నాకు కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాలంటే ఇష్టం.. అందుకే ‘సెహరి’ అనే న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ మూవీ చేశాను. ముఖ్యంగా నాకు కామెడీ జానర్ అంటే ఇష్టం. ప్రేక్షకులను నవ్వించాలనే హీరో అయ్యాను’’ అని హర్ష్ కనుమిల్లి అన్నారు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘సెహరి’. అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హర్ష్ కనుమిల్లి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నాకు సినిమా నేపథ్యం లేదు. అండర్–14 క్రికెట్ ఆడాను. ‘టక్కరి దొంగ’ సినిమా చూసి హీరో కావాలనుకున్నాను. సినిమాపై ఆసక్తితో కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. ఏదైనా రంగంలో నిలదొక్కుకోవాలనుకున్నప్పుడు కష్టాలు పడాల్సి వస్తుంది.. అందుకే నాకు కూడా సమయం పట్టింది. ‘సెహరి’ కథ నేనే రాశాను. ఒక ఇన్నోసెంట్ వ్యక్తి పెళ్లికూతురి అక్కతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నదే చిత్రకథ. ‘సెహరి’ అంటే యూరోపియన్ భాషలో వేడుక. మా సినిమా ఒక పండగలా ఉంటుంది.
‘నువ్వు నాకు నచ్చావ్’లాంటి తరహాలో అన్ని వయసులవారూ ఎంజాయ్ చేసేలా మా సినిమా ఉంటుంది. జిష్ణు రెడ్డి ప్యాషనేట్ ప్రొడ్యూసర్. జ్ఞానసాగర్ ఈ చిత్రాన్ని బాగా తీశారు. ప్రశాంత్ ఆర్.విహారి పాటలు సినిమాకి ప్లస్. సంగీత దర్శకుడు కోటి, అభినవ్ గోమటం, సిమ్రాన్ చౌదరి.. ఇలా అందరి పాత్రలకూ ప్రాధాన్యత ఉంది. ఇవాళ నా సినిమా విడుదలవుతుండటం నెర్వస్‌గా ఉన్నా ఎగ్జైటింగ్‌గానూ ఉంది. బాలకృష్ణగారికి ‘సెహరి’ చూపించాలనుకున్నాను, కానీ కుదరలేదు. రాజశేఖర్‌గారు మా సినిమా చూసి, చాలా బాగుందన్నారు. ప్రస్తుతం నా దగ్గర రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment