Nandamuri Balakrishna: ఎన్నాళ్లీ మేకప్‌? మీకు ప్యాకపే.! | Hindupur Voters Opinion On Nandamuri Balakrishna | Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: ఎన్నాళ్లీ మేకప్‌? మీకు ప్యాకపే.!

Published Tue, Mar 26 2024 3:30 PM | Last Updated on Tue, Mar 26 2024 6:44 PM

Hindupur Voters Opinion On Nandamuri Balakrishna - Sakshi

రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ సినిమాలతో క్రేజ్‌ తెచ్చుకున్న బాల‌కృష్ణ.. మూడోసారి రాయలసీమలోని హిందూపూరం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాయలసీమ గొప్పతనాన్ని మరిచి.. అక్కడ అంతా రక్తపాతంతో నిండి ఉంటుందని రెండున్నర దశాబ్ధాల క్రితమే తప్పుడు సంకేతాలు ఇస్తూ 'సమరసింహా రెడ్డి'తో లాభ పడ్డాడు. అప్పటి నుంచి అదే కిక్‌ను కొనసాగిస్తూ.. తాజాగా 'వీర సింహా రెడ్డి'తో ‘అఖండ’మైన లాభాలను పొందాడు. రాజకీయంగా, సినిమాల పరంగా రాయలసీమతో ఎంతో​ లబ్ధి పొందిన బాల‌కృష్ణ ఉండేది మాత్రం హైదరాబాద్‌లో... సంవత్సరానికి రెండు సినిమాలు తీస్తూ ఎన్నికల సమయం వచ్చేసరికి హిందూపూరంలో వాలిపోతాడు. చివరకు కరోనా సమయంలో కూడా హిందూపురం ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. అలాంటి కష్ట సమయంలో కూడా ఆయన భాగ్యనగరంలో ఉండిపోయాడు. ఇప్పుడు ఎన్నికలు రాగానే హిందూపురం వచ్చి ప్రజలకు మేకప్‌ వేసే పనిలో ఉన్నాడు. కానీ ఈ సారి మేమే బాలయ్యకు ప్యాకప్‌ చెప్పేస్తామని అంటున్నారు అక్కడి ప్రజలు. 
 

30 ఏళ్లకు పైగా అక్కడ టీడీపీనే.. ప్రజలకు చేసింది శూన్యం
1983 నుంచి ఇప్పటి వరకు అక్కడి ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారు. 2014 ఎన్నికల్లో బాల‌కృష్ణ హిందూపురం నుంచి 16 వేల ఓట్లతో గెలుస్తే.. 2019 ఎన్నికల్లో మాత్రం 17వేల ఓట్లతో నెగ్గారు. మొత్తం 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న హిందూపురం నియోజక వర్గానికి ఇప్పటి వరకు టీడీపీ చేసిన అభివృద్ధి శూన్యం. దీనికి ప్రధాన కారణం బాలయ్య అనే చెప్పవచ్చు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడి ప్రజలను ఏడాదికి ఒక్కసారి అయినా పలకరించిన దాఖలాలు లేవు. ఇక ఎమ్మెల్యేగా బాల‌కృష్ణ ప‌నితీరు గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత‌మంచిది. ఆయన సమయం అంతా సినిమా షూటింగ్స్‌కే కేటాయించడానికి సరిపోతుంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే.. ఎప్పుడో తనకు బుద్ది పుడితే అడ‌పాద‌డ‌పా హిందూపురం వెళ్లి హ‌ల్చ‌ల్ చేసే వారు. ఆ సమయంలో మందీమార్బ‌లాన్ని పెట్టుకుని బైకు తోలుతూ, ఎద్దుల‌బండి తోలుతూ.. బాల‌కృష్ణ స‌ర్క‌స్ ఫీట్లు చేసే వారు. కానీ ఎప్పుడైతే అధికారం పోయిందో బాల‌కృష్ణ హిందూపురం వైపు వెళ్ల‌డం అనేది జరిగింది లేదు.
 

బాల‌య్యకు వార్నింగ్‌ బెల్స్‌
30 ఎళ్లుగా టీడీపీ వెంట నడిచిన హిందూపురం ప్రజలకు బాల‌కృష్ణ చేసిన మంచిపని ఒక్కటి కూడా లేదు. అందుకే  హిందూపురం ప‌రిధిలో మున్సిప‌ల్, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో టీడీపీని చిత్తు చిత్తుగా అక్కడి ప్రజలు ఓడించారు. టీడీపీ గ‌తంలో అధికారంలో లేని స‌మ‌యంలో కూడా హిందూపురం మున్సిపాలిటీని ఆ పార్టీ నిలుపుకునేది. ఉనికిని గ‌ట్టిగా చాటుకునేది. అయితే బాల‌కృష్ణ గ‌త ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి నెగ్గినా కూడా మున్సిప‌ల్, ఇత‌ర స్థానిక ఎన్నిక‌ల్లో దారుణమైన ఓటమిని టీడీపీ చూసింది. దీనంతటికి కారణం బాల‌కృష్ణ అనే చెప్పవచ్చు. గెలిపించిన ప్రజల కోసం నిలబడకుండా.. నిత్యం సినిమా షూటింగ్స్‌లతో బాలయ్య బిజీగా ఉంటూ వచ్చారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను ఆయన పీఏలు చూసుకుంటూ వచ్చారు. డబ్బులు దోచుకోవడం..దోచుకున్నది పంచుకోవడం తప్ప ఆ పీఏలు చేసిందేమి లేదు. దీంతో అక్కడ ప్రజల్లో బాలయ్యపై తీవ్రమైన వ్యతిరేఖత రావడం మొదలైంది. అందుకే గత మున్సిపల్‌, పంచాయితీ ఎన్నికల్లో హిందూపురం ప్రజలు టీడీపీని చావుదెబ్బ కొట్టారు. ఇదే రేంజ్‌లో రాబోయే ఎన్నికల్లో బాల‌కృష్ణకు ఇదేగతి పడుతుందని హిందూపురం ప్రజల నుంచి వార్నింగ్‌ బెల్‌ మోగింది. టీడీపీ ఎన్ని ఎత్తులు వేసిన ఈసారి బాల‌కృష్ణ గెలుపు కష్టమే అని చెప్పవచ్చు.

సినిమాలకే బాలయ్య ఓటు
హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య 2014లో ఎంపికయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు..? నమ్మి గెలిపించిన ప్రజల కోసం అండగా నిలబడుతారు. కానీ బాలయ్య ఆ పని చేయలేదు. తన పంతాను మార్చుకోకుండా సినిమాలతోనే తన 10 ఏళ్ల ఎమ్మెల్యే కాలాన్ని పూర్తిచేశారు. పదేళ్లపాటు పదవిలో కొనసాగుతూనే 12 సినిమాలు విడుదల చేసి 13వ చిత్రం కూడా షూటింగ్‌ పనులు కానిచ్చేశారు. సినిమాల‌తో పాటు ఓటీటీ షోల‌తో బాల‌కృష్ణ చాలా బిజీగా కాలం వెళ్లదీశారు. త‌ను ఎమ్మెల్యే అనే విష‌యాన్ని కూడా మ‌రిచిన‌ట్టుగా ఉన్నారు.

2014-2024 వరకు ఎమ్మేల్యేగా పదేళ్ల కాలం పదవిలో ఉంటూనే 13 సినిమాలు తీసిన బాల‌కృష్ణ.. పదవి లేకుండా అంటే 2004-2014 వరకు 14 సినిమాలు విడుదల చేశారు. ఈ లెక్కలు చాలు హిందూపురం ప్రజలకు బాల‌కృష్ణ ఏ మాత్రం అందుబాటులో ఉంటున్నాడో చెప్పడానికి అని నెటిజన్లు లెక్కలతో సహా చెబుతున్నారు. అందుకే ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత హిందూపురంలో చాప చుట్టేసి.. అక్కడ ప్రజలను గాలికొదిలేసి సినిమాలకు తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు.

సినిమాలతో అయినా న్యాయం చేశారా..?
బాల‌కృష్ణకు ప్లాపులు పడితే చాలు రాయలసీమ బ్యాక్‌డ్రాప్ పేరుతో సినిమా తీస్తాడు. అందులో సీమ గురించి తక్కువ చేస్తూ చూపించడం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. రాయలసీమంటే రక్తపాతం.. అక్కడ అందరూ వికృతంగా కనిపిస్తారని తన సినిమాలో చూపించడం. రాక్షసుల్లాంటి వాళ్లందరూ ఆ ప్రాంతంలో ఉంటారని చెప్పడం. అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదని చెప్పడం. వాళ్లందర్నీ నరికినరికి చంపేది బాలకృష్ణ ఒక్కడే అన్నట్లు చూపిస్తాడు.

బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించేది రాయలసీమలోని హిందూపురం. గతంలో తన తండ్రి అదే నియోజకవర్గం నుంచి పలు సార్లు ఎన్నికైన వ్యక్తి. బాలకృష్ణ వియ్యంకుడు పుట్టి పెరిగింది కూడా రాయలసీమలోనే.. ఇవన్నీ ఆయన కంటికి కనిపించకపోవడం బాధాకరం. తనకు రాయలసీమ సినిమా జీవితాన్ని ఇస్తే.. అదే ప్రాంతానికి చెందిన హిందూపురం రాజకీయ భిక్ష పెట్టింది. అలాంటి ప్రాంత ప్రజలనే చిన్నచూపు చూసే బాల‌కృష్ణకు ఈసారి ఎన్నికల్లో హిందూపురం ప్రజలు తగిన బుద్ధి చెప్పడం దాదాపు ఖాయం అని చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement