మొదటి కార్గిల్‌ గర్ల్‌ నేనే: శ్రీవిద్య రాజన్‌ | Gunjan Saxena Fellow Pilot Speaks Up | Sakshi
Sakshi News home page

గుంజన్‌ సక్సెనా సినిమాపై అభ్యంతరం

Aug 18 2020 10:47 AM | Updated on Aug 18 2020 11:36 AM

Gunjan Saxena Fellow Pilot Speaks Up - Sakshi

కార్గిల్‌ గర్ల్‌గా పేరు సంపాదించుకున్న గుంజన్‌ సక్సెనా బయోపిక్‌పై విమర్శలు ఇప్పట్లో​ ఆగేలా లేవు. సినిమాలోని కొన్ని సన్నివేశాల పట్ల ఐఏఎఫ్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజగా గుంజన్‌ సక్సెనా సహోద్యోగి శ్రీవిద్య రాజన్‌ కూడా చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె కూడా 1999 కార్గిల్‌ యుద్ధ సమయంలో గుంజన్‌తో కలిసి ఐఏఎఫ్‌లో హెలికాప్టర్‌ పైలట్‌గా పని చేశారు. తాజాగా శ్రీవిద్య ఫేస్‌బుక్‌ వేదికగా గుంజన్‌ సక్సెనా చిత్రంపై తన అభ్యంతరాలను తెలిపారు. అప్పటివరకు కేవలం పురుషులే ఉన్న రంగంలో తొలిసారి తాము చేరినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అన్నారు. సహచర మగ ఉద్యోగులు కొందరు తాము అసలు ఈ రంగంలో ఎలా ఉంటామా అని అనుమానంగా చూశారని..  కానీ చాలా కొద్ది సమయంలోనే వారు తమను అంగీకరించారని శ్రీవిద్య తెలిపారు. అంతేకాక ప్రారంభంలో తమకు ప్రత్యేకంగా టాయిలెట్స్‌ కానీ, డ్రెస్‌ మార్చుకునే రూములు కానీ లేవని వెల్లడించారు. 

అలానే శిక్షణలో తాము చేసే కొన్ని తప్పులను ప్రత్యేకంగా ఎత్తి చూపేవారని.. సరిదిద్దుకునే వరకూ ఊరుకోకపోయేవారన్నారు శ్రీవిద్య. ఇవే తప్పులు మగ ఉద్యోగులు చేస్తే పెద్దగా పట్టించుకునే వారు కాదన్నారు. అలానే 1996లో తనకు, గుంజన్‌కు ఇద్దరికి ఉధంపూర్‌లో పొస్టింగ్‌ ఇచ్చారని.. కానీ సినిమాలో మాత్రం గుంజన్‌ను మాత్రమే ఉధంపూర్‌ పంపించినట్లు తప్పుగా చూపించారని తెలిపారు. అంతేకాక సినిమాలో చూపించినట్లు చిన్న చిన్న సిల్లీ రీజన్‌ల వల్ల తమ బాధ్యతలు ఎప్పుడు పోస్ట్‌పోన్‌ కాలేదన్నారు. ఎంతో అనుభవం, నైపుణ్యం కల స్క్వాడ్రన్‌ కమాండర్‌లు తమకు శిక్షణ ఇచ్చేవారని తెలిపారు. ఆడ, మగ ఎవరూ తప్పు చేసినా ఒకేలాంటి శిక్ష విధించేవారన్నారు. అంతేకానీ సినిమాలో చూపించినట్లు అవమానించడం.. సామార్థ్యాన్ని​ కించపర్చడం లాంటివి చేసేవారు కాదన్నారు. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న మొదటి మహిళా పైలెట్‌ తానే అన్నారు శ్రీ విద్య. కార్గిల్‌ యుద్ధం ప్రారంభమైనప్పుడు తొలుత తాను ఉధంపూర్‌ వెళ్లానని.. తరువాత గుంజన్‌ తన టీంతో కలిసి శ్రీనగర్‌ వెళ్లిందన్నారు శ్రీవిద్య. అప్పుడు తాము అన్ని విభాగాల్లో విధులు నిర్వహించామని తెలిపారు శ్రీ విద్య. (ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ)

సినిమా క్లైమాక్స్‌లో వచ్చిన సీన్‌లు పూర్తిగా అబద్దం అన్నారు శ్రీవిద్య. అలాంటి సినిమాటిక్‌ సీన్‌లు కేవలం మూవీస్‌లో మాత్రమే ఉంటాయని.. వాస్తవంగా ఎన్నటికి జరగవన్నారు. గుంజన్‌ సక్సెనా తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ఆమె జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తే.. యువతకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు. కానీ సినిమాలో కొన్ని చోట్ల మహిళలని కించపర్చడం.. ఐఏఎఫ్‌ను తక్కువ చేసి చూపడం తనకు నచ్చలేదన్నారు. మహిళా పైలెట్లుగా తమను ఎంతో గౌరవ మర్యాదలతో చూశారని తెలిపారు. గుంజన్‌ ఒకసారి వీటన్నింటి పరిశీలించి.. మార్పులు చేసిన తర్వాత సినిమా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే బాగుండేదన్నారు శ్రీవిద్య. కార్గిల్‌ యుద్ధంలో మగ ఆఫీసర్లు తమకంటే ఎక్కువే కష్టపడ్డారని.. కానీ వారు ఎలాంటి గుర్తింపు కోరుకోవడం లేదన్నారు శ్రీవిద్య. తమకు లభించిన ఈ గుర్తింపు కూడా కేవలం జండర్‌ ఆధారంగానే లభించిందన్నారు. అయితే భద్రతాదళాల్లో సేవ చేసినప్పుడు ఆడ, మగ అనే తేడా ఉండదన్నారు. యూనిఫామ్‌ వేసుకుంటే ప్రతి ఒక్కరూ ఆఫీసర్‌ మాత్రమే అని తెలిపారు శ్రీవిద్య. (స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?)

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌, గుంజన్‌ సక్సెనా పాత్రలో నటించిన ఈ సినిమాకు శరణ్‌ శర్మ దర్శకత్వం వహంచారు. థియేటర్‌లో విడుదల చేయాల్సి ఉన్నప్పటికి లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీలో విడుదలయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement