మహిళా అధికారుల బ్యాచ్(ఫొటో కర్టెసీ: హిందుస్థాన్ టైమ్స్/అనుపమా జోషి)
‘‘గాల్లో వేలాడే హైడ్రాలిక్ నిచ్చెనకు జత చేసి ఉన్న ఓ చిన్న బాస్కెట్‌లో కూర్చుని దాదాపు ఏడెనిమిది అంతస్తుల పైనుంచి కిందకు వేలాడాలి. నిజానికి నాకు ఎత్తు నుంచి కిందకు చూస్తే చాలా భయం. అయితే అంతా బాగానే ఉందని చెప్పేందుకు, భయాన్ని దాచి ఉంచేందుకు పైకి నవ్వుతూ కనిపించేదాన్ని. చేయలేనని తప్పించుకోవడం సరైన పద్ధతి కాదు. అందుకే ముందుగా దేవుడిని ప్రార్థించి, నా పనిని పూర్తి చేసేదాన్ని. మహిళలపై శక్తి సామర్థ్యాలపై ఎవరూ వేలెత్తిచూపకుండా , ఎలాంటి బాధ్యతలు అప్పగించినా మేం సమర్థవంతంగా నెరవేరుస్తామని నిరూపించేందుకు ఇలా నా వంతు కృషి చేసేదాన్ని. అంతేకాదు టాస్క్ మొదలయ్యే సమయాని కంటే ఐదూ, పది నిమిషాల ముందే అక్కడికి చేరుకునేదాన్ని. నిజానికి ఆలస్యం చేసింది అనుపమ అయినా.. ఎవరూ నా పేరెత్తకుండా ఓ మహిళా అధికారి వల్లే ఇంత జాప్యం అంటారు కదా. ఆ మాట రాకుండా చూసుకునేదాన్ని’’ అంటూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ వింగ్ కమాండర్ అనుపమా జోషి గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.(స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?)
భారత వైమానిక దళంలో 1994లో శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి మహిళా బ్యాచ్‌లో ఆమె కూడా ఒకరు. ‘డర్టీ 12’(తమ బ్యాచ్‌కు వాళ్లు పెట్టుకున్న పేరు)గా పేరొందిన పన్నెండు మంది మహిళా అధికారుల్లో ఆమె ఫైర్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. అనేక సవాళ్లను ఎదుర్కొని తన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఓ జాతీయ మీడియాతో తన అనుభవాలు పంచుకున్న అనుపమ మాటల్ని బట్టి.. గుంజన్ సక్సేనా బయెపిక్‌లో చూపించినట్లుగా ఐఏఎఫ్‌లో లింగ వివక్ష ఉందన్న విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కాగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కార్గిల్ గర్ల్‌గా గుర్తింపు పొందిన గుంజన్ సక్సేనా బయోపిక్‌లోని కొన్ని సన్నివేశాల పట్ల ఐఏఎఫ్‌తో పాటు, కార్గిల్ వార్‌లో పాల్గొన్న పైలట్ శ్రీ విద్యారాజన్ కూడా ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు పంచుకున్న శ్రీవిద్య.. తొలిసారి తాము విధుల్లో చేరినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనని.. అయితే మొదట్లో తమ శక్తిసామర్థ్యాలపై సందేహాలు వ్యక్తం చేసిన పురుష ఉద్యోగులే.. ఆ తర్వాత తమను అంగీకరించారని తెలిపారు. అంతేకాక ప్రారంభంలో తమకు ప్రత్యేక సదుపాయాలేమీ లేవని, అంతేగాక శిక్షణలో చేసిన తప్పులను ప్రత్యేకంగా ఎత్తిచూపేవారని గుర్తు చేసుకున్నారు. కానీ కానీ సినిమాలో చూపించినట్లుగా తమను అవమానించడం.. సామార్థ్యాన్ని కించపర్చడం లాంటివి చేసేవారు కాదని స్పష్టం చేశారు. అదే విధంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొదటి మహిళా పైలెట్ తానేనని.. కానీ సినిమాలో మాత్రం కేవలం గుంజన్‌కే మొదటి పోస్టింగ్ ఇచ్చినట్లు చూపించడం సరికాదని అభిప్రాయపడ్డారు. (మొదటి కార్గిల్ గర్ల్ నేనే: శ్రీవిద్య రాజన్)
అంతేగాక సినిమాలో ఐఏఎఫ్‌ను తక్కువ చేసి చూపించడం పట్ల ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఏదేమైనా గుంజన్ జీవితం యువతకు స్పూర్తిదాయకమని, ఒకసారి సినిమా చూసి, మార్పులు చేసిన తర్వాత విడుదలకు అంగీకరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీంతో మూవీ క్రియేటర్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లుతున్నాయి. స్ఫూర్తిమంతమైన ఒక మహిళా అధికారి జీవిత చరిత్రలోని అంశాలకు కల్పనలు జోడించి ఐఏఎఫ్ ప్రతిష్టను మసకబార్చడం ఎంతమాత్రం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, సినిమాను ఓటీటీలో విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు ఐఏఎఫ్ లేఖ రాయడం చర్చకు దారి తీసింది. స్పూర్తిని నింపాల్సిన చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లో ఐఏఎఫ్‌ను చెడుగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ఎన్నడూ లింగ వివక్ష చూపలేదని, ఆడ, మగ అందరికి సమాన అవకాశాలు కల్పించిందని స్పష్టం చేసింది.
దీంతో ఐఏఎఫ్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న నిర్మాత కరణ్ జోహార్.. లింగ వివక్షను ప్రతిబింబించేలా ఉన్న సీన్లను తొలగిస్తామని మాట ఇచ్చారని, అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఆఫీసర్ వెల్లడించగా.. తోటి మహిళా ఉద్యోగుల పట్ల తాము ఎన్నడూ వివక్ష చూపనప్పటికీ తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సినిమాలో చూపించడం సరికాదని మరో ఆఫీసర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గుంజన్ మాత్రం సినిమా విషయంలో రచయితలు వాస్తవ ఘటనలకు కాస్త సృజనాత్మకత జోడించి స్వేచ్చను తీసుకున్నందు వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా వాస్తవాలు చూపిస్తూనే, మరింత ఇన్సిపిరేషనల్‌గా సినిమాను తెరకెక్కించి ఉండాల్సిందని మెజారిటి సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాకు ముందు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చిన జాన్వీ, దర్శకుడు శరణ్ శర్మ ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉండటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కాగా ఆగష్టు 12న గుంజన్ సక్సేనా సినిమా ఓటీటీలో విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment