బాల తారగా సినిమాల్లోకి వచ్చి కథానాయికగా స్థిరపడ్డ కొద్ది మంది నటీమణుల్లో హన్సిక ఒకరు. అనతికాలంలోనే అభిమానుల ఆరాధ్య దేవతగా మారింది. ఆ ఆరాధన కోసం ఆమె అనుసరిస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవీ...
పిచిక డ్రెస్...
ప్రముఖ డిజైనర్ ఊర్వశి సేథి స్థాపించిన సంస్థ ‘పిచిక’. చాలా తేలికగా.. సౌకర్యంగా ఉంటుంది వీరి ఫ్యాబ్రిక్. అదే దీని బ్రాండ్ వాల్యూ. ఈ దుస్తులు ఎక్కువగా లేత రంగుల్లో లభిస్తాయి. అంతేకాదు జైపూర్ హస్తకళాకారులతో వాటిపై పెయింటింగ్ వేయిస్తారు. ఈ యూనిక్‌నెస్ కోసమే ఆ బ్రాండ్ అంటే ఆసక్తి చూపిస్తుంటారు సెలబ్రిటీలు. ఇతర డిజైనర్ దుస్తులతో పోలిస్తే వీటి ధర కాస్త తక్కువే. పేరొందిన అన్ని ఆన్‌లైన్ స్టోర్స్‌లో పిచిక డిజైన్స్ లభిస్తాయి.
సిల్వర్ క్రేవింగ్స్...
వెండి ఆభరణాలకు పేరుపొందిన సంస్థ ఈ ‘సిల్వర్ క్రేవింగ్స్ జ్యూయెలరీ’. తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో ప్రారంభమైందీ వెండి, బంగారు ఆభరణాల దుకాణం. సంప్రదాయ డిజైన్స్ దీని ప్రత్యేకత. ఈ ఆభరణాలకు మంచి గుర్తింపు రావడంతో గత ఏడాది ఇతర రాష్ట్రాల ప్రజల కోసమూ దీని అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించారు. ఇందులో ముక్కు పుడక నుంచి పెద్ద పెద్ద హారాల దాకా అన్ని రకాల జ్యూయెలరీ దొరుకుతుంది. వెండి, బంగారు నాణ్యతతోపాటు నగల డిజైన్స్‌ను బట్టి ధర ఉంటుంది. సిల్వర్ క్రేవింగ్స్ జ్యూయెలరీ కేవలం దానికి సంబంధించిన దుకాణం, వెబ్‌సైట్‌లలో మాత్రమే లభిస్తుంది.
జ్యూయెలరీ.. బ్రాండ్: సిల్వర్ క్రేవింగ్స్ జ్యూయెలరీ
(Silver Cravings jewellery)
కమ్మల ధర: రూ. 7,850
డ్రెస్ బ్రాండ్ : పిచిక (Picchika)
ధర: రూ. 35,000
గాజుల ధర: రూ. 11,000
హారం ధర: రూ. 25,000
ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అదే నా బ్రాండ్ టిఫిన్. నా చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ వేరే టిఫిన్ చేస్తే తినేదాన్ని కాదు. ఈ సంగతి తెలిసిన వాళ్లంతా ‘ఇడ్లీ బుగ్గల పిల్లా’ అంటూ టీజ్ చేసేవారు. బహుశా నా గ్లామర్ సీక్రేట్ అదేనేమో. కానీ ఇప్పుడు అన్నిరకాల టిఫిన్లూ తింటున్నా!.
– హన్సిక మోత్వానీ
- దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment