తక్కువ సినిమాలతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. సినిమాల కంటే తన యాటిట్యూడ్‌తో యూత్‌లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ రౌడీ హీరో. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి.. హీరో.. స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈ స్టార్‌డమ్ విజయ్‌కి అంత ఈజీగా రాలేదు. తన కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టపడ్డాడు. అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్లూ తిరిగాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను చేశాడు. 'పెళ్లి చూపులు' చిత్రంతో హీరోగా ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆపై గీత గోవిందం, టాక్సివాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తదితర చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘లైగర్’ డిజాస్టర్‌గా నిలిచినా.. విజయ్‌కి మాత్రం నార్త్‌లో మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన విజయ్ బర్త్‌డే నేడు(మే 9). ఈ సందర్భంగా ఈ రౌడీ హీరో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
► విజయ్ దేవరకొండ పూర్తి పేరు దేవరకొండ విజయ్ సాయి. స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా తమ్మన్ పేట గ్రామం. నటనపై ఉన్న ఆసక్తితో విజయ్ తండ్రి గోవర్దన్‌రావు ఫ్యామిలీతో కలిసి హైదారాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. యాక్టర్‌గా అవకాశాలు లభించకపోవడంతో టెలివిజన్ డైరెక్టర్‌గా మారాడు. సినిమా రంగంపై తనకున్న ఇష్టంతోనే విజయ్ యాక్టర్ అవుతానంటే.. ఆయన అడ్డుచెప్పలేదు.
► విజయ్ తన పాఠశాల విద్యను పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ పూర్తి చేశాడు. ఇంటర్, డిగ్రీని హైదరాబాద్‌లోని ప్రైవేట్ కాలేజిల్లో పూర్తి చేశాడు.
(చదవండి: ముస్లిం యువతిగా సమంత.. 'ఖుషి' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది )
► డిగ్రీ పూర్తయిన తర్వాత విజయ్ నటనపై దృష్టిపెట్టాడు. హైదరాబాద్‌లోని ఓ యాక్టింగ్ స్కూల్‌లో చేరాడు. కొన్నాళ్ల తర్వాత రవిబాబు దర్శకత్వం వహించిన నువ్విలా చిత్రంలో అవకాశం లభించింది.అందులో విష్ణు పాత్రను పోషించాడు.
► నువ్విలా సినిమా చేస్తున్న సమయంలోనే శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకొని అందరిలాగే అడిషన్స్‌కి వెళ్లాడు విజయ్. ఆ చిత్రంలో అజయ్ అనే చిన్న పాత్రను పోషించాడు.
► తొలి రెండు సినిమాలు విజయ్‌కి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో పోషించిన రిషి పాత్ర మాత్రం విజయ్‌కి మంచి గుర్తింపు తెచ్చింది. అయినా కూడా హీరోగా అవకాశాలు లభించలేదు. కొన్నాళ్ల తర్వాత తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చిత్రానికి హీరోగా విజయ్‌ని సెలక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాను నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. చివరకు రాజ్ కందుకూరి ముందుకొచ్చి ఆ చిత్రాన్ని నిర్మించాడు. అదే విజయ్ కెరీర్‌ని మలుపు తిప్పింది. హీరోగా తొలి సినిమాతోనే జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డితో స్టార్‌గా హీరోగా ఎదిగాడు.
► అర్జున్ రెడ్డి తర్వాత విజయ్‌కి వరుస అవకాశాలు లభించాయి. ఏ మంత్రం వేసావే, నోట, డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాలకు మిశ్రమ స్పందల రాగా.. గీత గోవిందం చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘లైగర్’విజయ్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ చూసి షూటింగ్ ప్రారంభించిన ‘జనగణమన’ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు.
► ఒకవైపు హీరోగా సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగానూ మారాడు. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిన్న చిత్రాలను నిర్మిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’. ‘పుష్పక విమానం’లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.
► 'ది రౌడీ వేర్' పేరుతో విజయ్ దేవరకొండ సొంతంగా ఓ క్లాతింగ్ బ్రాండ్ స్థాపించాడు. ‘మిడిల్ క్లాస్ ఫండ్’పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నో మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు.
(చదవండి: ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు)
► ఇక విజయ్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పేద ప్రజలకు సాయం చేయడం కోసం తన అవార్డును కూడా అమ్మేశాడు. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్‌కి బెస్ట్ యాక్టర్ ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. ఆ అవార్డుని వేలం వేసి రూ.25 లక్షలకు అమ్మేశాడు. ఆ డబ్బంతా ప్రజా సేవ కోసం ప్రభుత్వం ఉపయోగించే సీఎం రిలిఫ్ ఫండ్‌కి విరాళంగా అందించి గొప్ప మనసు చాటుకున్నాడు.
► ప్రతీ ఏడాదికి ఒకసారి ‘ 'దేవర శాంటా’ పేరిట అభిమానులను సర్‌ఫ్రైజ్ చేయడం విజయ్‌కి అలవాటు. ఇలా పేద ప్రజల కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతూ రియల్ లైఫ్‌లోనూ హీరోగా నిలుస్తున్న విజయ్ కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ ‘సాక్షి’ తరపున, అభిమానుల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Comments
Please login to add a commentAdd a comment