ఓపక్క హీరోయిన్‌గా చేస్తూ మరోపక్క ఐటం సాంగ్స్ చేస్తుండటం ఇప్పుడు వచ్చిన ట్రెండ్ అనుకుంటున్నారు. కానీ, ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలుపెట్టింది గెహానా వశిష్ట్. ఫిల్మీ దునియా సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో పలు చిత్రాల్లో ఐటం సాంగ్స్‌లో మెరిసింది. అలా అని కేవలం ఐటం సాంగ్స్‌కే పరిమితం కాలేదు. ఒకటి హీరోయిన్‌గా చేస్తూ మరొకదాంట్లో ఐటం సాంగ్‌లో నటిస్తూ తన కెరీర్‌ను వెరైటీగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోయింది. సినిమాల్లోకి రావడానికి ముందు దాదాపు 80కి పైగా యాడ్స్‌లో నటించింది. తన సినీ జర్నీ ఎలా మొదలైందో ఈ కథనంలో చదివేద్దాం..
చదువు, క్రీడల్లోనూ ముందంజ
గెహానా స్వస్థలం ఛత్తీస్‌ఘడ్. ఆమె అసలు పేరు వందన తివారి. ఆమె తండ్రి బొగ్గు గనిలో పనిచేసే అధికారి. తల్లి ఎంబీబీఎస్ డాక్టర్. తాతయ్య(అమ్మ వాళ్ల తండ్రి) రాణి దుర్గావతి యూనివర్సిటీ ప్రిన్సిపాల్. నానమ్మ ఓ కాన్వెంట్ స్కూల్‌లో ప్రిన్సిపాల్.. ఇలా ఇంట్లో అందరూ విద్యాధికులే! తనను కూడా కంప్యూటర్ సైన్స్‌లో పట్టా అందుకునేవరకు చదివించారు. అయితే గెహానా చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేది. వాలీబాల్‌లో ఆమె జాతీయస్థాయిలో సత్తా చాటింది. రోబోటిక్స్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించింది. ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షలో ఆలిండియా లెవల్‌లో 163వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఇదే కాకుండా ఎన్‌సీసీ, స్కౌట్స్‌లోనూ చురుకుగా పాల్గొనేది.
మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
అయితే తన విద్యాభ్యాసం అంత ఈజీగా సాగలేదు. చాలామంది కుటుంబాల్లాగే గెహానా ఇంట్లో కూడా అబ్బాయిలకే పెద్ద పీట వేసేవారట. తనకు చదువుకోవాలని ఉన్నప్పటికీ అమ్మాయికి చదువెందుకని తాతయ్య ఒప్పుకోలేదట. ఐఐటీ కౌన్సెలింగ్‌కు కూడా పంపించలేదట! దీంతో మనస్తాపం చెందిన గెహానా ఓ తాడు తీసుకుని ఉరేసుకునేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన ఆమె తల్లి వెంటనే అందరినీ పిలవడంతో గది తలుపులు బద్ధలు కొట్టి ఆమెను రక్షించారు. తనకు చదువుకోవాలని ఉందని కన్నీళ్లు పెట్టడంతో ఆమె కుటుంబం తనను ఐఐటీ చేసేందుకు అనుమతించింది. అలా భోపాల్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని గెహానా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా
అయితే చదువుకునే సమయంలో ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది గెహానా. అలా మోడలింగ్ మొదలుపెట్టింది. వరుసగా యాడ్స్ చేస్తున్న సమయంలో వెండితెర రారమ్మని పిలిచింది. దీంతో తెలుగులో అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి, నమస్తే, ఐదు 5, బీటెక్ లవ్ స్టోరీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. కొన్ని చిత్రాల్లో ఐటం సాంగ్స్‌లోనూ ఆడిపాడింది. అయినా తను కోరుకున్నంత గుర్తింపు అయితే లభించలేదు.
గంధీ బాత్ సిరీస్‌లో బోల్డ్‌గా
ఓటీటీలు నెమ్మదిగా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న సమయంలో గెహానా బోల్డ్ సిరీస్‌లో నటించింది. గంధీ బాత్ అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్ లుక్స్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ సిరీస్ చేయాలని గెహానా కూడా అనుకోలేదు. అయితే ఈ సిరీస్‌ను తిరస్కరిస్తే ఇక ముందు ఆల్ట్ బాలాజీ వాళ్లు చేసే ఏ షో, సిరీస్‌లో కూడా ఛాన్స్ దక్కదు అని వార్నింగ్ ఇవ్వడంతో చేసేదేం లేక అంగీకరించింది. ఆ సిరీస్ బాగా క్లిక్ అవ్వడంతో తనకు తర్వాత కూడా బోల్డ్ పాత్రలే రాసాగాయి.
చదవండి: 87 ఏళ్ల వయసులో లిప్ లాక్.. రొమాన్స్‌కు వయసుతో పనేంటన్న నటుడు
Comments
Please login to add a commentAdd a comment