'HER: Chapter 1' Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

HER Movie Review: ‘హర్‌’ మూవీ రివ్యూ

Published Fri, Jul 21 2023 10:10 AM | Last Updated on Fri, Jul 21 2023 11:24 AM

HER Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: హర్‌
నటీనటులు: రుహానీ శర్మ, వికాస్‌ వశిష్ట, ప్రదీప్‌ రుద్ర, జీవన్‌ కుమార్‌,అభిగ్న్య, బెనర్జీ తదితరులు
నిర్మాణ సంస్థ: డబుల్‌ అప్‌ మీడియాస్‌
నిర్మాతలు: రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి
దర్శకత్వం: శ్రీధర్‌ స్వరాఘవ్‌
సంగీతం: పవన్‌
సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి
ఎడిటింగ్‌: చాణక్య తూరువు
విడుదల తేది: జులై 21, 2023

చిలసౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. ఆ సినిమాతో క్లాస్ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు యాక్షన్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే పోలీస్ ఆఫీసర్‌ పాత్రను పోషించింది. ఆమె నటించిన హర్ (Her Chapter 1)చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతో రుహానీ శర్మ యాక్షన్ హీరోయిన్‌గా ప్రేక్షకుల్లో ముద్ర వేసిందా? లేదా? అన్నది చూద్దాం. 

కథ ఏంటంటే?..
ఏసీపీ అర్చన ప్రసాద్ (రుహానీ శర్మ) కేశవను పట్టుకునే ఆపరేషన్‌లో భాగంగా తన ప్రియుడైన శేషాద్రి (వికాస్ వశిష్ట)ను పోగొట్టుకుంది. ఆ తరువాత అర్చన ప్రసాద్ ఆరు నెలలు సస్పెన్షన్‌కు గురవుతుంది. డ్యూటీలో తిరిగి జాయిన్ అయ్యే టైంలోనే సిటీలో రెండు హత్యలు జరుగుతాయి. విశాల్, స్వాతి హత్యలను చేధించే టైంలో కేశవకు సంబంధించిన లింక్ దొరుకుతుంది. కేశవను పట్టుకోవాలనే తన కోరిక నెరవేరుతుందా? అసలు విశాల్, స్వాతిలు ఎవరు? వారిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? వారిని చంపింది ఎవరు? అర్చన ప్రసాద్ ఈ కేసును ఎలా పరిష్కరిస్తుంది? అనేది కథ.

ఎలా ఉందంటే..
కాప్ డ్రామాలు ఎన్నో వస్తుంటాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లు ఎలా ఉంటాయో ఎన్నో సినిమాల్లో చూశాం. క్రైమ్ థ్రిల్లర్ మూవీలకు స్క్రీన్ ప్లే ముఖ్యం. హర్ సినిమా విషయానికి వస్తే.. కథ, కథనాలు ఏమంత కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ దర్శకుడు మాత్రం రెండు గంటల సేపు ప్రేక్షకుడ్ని కూర్చుండబెట్టేస్తాడు. బోర్ కొట్టించకుండా సినిమాను నడిపించేశాడు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి సినిమానే అయినా డైరెక్టర్ బాగానే హ్యాండిల్ చేశాడు.

కొన్ని చోట్ల సీన్లను గమనిస్తే మనకు హిట్ సినిమా గుర్తుకు వచ్చే అవకాశాలుంటాయి. హర్ సినిమాను లాజిక్స్,  ఎమోషన్స్ ఇలా అన్నింటిని మిక్స్ చేసి రాసుకోవడంతో ప్రేక్షకుడు ఎక్కడా బోరింగ్‌గా ఫీల్ కాడు. రెండో పార్టుకు కావాల్సినంత సరుకును ఉంచుకున్నాడు. ఈ మొదటి చాప్టర్‌లో కేవలం మర్డర్ కేసును మాత్రమే పరిష్కరించే పనిని పెట్టుకున్నాడు దర్శకుడు. దీంతో నిడివి కూడా చాలా తక్కువే అయింది.

ప్రథమార్దంలో పాత్రల పరిచయం వరకే అన్నట్టుగా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. కానీ ఆ ట్విస్ట్‌తో పెద్దగా మార్పులు జరగవు. ఇక క్లైమాక్స్ ఊహకు అందేలానే సాగుతుంది. సాంకేతికంగా ఈ సినిమా మెప్పిస్తుంది. ఆర్ఆర్ బాగుంది. కెమెరా వర్క్ మెప్పిస్తుంది. నిడివి తక్కువే. నిర్మాత ఈ కథతో ప్రయోగం చేసి సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఎవరెలా చేశారంటే..
ఏసీపీగా అర్చనా ప్రసాద్ చక్కగా నటించింది. తన హోదాకు తగ్గ హుందాతనాన్ని చూపిస్తుంది. చూపుల్తోనే కొన్ని సీన్లను లాక్కొచ్చింది. ఎంతో ఇంటెన్సిటీతో నటించింది. రుహానీ శర్మ ఈ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించింది. శేషాద్రిగా, అర్చన ప్రియుడిగా వికాస్ వశిష్ట కనిపించేది కొంత సేపే అయినా గుర్తుండిపోతాడు. రవి వర్మ,  ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య పాత్రలు కూడా జనాల మీద ముద్ర వేస్తాయి. చిత్రం శ్రీను చిన్న పాత్రలో ఆకట్టుకుంటాడు. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు మెప్పిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement