Hrithik Roshan: కష్టాన్నీ ప్యార్‌ కియా.. సూపర్‌హీరో బన్‌గయా! | Hrithik Roshan Birthday Special Story, Know Some Interesting And Rare Facts About Him In Telugu - Sakshi
Sakshi News home page

Hrithik Roshan Lesser Known Facts: నత్తోడు అని హేళన..బురదనీళ్లతోనే స్నానం..హృతిక్‌ పడ్డ కష్టాలెన్నో..

Published Wed, Jan 10 2024 12:03 PM | Last Updated on Wed, Jan 10 2024 4:35 PM

Interesting Facts About Hrithik Roshan - Sakshi

హాలీవుడ్‌ సినిమాలకి ఎంతోమంది సూపర్‌ హీరోలు. సూపర్‌ మేన్, స్పైడర్‌ మేన్, బ్యాట్‌ మేన్, ఫెంటాస్టిక్‌ ఫోర్‌... ది లిస్ట్‌ నెవర్‌ స్టాప్స్‌... మరి మనకు సూపర్‌ హీరో? క్రిష్‌.. క్రిష్‌ 1.. క్రిష్‌ 2.. క్రిష్‌ 3... అందం ఉంది, నటన ఉంది, పర్సనాలిటీ ఉంది, ఎనర్జీ ఉంది, సిక్స్‌ ప్యాక్‌ ఉంది... వీటన్నింటికి తోడు ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొనే ఆత్మశక్తి ఉంది. అందుకే హృతిక్‌... సూపర్‌ రోషన్‌.

దేవుడు మనకు ఏదైనా అదనంగా ఇస్తే సంతోషించాలి. కానీ హృతిక్‌ విషయంలో అది రివర్స్‌ అయ్యింది. దేవుడు అతనికి ఒకటి అదనంగా ఇచ్చాడు. ఏమిటో తెలుసా? కుడి చేతికి ఆరో వేలు. స్కూల్లో పిల్లలు అతణ్ణి వింతగా చూసేవారు. వెక్కిరించేవారు. వికృత పిల్లవాడి కింద జమకట్టేవారు. కుడి చేతి బొటన వేలు పక్కన ఇంకో బొటన వేలు ఉండటం హృతిక్‌ లోపం. దానిని కట్‌ చేసి తీసేయలేము. అలాగని ఉంచుకోలేము. ఎటువంటి ఇతర సమస్యలేని ఈ సమస్య చిన్నారి హృతిక్‌ని ఛిన్నాభిన్నం చేసింది. ఎవరితోనూ కలిసేవాడు కాదు. మాట్లాడేవాడు కాదు. ఫలితం... నత్తి. చిన్నప్పుడు హృతిక్‌ రోషన్‌కు నత్తి ఉండేది. మాట్లాడటానికి తడబడేవాడు. స్కూల్లో ఓరల్‌ టెస్టులు ఉంటాయి కదా. లేచి నిలబడి ఏదో ఒకటి ఒప్పజెప్పాలి. ఆ రోజు తప్పనిసరిగా స్కూల్‌ ఎగ్గొట్టేవాడు. ఇంట్లో ఇదంతా పెద్ద నరకం.

జె.ఓం ప్రకాష్‌ పేరు ఎవరైనా వినే ఉంటారు. ఇతడు నిర్మాత– దర్శకుడు. ‘జైజై శివశంకర్‌’ వంటి రాజేష్‌ ఖన్నా సూపర్‌హిట్‌ పాటలున్న ‘ఆప్‌ కి కసమ్‌’ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ ఇతడే. ఇతని కుమార్తెనే నటుడు రాకేష్‌ రోషన్‌ వివాహం చేసుకున్నాడు. వీళ్లకు పుట్టినవాడే హృతిక్‌ రోషన్‌. తాత జె.ఓం ప్రకాష్‌ మాత్రం హృతిక్‌ మానసిక, శారీరక సమస్యలను పట్టించుకునేవాడు కాదు. తన మనవడు పెద్దయ్యి పెద్ద హీరో అవుతాడని అతడి నమ్మకం. అందుకే తాను తీసే సినిమాల్లో చైల్డ్‌ అప్పియరన్స్‌ ఇప్పించేవాడు. హృతిక్‌ అలా అరడజను సినిమాల్లో నటించాడు. సినిమా వాతావరణం అలా తెలుసు. తండ్రి రాకేష్‌ రోషన్‌ హీరో కనుక అలా కూడా సినిమాలు తెలుసు. బాబాయ్‌ రాజేష్‌ రోషన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. సినిమా కుటుంబంలో పుట్టిన హృతిక్‌ కచ్చితంగా సినిమా హీరోయే కావాలి. కాని అదంత సులభం కాలేదు.

తండ్రులు కొడుకులను కాపాడాలనుకుంటారు. రాకేష్‌ రోషన్‌ కూడా హృతిక్‌ని కాపాడాలనుకున్నాడు. ఎందుకంటే అతడి జీవితం సాఫీగా సాగలేదు. హీరోగా పెద్దగా సక్సెస్‌ కాలేదు. నిర్మాతగా ట్రై చేశాడు. అందులోనూ ఫ్లాప్స్‌ చూశాడు. అప్పటికే ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఇక చివరి ప్రయత్నంగా దర్శకుడిగా మారి ‘ఖుద్‌గర్జ్‌’ సినిమా తీశాడు. అది హిట్‌ అయ్యింది. ఆ తర్వాత ‘ఖూన్‌ భరీ మాంగ్‌’, ‘కిషన్‌ కన్హయ్య’ వంటి భారీ హిట్స్‌ ఇచ్చాడు. అయినా సరే గ్యారంటీ లేని ఈ రంగంలోకి వచ్చే ముందు ఏదో ఒక బతుకు విద్య ఉండాలని కొడుకు విషయంలో భావించాడు. ‘అమెరికా వెళ్లి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ నేర్చుకునిరా’ అన్నాడు హృతిక్‌ని. హృతిక్‌ అంగీకరించాడు.

దానికి ముందు ఏదైనా టెక్నికల్‌ కోర్సు కూడా చదివించాలని నిర్ణయించుకున్నాడు. దానికీ సరే అన్నా హృతిక్‌ మనసు చెబుతోంది– ఇవన్నీ తన పనులు కాదని, తను పుట్టింది వీటి కోసం కాదని, తను హీరో కావాలని. ఒకరోజు నేరుగా వెళ్లి తండ్రి వద్ద చెప్పేశాడు– నాన్నా... ఇవన్నీ నా వల్ల కాదు. నేను హీరోనే అవుతా. రాకేష్‌ రోషన్‌ పరికించి చూశాడు. ‘సరే... స్క్రీన్‌ మీద ఏదైనా ఒకటి జరగాలంటే స్క్రీన్‌ వెనుక ఎంత కష్టం ఉంటుందో నీకు తెలియాలి. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరు’ అని ఆదేశించాడు. హృతిక్‌ రోషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాడు– ఆరో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా.

రాకేష్‌ రోషన్‌ కొడుకు అన్న అదనపు గౌరవం సెట్‌లో హృతిక్‌కు ఏ మాత్రం ఉండేది కాదు. అందరిలాగే కష్టపడాలి. అందరు అసిస్టెంట్‌ డైరెక్టర్లతో కలిసి ఉండాలి. ‘కోయ్‌లా’, ‘కరణ్‌ అర్జున్‌’ సినిమాలకు అలా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. నైరోబీలో షూటింగ్‌ జరుగుతుంటే అందరూ ముందే స్నానాలు చేసి వెళ్లిపోతే తను ఆరోవాడు కనుక ఆఖరు చేయాల్సి వచ్చేది. అప్పటికి నీళ్లు అయిపోయి బురద నీళ్లు వచ్చేవి. ఆ బురదనీళ్లలోనే స్నానం చేసి షూటింగ్‌కు వెళ్లేవాడు. పైకి రావాలంటే కష్టం చేయాలి. పైకి వచ్చిన ప్రతివాడూ ఇలాంటి కష్టం తప్పనిసరిగా చేసే ఉంటాడు.

