‘గాంధీ తాత చెట్టు'పై రామ్‌ చరణ్‌, ఉపాసన ప్రశంసలు | Global Star Ram Charan, Upasana congratulate Team Gandhi Tatha Chettu | Sakshi
Sakshi News home page

‘గాంధీ తాత చెట్టు'పై రామ్‌ చరణ్‌, ఉపాసన ప్రశంసలు

Published Sat, Jan 25 2025 4:03 PM | Last Updated on Sat, Jan 25 2025 4:22 PM

Global Star Ram Charan, Upasana congratulate Team Gandhi Tatha Chettu

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi Tatha Chettu). పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ విడుదల చేశారు మేకర్స్‌. 

కాగా ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. సినిమా అందరి హృదయాలకు హత్తకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్‌ను గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్రం టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్‌ పట్ల రామ్‌చరణ్‌(Ram Charan), ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్‌తో కాసేపు ముచ్చటించారు. రామ్‌చరణ్‌, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్‌, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్‌మయూర్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ తదితరులు ఉన్నారు.

గాంధీ తాత చెట్టు కథేంటి?
ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన ఆ భూమితో పాటు అక్కడే ఉన్న ఓ పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం.అతని మనవరాలు గాంధీ(సుకృతి వేణి)కి తాత రామచంద్రయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని..ఆయన మార్గంలోనే నడుస్తుంది. స్థానిక మంత్రి చేసిన కుట్ర కారణంగా ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు పంట వేసిన రైతులంతా అప్పులపాలవుతారు.

అదే సమయంలో ఆ ఊర్లో కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్మించి ఉపాది కల్పిస్తానంటూ వ్యాపారవేత్త సతీష్‌(రాగ్‌ మయూర్‌) రైతులను మభ్యపెడతాడు. ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో పంట పండే పొలాలన్ని సతీష్‌కి అమ్మేస్తారు. రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును తొలగిస్తారనే ఉద్దేశంలో స్థలాన్ని అమ్మేందుకు నిరాకరిస్తాడు. అతని కొడుకు మాత్రం స్థలం అమ్మేద్దామంటూ తండ్రితో గొడవపడతాడు. చెట్టుని నరికేస్తారేమోననే దిగులుతో రామచంద్రయ్య చనిపోతాడు. తాత ఇష్టపడిన చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది గాంధీ.  దాని కోసం గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? గాంధీ మార్గంలోనే వెళ్లి ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేదే మిగతా కథ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement