రొటీన్ రొట్టకొట్టుడు కమర్షియల్ కథలు కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి. అలా ఈ ఏడాది మార్చిలో తమిళంలో రిలీజైన 'హాట్ స్పాట్' మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో అంతలా ఏముంది? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి!
కథేంటి?
రివేంజ్, యాక్షన్, ప్రేమ కథలు విని విని ఓ నిర్మాతకు చిరాకొస్తుంది. అలాంటి టైంలో స్టోరీలు పట్టుకుని డైరెక్షన్ ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్న మహమ్మద్ షఫీ (విఘ్నేశ్ కార్తీక్) వస్తాడు. 10 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వనని అనడంతో ఓ నాలుగు కథల్ని ఎదురుగా కూర్చున్న నిర్మాతకు చెప్తాడు. ఇంతకీ ఆ నాలుగు స్టోరీలు ఏంటి? ఇవన్నీ విన్న తర్వాత నిర్మాత ఏమన్నాడు? అసలు షఫీ.. సదరు నిర్మాతకే ఎందుకు చెప్పాడు అనేదే మెయిన్ స్టోరీ.
ఎలా ఉందంటే?
దీన్ని సినిమా అనడం కంటే 'ఆంథాలజీ' అనొచ్చు. 'హ్యాపీ మ్యారీడ్', 'గోల్డెన్ రూల్', 'టమాటో చట్నీ', 'ఫేమ్ గేమ్' అనే నాలుగు వేర్వేరు కథల్ని ఓ సినిమాగా తీశారు. చూస్తున్నంతసేపు ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ. ఎందుకంటే అంతలా ఆశ్చర్యపరుస్తాయి. అవాక్కయ్యేలా చేస్తాయి. ఏడిపిస్తాయి. భయపెడతాయ్!
పెళ్లి తర్వాత ఆడపిల్లలు.. తమ ఇంటిని ఎందుకు వదిలిపెట్టాలి? అనేదే మొదటి స్టోరీ. ప్రేమ పెళ్లికి సిద్ధమైన ఓ జంటకు ఇలా కూడా జరిగే అవకాశముందా? అనేది రెండో స్టోరీ. తప్పు చేసి దాన్ని సమర్థించుకునే ప్రియుడికి బుద్ధిచెప్పే అమ్మాయి.. మూడో స్టోరీ. టీవీ షోల వల్ల పిల్లలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారనేది నాలుగో స్టోరీ.
ఈ సినిమాలో ఒక్కో స్టోరీ ఒక్కో ఆణిముత్యం. ఎందుకంటే ఏ మూవీలో అయినా ఒకటో రెండో సీన్లు వేరే వాటితో పోలిక రావొచ్చు. కానీ ఇందులో ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే చూస్తున్న మీకే నమ్మశక్యం కాని విధంగా సన్నివేశాలు ఉంటాయి. మొదటి కథ కాస్త కొత్తగా ఉంటుంది. చివరికొచ్చేసరికి ఆలోచింపజేస్తుంది. రెండో కథలో ఓ ట్విస్ట్ ఉంటుంది. అది ఇబ్బందిగా అనిపిస్తూనే మైండ్ బ్లాంక్ చేస్తుంది. మూడో కథ అయితే రెండో దానికంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మూడు స్టోరీలు.. యూత్‌ని టార్గెట్ చేసి తీసినవే.
నాలుగో కథలో మాత్రం పిల్లలు.. ప్రస్తుతం సోషల్ మీడియా, టీవీ షోల కల్చర్ వల్ల ఎంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారనేది చూపిస్తారు. చిన్న పిల్లలున్న పేరెంట్స్ కచ్చితంగా చూడాల్సిన స్టోరీ ఇది. అయితే ఈ నాలుగింటిలోనూ దేనికది బాగానే ఉంటాయి కానీ మొదటి, చివరి స్టోరీలో మాత్రమే సరైన ముగింపు ఉంటుంది. మిగతా రెండింటిని మధ్యలో ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది.
టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ విఘ్నేశ్ కార్తీక్ రాసుకున్న స్క్రిప్ట్ మేజర్ హైలైట్. చూపించేది బోల్డ్ కంటెంట్ అయినప్పటికీ ఫన్నీ వేలో చెప్పడం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా సరిపోయింది. సినిమాటోగ్రాఫీ ఫెర్ఫెక్ట్. డైలాగ్స్ బాగున్నాయి. చూస్తున్నంతసేపు తెలుగు సినిమాలా ఉందేంటి అనిపిస్తుంది. యాక్టర్స్ తమిళవాళ్లే. కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ సినిమాని పొరపాటున కూడా ఫ్యామిలీతో చూడకండి. ఆహా ఓటీటీలో తెలుగులోనే అందుబాటులో ఉంది.
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment