జీవితాన్ని ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేసేవాళ్లలో సుగంధా గర్గ్ ఒకరు. ఆమె ఎవరు? హాట్ స్టార్‌లో ‘ఆర్య’, అమెజాన్ ప్రైమ్‌లో ‘గిల్టీ మైండ్స్’ చూసిన వాళ్లకు బాగా తెలుసు సుగంధా ఎవరో! అయితే ఆమె గాయని కూడా! ఎమ్‌టీవీ ‘కోక్ స్టూడియో సీజన్ 2’ లో సుగంధా తన గాన మాధుర్యాన్ని వినిపించింది. ఆమె గురించి కొన్ని వివరాలు..
►పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో. పెరిగింది హైదరాబాద్‌లో. తల్లిదండ్రులు.. మీనా గర్గ్, శేఖర్ గర్గ్. సుగంధా.. ఢిల్లీలోని మైత్రేయి కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది.
►పద్దెనిమిదేళ్ల వయసులోనే బీబీసీ చానెల్‌లో ఉద్యోగం వచ్చింది.. హోస్ట్‌గా. ఆమె నిర్వహించిన షో పేరు ‘హాథ్ సే హాథ్ మిలా’. ఫొటోగ్రఫీలోనూ శిక్షణ పొందింది. నటి కావాలని కలలు కన్నది.
►డిగ్రీ అయిపోగానే ముంబై చేరింది. సినిమా అవకాశాల కోసం దరఖాస్తుల పర్వం మొదలుపెట్టింది. అలా తెచ్చుకున్న మొదటి చాన్స్ ‘జానే తూ యా జానే నా’ సినిమా. తర్వాత లాస్ట్ డాన్స్, మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి సినిమాలూ చేసింది.
►‘తెరే బిన్ లాడెన్’తో సుగంధాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు అదే సినిమా సీక్వెల్లోనూ అవకాశాన్నిచ్చింది. ఆమె నటనా ప్రతిభ అంతర్జాతీయ ప్రేక్షకులకూ పరిచయం అయింది.. ది కైట్ – పతంగ్, కాఫీ బ్లూమ్ వంటి చిత్రాలతో.
► థియేటర్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తోంది. ‘ఐ హావ్ గాన్ మార్కింగ్ అండ్ సమ్‌టైమ్స్’ అనే నాటకంలోని సుగంధా అభినయానికి అభినందనల వర్షం కురిసింది.
► ఈ తరానికీ దగ్గరవడానికి ఓటీటీని ప్లాట్‌ఫామ్‌గా చేసుకుంది. ఆర్య, గిల్టీ మైండ్స్‌తో యూత్‌కూ ఫేవరెట్‌గా మారింది.
►ఇంకో విషయం.. సుగంధా దక్షిణాది చిత్రసీమలోనూ ఎంట్రీ ఇచ్చింది. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ‘సిలోన్’ అనే తమిళ (నిజానికిది ద్విభాషా చిత్రం. ఇంగ్లిష్‌లోనూ విడుదలైంది) చిత్రంతో. ‘సిలోన్ సినిమాలోని రజిని పాత్రలో సుగంధా ఒదిగిపోయింది. ఆ రోల్ ఇంకెవరు చేసినా న్యాయం చేయగలిగేవాళ్లు కాదు. అది ఆమెకు మాత్రమే సాధ్యమైంది’ అంటూ సుగంధా నటనకు ముగ్ధుడయ్యాడు సంతోష్ శివన్.
నాకు వచ్చిన ప్రతి పనినీ అమితంగా ప్రేమిస్తా. రాని పనినీ అంతే ఇష్టంగా నేర్చుకుంటా. అందిన జీవితాన్ని అందినట్టుగా ఆస్వాదించడంలో ఉన్న ఆనందమే వేరు - సుగంధా గర్గ్
Comments
Please login to add a commentAdd a comment