హీరో శ్రీకాంత్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగు పెట్టిన శ్రీకాంత్ స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు పరిశ్రమంలో విలన్‌గా, నటుడిగా, హీరోగా అలరించాడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సహజమైన నటన, స్టైల్‌తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలా సోలోగా వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు శ్రీకాంత్. కనీసం ఏడాదికి 5 నుంచి 6 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే శ్రీకాంత్ గత కొద్ది రోజులు సినిమాలు చేయడం లేదు.
ఈ మధ్య కాస్తా సినిమాలు తగ్గించిన ఆయన ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. గతంలో తాను డిప్రెషన్‌కు గురయ్యానని చెప్పాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రమంలో ఒక్కసారిగా డౌన్ అయ్యానంటూ గతంలో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘అప్పుడు హీరోగా నా కెరీర్ పీక్స్‌లో ఉంది. అలాంటి సమయంలో ఒకే ఏడాది నేను నటించిన 7 సినిమాలు పరాజయం అయ్యాయి. నా కెరీర్ అప్పుడే ముగిసిందా అని భయం వేసింది. హీరోగా నా ప్రయాణం ముగిసిపోయిందా?, నా సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు నాలో తలెత్తాయి. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను.
దీంతో ఇలా ఉంటే కష్టమని నిర్ణయించుకుని తిరిగి మా ఊరెళ్లిపోవాలనుకున్న. అక్కడ వ్యవసాయం చేసుకుని సెటిలైపోయిదామని డిసైడ్ అయ్యాను. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నన్ను ఓదారుస్తూ ధైర్యం చెప్పాడు. ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు నాకు ఓదార్పునిచ్చాయి. ఆయన ఇచ్చిన ప్రేరణతోనే మళ్లీ సినిమాలు చేస్తూ నా కెరీర్‌ను కొనసాగించాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా పరిశ్రమలో తను అత్యంత ఇష్టపడే వ్యక్తి, సన్నిహితుడు మెగాస్టార్ చిరంజీవి అని శ్రీకాంత్ ఇప్పటికే పలు ఈవెంట్స్, సినీ వేడుకల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ను శ్రీకాంత్ అన్నయ్య అని పిలుస్తుంటాడు. ఇదిలా ఉండగా తన పెద్ద కుమారుడు రోషన్ ‘నిర్మల కాన్వెంట్’ మూవీతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం రోషన్ రాఘవేంద్ర రావు డైరెక్షన్‌లో ‘పెళ్లి సందD’ మూవీ చేస్తున్నాడు. ఇది శ్రీకాంత్ గతంలో నటించిన ‘పెళ్లి సందడికి’ సిక్వెల్‌గా తెరకెక్కుతోంది.
Comments
Please login to add a commentAdd a comment