టైటిల్: ఈగల్
నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, విజయ్ రాయ్, మధుబాల, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: డేవ్ జాంద్
విడుదల తేది: ఫిబ్రవరి 9, 2024
ఢిల్లీలో జర్నలిస్టుగా పని చేస్తున్న నళిని(అనుపమ పరమేశ్వరన్)కి ఓ రోజు మార్కెట్‌లో స్పెషల్ కాటన్ క్లాత్ కనిపిస్తుంది. అది ఎక్కడ తయారు చేశారని ఆరా తీయగా.. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ క్లాత్‌కి వాడిన పత్తిని ఆంధ్రప్రదేశ్‌లోని తలకోన ప్రాంతంలోని పండించారని, దానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిన సహదేవ్ వర్మ(రవితేజ)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయాడని తెలుసుకుంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి ఆచూకీ తెలిస్తే సమాజానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఆ విషయాన్ని పేపర్లో ప్రచురిస్తుంది. చివరి పేజీలో చిన్న ఆర్టికల్‌గా వచ్చిన ఆ న్యూస్‌ని చూసి.. సీబీఐ రంగంలోకి దిగుతుంది. ఆ పత్రికా సంస్థపై దాడి చేసి.. ఆ సమాచారం ఎలా లీకైందని విచారణ చేపడుతుంది.
ఒక్క చిన్న వార్తకు అంతలా రియాక్ట్ అయ్యారంటే.. దీని వెనుకాల ఏదో సీక్రెట్ ఉందని, అది ఏంటో తెలుసుకోవాలని నళిని తలకోన గ్రామానికి వెళ్తుంది. అక్కడ సహదేవ్ వర్మ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అసలు సహదేవ్ వర్మ ఎవరు? అతన్ని మట్టుబెట్టడానికి కేంద్ర ప్రభుత్వ బలగాలు.. పాకిస్తాన్‌కి చెందిన టెర్రరిస్టులతో పాటు నక్సల్స్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు. యూరప్‌లో కాంట్రాక్ట్ కిల్లర్ అయిన ఈగల్(రవితేజ)కి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి? సహాదేవ్ ఎలా మిస్ అయ్యాడు? సహదేవ్, రచన(కావ్య థాపర్)ల ప్రేమ కథ ఏంటి? సహదేవ్ అనుచరుడైన జై(నవదీప్) ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? తలకోన కొండను దక్కించుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త(నితిన్ మెహతా), లోకల్ ఎమ్మెల్యే చిల్లర సోమేశ్వరరెడ్డి(అజయ్ ఘోష్) ఎందుకు ప్రయత్నించారు? వారిని ఈగల్ ఎలా అడ్డుకున్నాడు? అసలు సహదేవ్ బతికే ఉన్నాడా? ఈ కథలో మధుబాల, శ్రీనివాస్ అవసరాల,విజయ్ రాయ్ పోషించిన పాత్రలు ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
‘కేజీయఫ్’ తర్వాత యాక్షన్ సినిమాల ప్రజంటేషన్‌లో మార్పు వచ్చింది. కథ కంటే యాక్షన్, ఎలివేషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మేకర్స్. ప్రేక్షకులు కూడా అలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. ‘ఈగల్’ కూడా ఆ తరహా చిత్రమే. కేజీయఫ్, విక్రమ్, జైలర్ తరహాలోనే ఇందులో కూడా భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు హీరోకి కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చారు. కానీ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.
యాక్షన్, ఎలివేషన్లనే నమ్ముకొని కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభం నుంచే హీరోకి భారీ ఎలివేషన్స్ ఇచ్చారు. ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్లుగానే తీర్చిదిద్దారు. మణిబాబు రాసిన సంభాషణలు హీరోని ఓ రేంజ్‌లో కూర్చోబెట్టేలా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల వచ్చే డైలాగులకు.. అక్కడ జరిగే సన్నివేశానికి ఎలాంటి సంబంధం ఉండకపోవడమే కాకుండా అతిగా అనిపిస్తుంది. ఇక హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కొన్ని చోట్ల చిరాకు పుట్టిస్తుంది. యాక్షన్స్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి.
ఈ సినిమా కథ ఢిల్లీలో ప్రారంభమై.. ఏపీలోని తలకోన ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. జర్నలిస్టు నళిని వార్త ప్రచురించడం.. సీబీఐ రంగంలోకి దిగి పత్రికా సంస్థపై దాడి చేయడంతో కథపై ఆసక్తి కలుగుతుంది. హీరో ఎంట్రీకి ఇచ్చే ఎలివేషన్ సీన్ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ అంతా ఎలివేషన్లతోనే ముగుస్తుంది. హీరో క్యారెక్టర్ గురించి తెలియజేయకుండా ఎలివేషన్స్ ఇవ్వడంతో కొన్ని చోట్ల అంత బిల్డప్ అవసరమా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో హీరో ఫ్లాష్‌బ్యాక్ తెలుస్తుంది. సహదేవ్, రచనల లవ్ స్టోరీ అంతగా ఆకట్టుకోదు. కానీ కథకు అది ముఖ్యమైనదే! ఫస్టాఫ్‌తో ఎలివేషన్ల కారణంగా యాక్షన్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేవు కానీ.. ద్వితీయార్థంలో వచ్చే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. పబ్లీ నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్ అదిరిపోతుంది. అలాగేప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ కూడా బాగుంటుంది. సినిమాలో మంచి సందేశం ఉన్నా.. దాన్ని ఓ చిన్న సన్నివేశంతో ముగించారు.
ఎవరెలా చేశారంటే..
రవితేజకు యాక్షన్ కొత్త కాదు..ఎలివేషన్లు అంతకంటే కొత్తకాదు. ఈ రెండు ఉన్న ‘ఈగల్’లో రెచ్చిపోయి నటించాడు. సహదేవ్, ఈగల్ ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో చక్కగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా అనుపమ తనదైన నటనతో ఆకట్టుకుంది. సహదేవ్ అనుచరుడు జైగా నవదీప్ తన పాత్ర పరిధిమేర నటించాడు.
వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. అవసరాల శ్రీనివాస్, మధుబాల, మిర్చి కిరణ్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. దేవ్ జాండ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. మణి బాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలను డామినేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. హై రిచ్ కంటెంట్ డెలీవరి చేయడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి సత్తా చాటింది.
Comments
Please login to add a commentAdd a comment