ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటుడు అభినయ కృష్ణ. జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో అదిరే అభిగా బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆయన తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నాడు. అదేంటో ఆయన మాటల్లోనే..
"ఆర్థికంగా ఇప్పటివరకు నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడూ అప్పు కూడా చేయలేదు. షూటింగ్స్ లేకపోయినప్పటికీ జబర్దస్త్ నుంచి మాకు ఒక షెడ్యూల్‌కు డబ్బులు ఇచ్చారు. పైగా గతంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేశాను. అప్పుడే సొంతిల్లు కట్టుకున్నాను. ఒక కారు కూడా ఉంది. ఇక చదువుకునేటప్పుడు ఎస్‌టీడీ బూత్‌లో పని చేశాను. ట్యూషన్‌లు కూడా చెప్పేవాడిని. అలా హాస్టల్‌లో నా పాకెట్‌మనీ నేను సంపాదించుకునేవాడిని.
అలా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చా..
'ఈశ్వర్' సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్స్‌కు పిలిస్తే నలభై మంది వచ్చారు. అందులో నేను సెలక్ట్ అయ్యాను. డబ్బులు సంపాదించుకోడానికి అయితే సాఫ్ట్‌వేర్ జాబే చేయొచ్చు. కానీ నేను సినిమా కోసం వచ్చాను. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సంఘటన జరిగింది. షూటింగ్ మధ్యలో బ్రేక్ చెప్పారు. మేము లంచ్ బాక్స్‌లు తీసి తింటున్నాం. ఇంతలో ఫైట్ మాస్టర్ వచ్చి లంచ్ ఎవడు చేయమన్నాడు, షాట్ ఉంది, రండి అని పిలిచాడు. ఒక్కసారిగా షాకైన నేను తినేటప్పుడు మధ్యలో ఎలా వెళ్లను? అని ఓ క్షణం ఆలోచించాను. కానీ తప్పదు కాబట్టి తింటున్న ప్లేట్ పక్కన పెట్టి వెళ్లా. అన్నాన్ని అలా మధ్యలో వదిలేయడం కాస్త బాధ కలిగించింది.
ఎవడు రానిచ్చాడు..
ఈమధ్య ఒక స్టూడియో మేనేజర్ కించపరుస్తూ మాట్లాడాడు. నేను ఇంకా పార్కింగ్‌లోనే ఉన్నాను. అప్పుడతను వచ్చి లోపలికి ఎవరిని అడిగి వచ్చారు, కారు బయట పెట్టండి? అంటూ రెచ్చిపోయాడు. ముందు ఇక్కడ నుంచి బండి తీయండి అని దురుసుగా మాట్లాడాడు. నేను మాత్రం అతడిని మీరు అని మర్యాదగా మాట్లాడాను. కొందరు ఇలానే ప్రవర్తిస్తారులే అని నేనే లైట్ తీసుకున్నా.
ఇక కొందరుంటారు. అసలు జబర్దస్త్ చూడనే చూడము, అదేంటో తెలీదు అన్నట్లుగా మాట్లాడతారు. కానీ తర్వాత మళ్లీ దాని గురించే మాట్లాడతారు. సుధీర్, రష్మీది నిజమేనా? అని కూపీ లాగుతుంటారు. అయితే హీరో వెంకటేష్ మాత్రం భలే కామెడీ చేస్తారయ్యా అంటూ మమ్మల్ని నిజంగా మెచ్చుకున్నాడు. చాలా మందికి తెలియని విషయమేంటంటే గతేడాది సెప్టెంబర్ 24న నేను అవయవదానానికి సంతకం చేశాను" అని చెప్పుకొచ్చాడు.
చదవండి: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న రోజులూ ఉన్నాయి: నటుడు
Comments
Please login to add a commentAdd a comment