హృతిక్‌ని హీరోగా లాంచ్‌ చేయాలి. తాను హీరోగా ఫ్లాప్‌ అయ్యాడు... కాని తన కొడుకు హీరోగా ఫ్లాప్‌ కాకూడదు అనుకున్నాడు రాకేష్‌ రోషన్‌. కానీ ఈ విషయంలో రెండు సమస్యలు ఉన్నాయి. హృతిక్‌కు ఉన్న నత్తి ఒక సమస్య. రెండు అతడి వెన్నులో, మోకాలిలో మరో సమస్య. డాక్టర్‌ పరీక్షించి చూసి ‘నువ్వు జన్మలో డాన్స్‌ చేయలేవు. చేయకూడదు’ అని చెప్పాడు. ఓడిపోయేవాడైతే ఆ మాట విన్న వెంటనే పోతాడు. కానీ హృతిక్‌ గెలవాలని నిశ్చయించుకున్నవాడు. అంతే ఆ మాటనే సవాలుగా చేసుకుని డాన్స్‌ క్లాసుల్లో చేరాడు.

మోకాలూ వెన్నూ విరగనీ.. నాశనం కానీ తాను మాత్రం బెస్ట్‌ డాన్సర్‌గా నిలవాలి అని ప్రాక్టీస్‌ చేశాడు. డాక్టర్‌ చెప్పిన సమస్య ఎటు పోయిందో ఏమో. హృతిక్‌ ఇప్పుడు బెస్ట్‌ డాన్సర్‌ అయ్యాడు. ఇక నత్తి విషయం. స్పీచ్‌ థెరపీ తీసుకున్నాడు. అంతే కాదు అర్ధరాత్రి రెండు గంటలకు లేచి ఏదో ఒక సినిమాలోని ఏదో ఒక డైలాగును గుర్తు చేసుకుని నత్తి లేకుండా దానిని చెప్పడానికి పొద్దున వరకూ ప్రాక్టీసు చేసేవాడు. నత్తి పోయింది. డాన్స్‌ వచ్చింది. ఇక హీరో కావడానికి రెడీగా ఉన్నాడు. కానీ అందుకు దారిలో మూడు కొండలు అడ్డంగా నిలుచుని ఉన్నాయి.

‘కహో నా ప్యార్‌ హై’ 2000 సంవత్సరంలో వచ్చింది. కానీ అప్పటికి ఆమీర్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్, షారూక్‌ ఖాన్‌ బాలీవుడ్‌ను ఏలుతున్నారు. బాలీవుడ్‌ అంటే ఈ ఖాన్‌ త్రయమే. దీనిని బద్దలు కొట్టే హీరో కోసం బాలీవుడ్‌ ఎదురు చూస్తోంది. అలాంటి వారు ఎవరూ రారనే ధైర్యంతో ఖాన్లు ఉన్నారు. ఇప్పుడు హృతిక్‌ వస్తే వీరి చరిష్మాను బ్రేక్‌ చేసే స్థాయిలో రావాలి. అలా అతణ్ణి స్క్రీన్‌ మీద ప్రెజెంట్‌ చేయాలి. రాకేష్‌ రోషన్‌ ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. లవ్‌ స్టోరీ, మంచి పాటలు, కొత్త రకమైన డాన్సులు, అందంగా కనిపించే హీరోయిన్‌ అమీషా పటేల్‌.... జనవరి 14, 2000 సంవత్సరంలో ‘కహో నా ప్యార్‌ హై’... విడుదలైంది. ఖాన్‌ త్రయం పేరుతో అలుముకున్న ఆకాశం బద్దలైంది. జనం ఆమిర్, షారుక్, సల్మాన్‌ ఖాన్‌లను తాత్కాలికంగా మర్చిపోయారు.

ఎక్కడ చూసినా హృతిక్‌ రోషన్‌ జపమే. రాజేష్‌ ఖన్నా తర్వాత ఆ స్థాయిలో ఆడపిల్లలు వెర్రెత్తి పోయింది హృతిక్‌ రోషన్‌ కోసమే. దేశంలో ఎక్కడ కనిపించినా వేలాది మంది మూగిపోవడం మొదలుపెట్టారు. నెల్సన్‌ మండేలా అంతటి వాడు తమ దేశంలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు కావలసిందిగా హృతిక్‌కు వర్తమానం పంపాడు. హిమాలయాల్లో ముక్కు మూసుకొని ఉండే సాధువులు కూడా గుంపులుగా ముంబై వచ్చి హృతిక్‌ని చూసి వెళ్లారనేది నిజంగా జరిగిన నిజం. కొందరు హృతిక్‌ని కొత్త అవతార్‌ అన్నారు. మీడియా దీనికి ‘హృతిక్‌ మేనియా’ అని పేరు పెట్టింది. హృతిక్‌ ఓవర్‌నైట్‌ సూపర్‌ స్టార్‌.

కాని ప్రకృతి బేలెన్స్‌ చేయడం లేదు. ఎగరేసిన వస్తువు కింద పడాలి. అది రూలు. పడ్డాక స్థిరత్వం వస్తుంది. ఎగిరినా సరే కాళ్లు నేల మీద ఉండాలన్న తత్త్వం తెలిసొస్తుంది. ‘కహో నా ప్యార్‌ హై’ తర్వాత హృతిక్‌ రోషన్‌ వరుస పెట్టి ఫ్లాప్స్‌ ఇచ్చాడు. ‘ఫిజా’, ‘మిషన్‌ కాశ్మీర్‌’, ‘యాదే’, ‘ఆప్‌ ముఝే అచ్ఛే లగ్‌నే లగే’, ‘ముజ్సే దోస్తీ కరోగే’, ‘మై ప్రేమ్‌ కీ దీవానీ హూ’... ఈ సినిమాల్లో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ వారి సినిమా ఉంది. ప్రఖ్యాత దర్శకుడు సూరజ్‌ భరజ్యాతా దర్వకత్వం వహించిన సినిమా కూడా ఉంది. కానీ ఏవీ బాక్సాఫీస్‌ వద్ద ఆడలేదు.

రెండేళ్లలో ఆరేడు ఫ్లాప్స్‌ ఇచ్చే సరికి ఖాన్‌ త్రయం బహుశా ముసిముసిగా నవ్వు కొని ఉంటుంది. పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని అనుకొని ఉంటుంది. మీడియా అయితే హృతిక్‌ ఒన్‌ ఫిల్మ్‌ వండరనీ అతడి పని అయిపోయినట్టేనని శాసనాలు దండోరా వేయించింది. కానీ అయిపోయిందంటే అయిపోయినట్టు కాదు. తిరిగి మొదలైనట్టు. తండ్రి దర్శకత్వంలో హృతిక్‌ హీరోగా మళ్లీ మొదలైన సినిమా ‘కోయి మిల్‌గయా’.

హీరోకి బుద్ధిమాంద్యం... తోడుగా ఒక అంతరిక్ష జీవి... ‘కోయి మిల్‌గయా’ ఆడకపోయి ఉంటే కథ ఎలా ఉండేదో కానీ ఆబాల గోపాలం ఆ సినిమా చూసింది.  తండ్రీ కొడుకులు మళ్లీ హిట్‌ కొట్టారు. వాళ్లు ఒకటి అనుకున్నారు. హృతిక్‌ మిగిలిన దర్శకుల దర్శకత్వంలో భిన్నమైన సినిమాలు చేస్తూ ఉంటాడు... కానీ తండ్రి మాత్రం రెగ్యులర్‌గా అతడితో కమర్షియల్‌ సినిమాలు తీస్తూ ఉంటాడు అని. అందుకనే హృతిక్‌ బయట దర్శకుల దర్శకత్వంలో ‘జోధా అక్బర్‌’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ వంటి సినిమాలు చేస్తే తండ్రి దర్శకత్వంలో ‘క్రిష్‌’, ‘క్రిష్‌ 3’ వంటి సూపర్‌ హీరో సినిమాలు చేసి హాలీవుడ్‌కి స్పెడర్‌ మేన్, ఐరన్‌ మేన్‌ ఉన్నట్టు మనకు ఒక ‘క్రిష్‌’ ఉన్నాడని, ఉండగలడని నిరూపించాడు. అయితే అతడు కేవలం కమర్షియల్‌ హీరో మాత్రమే కాదని అతడిలో ఒక మంచి నటుడు ఉన్నాడని ‘జోధా అక్బర్‌’, ‘జిందగీ నా మిలేగి దొబారా’ నిరూపించాయి.

హృతిక్‌ ఎంతో కష్టపడి చేసిన ‘మొహంజొదారో’ ఆడలేదు. కానీ అంధుడుగా నటించి, విడుదల చేసిన ‘కాబిల్‌’ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హృతిక్‌ ప్రస్తుతం ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. వార్, పఠాన్ సినిమాల‌ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వ‌హిస్తున్న  ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌. రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement