#Life Stories Review: ఆరు కథలు.. విభిన్నమైన భావోద్వేగాలు | #Life Stories Movie Telugu Review And Rating | Sakshi
Sakshi News home page

#Life Stories Review: ఆరు కథలు.. విభిన్నమైన భావోద్వేగాలు

Published Sat, Sep 14 2024 7:57 PM | Last Updated on Sat, Sep 14 2024 8:17 PM

Hashtag Life Stories Movie Review And Rating In Telugu

టైటిల్‌: #లైఫ్ స్టోరీస్
నిర్మాణ సంస్థలు: అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ 
నటీనటులు : సత్య కేతినీడి, షాలిని కొండేపూడి, దేవియాని శర్మ, ఎం. వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి, హ్యారీ - గోల్డెన్ రిట్రీవర్, ప్రదీప్ రాపర్తి, గజల్ శర్మ, శరత్ సుసర్ల, స్వర్ణ డెబోరా, రాహుల్   
రచన, దర్శకత్వం & నిర్మాత : ఉజ్వల్ కశ్యప్
నిర్మాత : MM విజయ జ్యోతి
సంగీత దర్శకుడు : విన్ను
పాటలు : రామ్ ప్రసాద్, సుపర్ణ వొంటైర్, బెంట్ ఆఫ్ మైండ్, సింజిత్ యర్రమిల్లి
సినిమాటోగ్రఫీ: ప్రణవ్ ఆనంద
ఎడిటర్ : వినయ్
విడుదల తేది: సెప్టెంబర్‌ 14, 2024

కథేంటంటే..
ఇదొక ఆంథాలజీ. విభిన్నమైన జీవనశైలీ గల ఆరుగురి కథ. 
1) క్యాబ్‌ క్రానికల్స్‌: ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి క్యాబ్‌లో  వెళ్తుండగా..కారులో కొన్ని పుస్తకాలు కనిపిస్తాయి. అవి ఆ డ్రైవర్‌కి సంబంధించినవి. ఇంజనీరింగ్‌ చేసి.. క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. వీరిద్ధరి మధ్య జరిగే సరదా సంభాషణనే మొదటి స్టోరీ

2) వైల్డ్ హట్స్‌: ఉద్యోగం రిత్యా దూరంగా ఉన్న ఇద్దరి భార్యభర్తల కథ. న్యూ ఇయర్‌ రోజున ఇద్దరు కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటారు.కానీ భార్య శ్రెయా (షాలిని కొండేపూడి)కి తన బాస్‌ ఎక్కువ వర్క్‌ ఇవ్వడంతో ఆఫీస్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. చివరకు భార్యభర్తలు కలిసి న్యూఇయర్‌  సెలెబ్రేట్‌ చేసుకున్నారా లేదా? ‘వర్చువల్‌ క్యాండిలైట్‌ డిన్నర్‌’ సంగతేంటి అనేదే మిగతా కథ.

3) బంగారం: ఒంటరిగా ఉన్న ముసలావిడ మంగమ్మ కథ ఇది. ఆమెకు బంగారం అంటే చాలా ఇష్టం. కానీ కొనుక్కునే స్థోమత ఉండదు. రోడ్డు పక్కన టీ షాపు పెట్టుకొని జీవితాన్ని గడుపుతుంది. ఓ రోజు రోడ్డుపై ఓ పెంపుడు కుక్కని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వదిలి వెళ్లిపోతాడు. ఆ కుక్కను బంగారం అని పేరు పెట్టి మంగమ్మ చేరదీస్తుంది. ‘బంగారం’ వచ్చిన తర్వాత మంగమ్మ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? అనేది మిగతా కథ.

4) మామ్‌ మీ: ఓ సింగిల్‌ మదర్‌(దేవియని శర్మ) స్టోరీ ఇది. జాబ్‌లైఫ్‌లో పడి కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతుంది. అతని మంచి చెడులను ఎక్కువగా పని మనిషే చూసుకుంటుంది. అయితే తల్లితో ఆడుకోవాలని, లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లాలని పిల్లాడు ఆశ పడతాడు. మరి అతని ఆశ నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ.

5) గ్లాస్‌మేట్స్‌: ఓ సీరియర్‌ కపుల్‌ స్టోరీ ఇది. న్యూఇయర్‌ సెలెబ్రేషన్స్‌ కోసం ఆ జంట రిసార్ట్‌కి వెళ్తారు. అక్కడ భర్తకి కాలేజీ ఫ్రెండ్‌ కనిపిస్తాడు. దీంతో వారిద్దరు కలిసి మద్యం సేవిస్తూ కాలేజీ ముచ్చట్లు చెప్పుకుంటారు. మరోవైపు ఇద్దరి భార్యలు కూడా గదిలోకి వెళ్లి మందు తాగుతూ సరదగా గడుపుతుంటారు. ఆ సరదా సంభాషణలు ఏంటనేది తెరపై చూడాల్సిందే.

6) జిందగీ: సాఫ్‌వేర్‌ ఉద్యోగి తన ప్రియురాలితో కలిసి న్యూ ఇయర్‌ సెలెబ్రేట్‌ చేసుకోవాలనుకుంటాడు. కానీ చివరి నిమిషంలో ఆమె రాలేనని చెబుతుంది. లవర్‌ హ్యాండ్‌ ఇచ్చిన తర్వాత ఆ సాఫ్‌వేర్‌ ఉద్యోగి ఏం చేశాడు? విడివిడిగా సాగిన ఈ ఆరు కథలు చివరకు ఎలా కలిశాయి అనేది తెలియాలంటే #లైఫ్‌స్టోరీస్‌ చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత కథ చెప్పే విధానం మారిపోయింది. కొత్త కొత్త కథలను.. విభిన్నమైన రీతిలో ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న కథలను కలిపి ఓ పెద్ద కథగా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. వీటినే మనం ఆంథాలజీ సినిమాలు అంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలు నార్త్‌లో చాలా ఏళ్ల కిందటే జరిగాయి. కానీ సౌత్‌లో మాత్రం  ఈ మధ్యే ఆంథాలజీ సినిమాలు వస్తున్నాయి. సౌత్‌ ప్రేక్షకులు కూడా అలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. #లైఫ్ స్టోరీస్ కూడా ఓ ఆంథాలజీ ఫిల్మ్‌. టైటిల్‌కు తగ్గట్టే ఇది మనతో పాటు మన చుట్టు ఉండే జనాల జీవన శైలీని తెలియజేసే చిత్రం. ప్రతి కథలోని పాత్రలతో మనం కనెక్ట్‌ అవుతాం. మనలోనో లేదా మన చుట్టో అలాంటి మనుషులు కనిపిస్తూనే ఉంటారు.

(చదవండి:  మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)

అయితే ఎంత మంచి కథ అయినా ఆసక్తికరంగా చెప్పకపోతే ప్రేక్షకులు బోరింగ్‌గా ఫీల్‌ అవుతారు. డైరెక్టర్‌ ఉజ్వల్ కశ్యప్ కొన్ని చోట్ల ఆ తప్పిదం చేశాడు. స్టోరీ బాగున్నప్పటికీ.. సన్నివేశాలను సాగదీయడం.. అవసరం లేకున్నా హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోనే సంభాషణలు చెప్పించడం కొంతవరకు తెలుగు ఆడియన్స్‌కు ఇబ్బందికరమే. స్లోనెరేషన్‌ ఈ సినిమాకు మరో మైనస్‌ పాయింట్‌. 

మొదటి స్టోరీకి చాలా సింపుల్‌గా పుల్‌స్టాఫ్‌ పెట్టి రెండో కథను స్టార్ట్‌ చేశాడు. దీంతో ‘క్యాబ్‌ క్రానికల్స్‌’ స్టోరీ ప్రేక్షకుడికి అర్థమేకాదు. కానీ చివరల్లో ఈ స్టోరీతో మిగతా కథలను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక రెండో స్టోరీ వైల్డ్‌ హాట్స్‌లో ఉద్యోగం చేసే భార్యభర్తల జీవితాలు ఎలా ఉంటాయో చూపించాడు. కథనం నెమ్మదిగా సాగినప్పటికీ.. సిటీలో ఉద్యోగం చేసే భార్యభర్తలు ఈ స్టోరీకి బాగా కనెక్ట్‌ అవుతారు. ‘వర్చువల్‌ క్యాండిలైట్‌ డిన్నర్‌’ సీన్‌ ఆకట్టుకుంటుంది. 

ఇక ఈ ఆరు కథలో ఎమోషనల్‌గా బాగా కనెక్ట్‌ అయ్యే స్టోరీ ‘బంగారం’. మంగమ్మ లైఫ్‌ జర్నీ భావోద్వేగానికి గురి చేస్తుంది. మామ్‌ మీ కథ వర్క్‌పరంగా ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు కాస్త సమయం కేటాయించాలని తెలియజేస్తుంది. గ్లాస్‌మేట్స్‌ స్టోరీ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. జిందగీ కథతో మిగతా స్టోరీలన్నీ ముడిపడి ఉంటాయి. ఈ ఆరు కథలు న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ చుట్టూ సాగుతూనే.. చివరల్లో కలిసిన విధానం ఆకట్టుకుటుంది. క్లైమాక్స్‌ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు.  ఆంధాలజీ సినిమాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రకు న్యాయం చేశారు. మంగమ్మగా నటించిన వృద్ధురాలు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. ఆ పాత్ర అందరికి గుర్తిండిపోతుంది. సింగిల్‌ పేరెంట్‌గా దేవయాని శర్మ చక్కగా నటించింది. ప్రైవేట్ బస్ కండక్టర్ గా కనిపించిన రాజశేఖర్ ఆకట్టుకున్నాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజర్ పీయూష్ పాత్రలో సత్య ఒదిగిపోయాడు. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement