బ్యాండ్‌ నేర్చుకున్నా..  రెండు సార్లు గుండు గీయించుకున్నా: సుహాస్‌ | Hero Suhas Talk About Ambajipeta Marriage Band Movie | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ సీన్స్ చేయాలంటే సిగ్గు..డైరెక్టర్‌ ఎంగరేజ్‌ చేశాడు: సుహాస్‌

Published Tue, Jan 30 2024 5:27 PM | Last Updated on Tue, Jan 30 2024 6:08 PM

Hero Suhas Talk About Ambajipeta Marriage Band Movie - Sakshi

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాకు ఎక్కువ రోజులు ప్రిపేర్ అయ్యాం. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథలో బాగా కనెక్ట్ అవ్వాలని అనుకున్న సీన్స్ ప్రాక్టీస్ చేశాం. రెండు సార్లు గుండు గీయించుకున్నా. అలా రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి కష్టపడ్డాం. మా నమ్మకం, రెండేళ్ల కష్టం సక్సెస్ రూపంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని సుహాస్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. శివాని హీరోయిన్‌. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సుహాస్‌ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు.. 

ఈ కథలో జరిగిన ఇన్సిడెంట్స్ నేను రియల్ లైఫ్ లో చూడలేదు గానీ మా డైరెక్టర్ చూసిన సంఘటనలు కథలో సగం వరకు ఉంటాయి. తను చూసినవి, తనకు లైఫ్ లో జరిగిన కొన్ని సందర్భాల స్ఫూర్తి ఈ కథలో ఉంది. మిగతాది సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేశాడు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" 2007 లో జరిగే కథ. ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ వరకు చూశాక సినిమా బాగా చేశారని ఫీల్ అవుతారు. ఆ తర్వాత మూవీ ఎమోషనల్ గా ఫీల్ తో సాగుతుంది. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు సరదాగా సాగుతుంటాయి. కలర్ ఫొటోలో ఎమోషన్ కూడా ఉంటుంది. కానీ ఈ సినిమాలో హై ఎమోషన్ ఉంటుంది. రేపు సినిమా చూశాక ఇంత ఎమోషనల్ గా ఎలా నటించారని మీరే అడుగుతారు. 

► నేను షార్ట్ ఫిలింస్ లో నటిస్తున్నప్పటి నుంచి డైరెక్టర్ దుశ్యంత్ తెలుసు. డియర్ కామ్రేడ్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా తను వర్క్ చేశాడు. అప్పటి నుంచే నీతో సినిమా చేస్తా అనేవాడు. కలర్ ఫొటో మూవీ వచ్చాక...మీ వాళ్లతోనే హీరోగా చేసుకుంటావా నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా కదా అన్నాడు. అప్పుడు వెంటనే ఈ మూవీ స్టార్ట్ చేశాం.

► కలర్ ఫొటో సినిమాకు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీకి ఎలాంటి పోలిక, సంబంధం లేదు. రెండూ వేటికవి భిన్నమైన కథలు. ఊరి నేపథ్యం వల్ల మీకు సిమిలర్ గా అనిపిస్తుంటాయి.

► "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. నేను, శరణ్య కవల పిల్లలం. మా పుట్టినరోజున జరిగిన సంఘటనలు జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయి అనేది ఈ మూవీలో కీలకంగా ఉండే అంశం.

 ఈ స్క్రిప్ట్ చదివేప్పుడు ఉన్న ఎగ్జైట్ మెంట్ మేకింగ్ టైమ్ లో మరింత పెరిగింది. ఇప్పుడు శేఖర్ చంద్ర ఇచ్చిన బీజీఎంతో చూసుకున్నప్పుడు మరో లెవెల్ కు వెళ్లింది. ఫైనల్ కాపీ చూశాక చాలా సంతృప్తిగా అనిపించింది. మూవీకి హీరోను కాబట్టి రిలీజ్ టైమ్ లో ప్రెజర్ ఫీలవుతాం. నా భుజాల మీదే సినిమాను మోస్తానని అంటారు కదా. ఆ మాట వింటే భయమేస్తుంటుంది. 

► టైటిలో మ్యారేజి బ్యాండు అనేది ఉంది. అయితే ఊరు పేర్లు వేరేవి అనుకున్నాం కానీ పలికేందుకు బాగుందని అంబాజీపేట యాడ్ చేశారు. దుశ్యంత్, వెంకటేష్ మహా ఫ్రెండ్స్. దుశ్యంత్ చెప్పిన కథ నచ్చి వెంకటేష్ ధీరజ్ కు, గీతా ఆర్ట్స్ వాళ్లకు వినిపించి ప్రాజెక్ట్ సెట్ చేశాడు.

► అమలాపురంలో షూటింగ్ చేసినప్పుడు అక్కడి వాళ్లు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. హోటల్ లో టిఫిన్ చేసి డబ్బులు ఇచ్చినా తీసుకునేవారు కాదు. మా ఊళ్లో షూటింగ్ చేస్తూ డబ్బులు ఇస్తారా అనేవారు. వాళ్ల ప్రేమతో మాకు మాటలు రాకుండా చేశారు.

► హీరోయిన్ శివానికి ఈ సినిమా తర్వాత మంచి పేరొస్తుంది. ఆమె పర్ ఫార్మెన్స్ అంత బాగా చేసింది. శివాని డ్యాన్సర్, సింగర్ కూడా. అక్క క్యారెక్టర్ చేసిన శరణ్య గారు, విలన్ గా చేసిన నితిన్ కూడా ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. 

► నాకు రొమాంటిక్ సీన్స్ చేయాలంటే సిగ్గు. మా డైరెక్టర్స్ మందలిస్తుంటారు. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ చేసేప్పుడు డైరెక్టర్ సందీప్ లాంటి వాళ్లు ఫోన్ చేసి దుశ్యంత్ కు చెప్పారు ఈ సీన్స్ సరిగ్గా చేయడు జాగ్రత్త అని. నీ కెరీర్ లో ఇంకెప్పుడు చేస్తావ్ బ్రో రొమాంటిక్ సీన్స్.. చేయి అని దుశ్యంత్ అనేవాడు.

 రైటర్ పద్మభూషణ్ కు ప్రీమియర్స్ వేయడం వల్ల మంచి టాక్ వచ్చింది. నా సినిమాలకు ప్రీమియర్స్ పడాలి. చూసిన వాళ్లు బాగుందని చెబితే మిగతా వాళ్లు బుకింగ్ చేసుకుని థియేటర్స్ కు వెళ్తారు. నాలాంటి హీరోలకు ప్రీమియర్స్ కు వచ్చే రెస్పాన్స్ చాలా ముఖ్యం. యూఎస్ లో రైటర్ పద్మభూషణ్ సినిమాకు 400 కె కలెక్షన్స్ వచ్చాయి. నా ఫస్ట్ యూఎస్ రిలీజ్ అది. ఇప్పుడు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు 200 లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మంచి కలెక్షన్స్ వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా. 

► నేను చేసిన టైప్ కథలు కాకుండా కొత్తగా ఉండాలని కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు. వాటిలో నేను నాకు నప్పేవి సెలెక్ట్ చేసుకుంటున్నా. హీరోగా కంటే నటుడిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టం. హిట్ 2లో విలన్ గా నటించిన తర్వాత అలాంటివే చాలా ఆఫర్స్ వచ్చాయి. విలన్ రోల్స్ వద్దనుకుని మళ్లీ హీరోగా చేస్తున్నా. నాకు ఇంకొంత వయసు వచ్చాక మరికొన్ని భిన్నమైన క్యారెక్టర్స్ కు సెట్ అవుతా అనిపిస్తోంది. ఇప్పుడు చిన్నగా కనిపించడం వల్ల అన్ని రకాల క్యారెక్టర్స్ కు సెట్ కానేమో అనిపిస్తుంటుంది.

► కలర్ ఫొటో థియేటర్స్ లో రిలీజ్ అయితే బాగుండేది అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. కానీ అప్పుడు అలా జరిగిపోయింది. ఓటీటీ అయినా మనకు మంచి గుర్తింపు వచ్చింది కదా అనిపిస్తుంది. ఆ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు మాకు మంచి గుర్తింపు దక్కిందని సంతోషపడ్డాం.

 రైటర్ పద్మభూషణ్ థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో అని భయపడ్డాం. ఆ మూవీకి లాభాలు వచ్చాయి. ఫర్వాలేదు మన సినిమా కూడా చూస్తున్నారనే సంతృప్తి కలిగింది. ఇంకా మంచి కంటెంట్ చేయాలి, జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా. 

► కలర్ ఫొటో సందీప్ తో ఓ సినిమా చేయబోతున్నా. కథ చెప్పాడు. నెక్ట్ లెవెల్ లో ఉంది. ఆ మూవీకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సుకుమార్ గారి అసోసియేట్ తో ప్రసన్నవదనం అనే ఒక సినిమా చేశా. అది కంప్లీట్ అయ్యింది. కేబుల్ రెడ్డి అనే మరో మూవీ చేస్తున్నా. దిల్ రాజు గారి బ్యానర్ లో సలార్ రైటర్ తో ఒక మూవీ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement