–సూర్య కుమారి వర్క్స్ పతాకంపై ఏలూరి సూర్యకుమారి నిర్మిస్తున్న ఈ సినిమా లోగోని రామసత్యనారాయణ, సాయి వెంకట్ విడుదల చేశారు.
ఏలూరి సూర్యకుమారి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చి కొత్తవారిని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేశాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రస్తుత యువత ఎలా ఉంది? అనేది చూపిస్తూ అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం’’ అన్నారు ఆపతి ప్రవీణ్ కుమార్. భరత్ మహేశ్వరం, హేమంత్ వర్మ, అజిత్ సింగ్, సిరిల్ గాలంకి, ఖుష్బు వైష్ణవ్, నందిగామ పూజిత, ప్రియా వైష్ణవ్, యం.ఎస్ నందిని, రత్నశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య.
మినీ స్టోరీ
ప్రభాస్‌తో ‘మిర్చి’ వంటి భారీ చిత్రం, శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’, నానీతో ‘భలే భలే మగాడివోయ్’, అనుష్కతో ‘భాగమతి’.. ఇలా విజయవంతమైన చిత్రాలు నిర్మించి, తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది యూవీ క్రియేషన్స్ సంస్థ. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. యూవీకి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ ఆరంభమైంది. ఈ సంస్థ నిర్మించిన తాజా చిత్రం ‘ఏక్ మినీకథ’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: గోకుల్ భారతి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్: సత్య.
తెలిసినవాళ్లు
ముఖం ఎక్కడో, మొండెం ఎక్కడో.. ఫొటో చూశారుగా. ‘తెలిసినవాళ్లు’ సినిమా స్టిల్ ఇది. ఎందుకిలా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రామ్ కార్తీక్ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘తెలిసినవాళ్ళు’. విప్లవ్ కోనేటి దర్శకత్వంలో కేఎస్వీ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. విప్లవ్ కోనేటి మాట్లాడుతూ– ‘‘విభిన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో ఉంటుంది. హెబ్బా పటేల్ తన సినీ ప్రయాణంలో ఈ సినిమా ద్వారా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించుకోబోతున్నారు. షూటింగ్ ఎనభై శాతం పూర్తయ్యింది. ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: అజయ్ వి. నాగ్, సంగీతం: దీపక్ వేణుగోపాలన్, లైన్ ప్రొడ్యూసర్: డా. జెకె సిద్ధార్థ.
Comments
Please login to add a commentAdd a comment