ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ ఒకటి. ఈ చిత్రం గురించి...
ప్రతి మనిషికీ ఆలోచనలుంటాయి. కానీ కొంతమందికి ప్రత్యేక ఆలోచనలొస్తాయి. మరీ ముఖ్యంగా హాలీవుడ్ దర్శకులకు విపరీత ధోరణితో ఆలోచనలొస్తాయి. అవి వాళ్లు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుంచుతారు. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమానే ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’. ఈ సినిమా సిరీస్‌లో మూడవది. ఈ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలూ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు వచ్చిన ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ నెల రోజుల క్రితమే ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా పెయిడ్ ఫార్మెట్‌లో విడుదలవగా... ఈ వారమది అందరికీ అందుబాటులోకి వచ్చింది.
దాదాపు ముప్పైఏడేళ్ల క్రితం ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ‘పుష్పక విమానం’ అనే ప్రత్యేకమైన సినిమా తీశారు. ఒక్క డైలాగ్ లేకుండా చక్కటి కామెడీతో చూడముచ్చటగా ఉంటుందా చిత్రం. దాదాపు అలాంటి కోవకే చెందిన ఇంగ్లిష్ చిత్రం ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ చూసేవాళ్లకు చెమటలు పట్టించడం ఖాయం. మాటలు తక్కువున్నా ప్రేక్షకులకు దడ పుట్టిస్తుంది. జాన్ క్రసింస్కీ ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలన్నిటికీ రచయిత. మొదటి రెండు చిత్రాలకు తాను దర్శకత్వం వహించగా తాజా చిత్రానికి మైఖేల్ సర్నోస్కీ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా కథ ప్రకారం... న్యూయార్క్‌లో హాస్ స్పైస్ అనే ఫెసిలిటీలో క్యాన్సర్ పేషంట్‌గా ఉన్న సామ్ తన కుక్క పిల్లతో వాలంటీర్ రూబెన్‌తో కలిసి ఓ ప్లే చూడడానికి సిటీలోకి వెళ్తుంది. సామ్‌కి సంగీతం అంటే ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి వింటుంటుంది. అప్పుడే మాన్‌హాట్టన్ నగరంపై ఏలియన్స్ దాడి జరుగుతుంది. ఈ ఏలియన్స్ ఎక్కడైనా శబ్దం వస్తే చాలు కనిపించిన మనుషులపై దాడి చేస్తూ ఉంటాయి.
నగరమంతా వాటి దాడి వల్ల క్షణాల్లో నిర్మాణుష్యమై΄ోతుంది. అక్కడక్కడా శబ్దం చేయకుండా బ్రతికున్నవాళ్లు ఏలియన్స్ నుండి తప్పించుకుంటూ ఉంటారు. అసలే క్యాన్సర్ బారిన పడిన సామ్ ఈ ఏలియన్స్ దాడిని ఎలా ఎదుర్కొందనేది మిగతా కథ. పైన చెప్పుకున్నట్టు ఈ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమా చూశాక తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం... ఈ వీకెండ్ చూసెయ్యండి. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment