చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించి, జీవితంలో మెట్టు మెట్టు పైకి ఎక్కించే నాన్నని చాలామంది తమ ‘సూపర్ హీరో’లా భావిస్తారు. అందుకే కొందరు నాన్న ప్రేమను, ఆస్తిని మాత్రమే కాదు పగను కూడా పంచుకుంటారు. నాన్నని కష్టాలపాలు చేసినవారిపై పగ తీర్చుకుంటారు. మొత్తానికి నాన్నతో ఓ ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటారు. రానున్న కొన్ని చిత్రాల్లో తండ్రీ కొడుకుల రివెంజ్, ఎమోషనల్ డ్రామా వంటివి ఉన్నాయి. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.
⇒ ‘సలార్’లో తండ్రీకొడుకుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్‌ఫైర్’ గత డిసెంబరులో విడుదలైంది. ఈ చిత్రంలో కొడుకు దేవా పాత్రలో ప్రభాస్ కనిపించారు. మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో దేవా తండ్రి ధారా పాత్రకు చెందిన విషయాలు ఉంటాయి. తండ్రికి దక్కాల్సిన ఖాన్సార్ సామ్రాజ్యాధికారం, గౌరవాన్ని తాను తిరిగి తెచ్చుకునేందుకు దేవా ఏం చేస్తాడనేది మలి భాగంలో ఉంటుందని భోగట్టా. ఫస్ట్ పార్ట్‌లో కొడుకు పాత్రలో కనిపించిన ప్రభాస్ మలి భాగంలో తండ్రీకొడుకుగా కనిపిస్తారట.
⇒ తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకు పాత్రలో ఎన్టీఆర్‌ను ‘దేవర’ చిత్రంలో చూడబోతున్నామట. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారతదేశంలో విస్మరణకు గురైన తీర్రపాంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా ఎన్టీఆర్ నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి.. దేవర (తండ్రి పాత్ర)ను ఎవరు మోసం చేశారు? ఎందుకు చేశారు? అనేది థియేటర్స్‌లో చూడాలి. తొలి భాగం సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. తొలి భాగంలో కొడుకు పాత్ర ప్రస్తావన ఎక్కువగా, చివర్లో తండ్రి పాత్ర గురించిన పరిచయం ఉండి, రెండో భాగంలో తండ్రి పాత్ర చుట్టూ ఉన్న డ్రామాను రివీల్ చేయనున్నారట.
⇒తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే కొడుకు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారని తెలిసింది. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్‌నందన్ పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారని భోగట్టా. రామ్‌నందన్ తండ్రి పేరు అప్పన్న (ప్రచారంలో ఉన్న పేరు). అప్పన్న రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడు. కానీ అతని స్నేహితులు కొందరు మోసం చేస్తారు. ఈ క్రమంలోనే అప్పన్న చనిపోతాడట. ఆ తర్వాత అతని కొడుకు ఐఏఎస్ ఆఫీసర్‌గా ఛార్జ్ తీసుకుని, తన తండ్రికి అన్యాయం చేసినవారికి ఎలా బుద్ధి చెప్పాడు? అన్నదే ‘గేమ్ చేంజర్’ కథ అని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.
⇒ మా నాన్న సూపర్ హీరో అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తండ్రీతనయుల మధ్య సాగే అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని యూనిట్ పేర్కొంది.
⇒ హాస్యనటుడు ధన్‌రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘రామం రాఘవం’. తండ్రీకొడుకు మధ్య నెలకొన్న బలమైన భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో ధన్‌రాజ్ నటిస్తున్నారు. తనయుడు బాధ్యతగా ఉండాలని తాపత్రయపడే తండ్రిగా సముద్ర ఖని, తనను తన తండ్రి అర్థం చేసుకోవడం లేదని బాధపడే కొడుకుగా ధన్‌రాజ్ కనిపిస్తారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.
⇒కరోనా నేపథ్యంతో తండ్రీకొడుకుల ఎమోషన్ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన సినిమా ‘డియర్ నాన్న’. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో సూర్యకుమార్ భగవాన్ దాస్, కొడుకు పాత్రలో చైతన్యా రావ్ నటించారు. యష్ణ చౌదరి, సంధ్య జనక్, శశాంక్, మధునందన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ‘డియర్ నాన్న’ శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇలా తండ్రి భావోద్వేగం ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment