Jai Bhim Movie: Justice K Chandru Real Life Story and Interesting Facts
Sakshi News home page

Jai Bhim Real Story: ఎవరీ జస్టిస్‌ చంద్రు? జై భీమ్‌ మూవీతో ఆయనకేం సంబంధం?

Published Fri, Nov 5 2021 8:12 PM | Last Updated on Sun, Nov 7 2021 11:41 AM

Jai Bhim: Do You Know Justice K Chandru Real Life and Interesting Facts Here - Sakshi

Jai Bhim Chandru Real Life Story In Telugu: కొన్ని సినిమాలు డబ్బు కోసమే తీస్తారు. మరికొన్ని చిత్రాలు సమాజం మార్పు కోసం తీస్తారు. వీటికి డబ్బులు వస్తాయో రావో తెలియదు కానీ.. జనాలకు మాత్రం మంచి సందేశం అందుతుంది. అయితే ఇటీవల కాలంలో డబ్బుల కోసం తీసే చిత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. నాలుగు పాటలు, మూడు ఫైట్‌ సీన్స్‌ పెట్టి సినిమాను ముగిస్తున్నారు. ప్రేక్షకులు కూడా వాటినే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయినప్పటికీ.. తాను మాత్రం సందేశాత్మక చిత్రాలే తీస్తానంటున్నాడు తమిళ హీరో సూర్య. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జై భీమ్‌’. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం​..  విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీకీ చెందిన సెలెబ్రిటీలందరూ ఈ సినిమాని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో తమ స్పందనను తెలుపుతున్నారు. చివరకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ చిత్రాన్ని చూసి హీరో సూర్యకు లేఖ కూడా రాశారు. 
(చదవండి: ‘జై భీమ్‌’ మూవీ రివ్యూ)

ఇంతకీ  జైభీమ్‌ కథేంటి?
పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్‌’.మూడు దశాబ్దాల క్రితం పోలీసులు కొన్ని కులాలకి చెందిన నిరుపేద ప్రజలని ఎలా టార్గెట్ చేసి హింసించేవారనేది ఈ సినిమా ద్వారా కళ్లకుకట్టినట్లు చూపించాడు దర్శకుడు జ్ఞానవేల్‌. కులవివక్ష ఎప్పుడో వందలేళ్ల క్రితం ఉండేది తప్ప మేం పుట్టాక ఎప్పుడూ చూడలేదు అని చెప్పే కొందరు జనానికి ఇది కనువిప్పు కలిగించే చిత్రం.. ఇందులో సూర్య లాయర్‌ చంద్రుగా నటించాడు. ఇది రియల్‌ స్టోరి.  జస్టిస్ చంద్రు నిజజీవిత కథే ‘జైభీమ్‌’. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరు జస్టిస్ చంద్రు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆయన గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. 
(చదవండి: జై భీమ్‌లో సినతల్లిగా మెప్పించిన నటి ఎవరో తెలుసా!)

ఎవరీ జస్టిస్‌ చంద్రు?
జస్టిస్ చంద్రు...చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన తీర్పు ఎంతో మంది నిరుపేదల జీవితాను మార్చివేశాయి. ముఖ్యంగా అనగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. మానవహక్కుల కోసం డబ్బులు తీసుకోకుండా వాదించి ఎంతో మంది పీడిత వర్గాలకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తి ఆయన. 2009లో ఆయన చెన్నై హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. సాధారణంగా ప్రతి న్యాయమూర్తి తన కెరీర్‌లో 10-20 వేల కేసులను మాత్రమే పరిశీలించి తీర్పులు ఇస్తారు. కానీ జస్టిస్‌ చంద్రు మాత్రం తన కెరీర్‌లో అత్యధికంగా 96 వేలకు పైగా తీర్పులు ఇచ్చి రికార్డు సృష్టించారు.

ఆలయాల్లో మహిళా పూజారుల నియామకం, కులం, మతంతో సంబంధం లేకుండా సామూహిక శ్మశానాలు వంటివి ఆయన ఇచ్చిన తీర్పుల్లో కీలకమైనవి. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పటికీ.. హంగులు, ఆర్భాటాలకు మాత్రం దూరంగా ఉండేవాడు. తాను ప్రయాణించే కారుకు ఎర్రబుగ్గని తొలగించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. అలాగే వ్యక్తిగత భద్రతను కూడా వదులుకున్నారు. 2013లో ఆయన రిటైర్డ్‌ అయ్యారు. వాస్తవానికి ఎవరైనా న్యాయమూర్తి రిటైర్ అయితే ఆయనకు ఓ స్టార్ హోటల్‌లో విందును ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. కానీ జస్టిస్ చంద్రు మాత్రం కోర్టు అవరణలోనే విడ్కోలు చెప్పి, ప్రభుత్వం ఇచ్చిన కారును అక్కడే వదిలేసి లోకల్‌ ట్రైన్‌లో ఇంటికి వెళ్లారు. అంత సింపుల్‌సిటీ చంద్రు సొంతం. లాయర్‌గా, న్యాయమూర్తిగా తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతో ‘లిజన్ టు మై కేస్’ అనే పుస్తకాన్ని రచించారు జస్టిస్‌ చంద్రు. ఆ పుస్తకంలోని ఓ కథతోనే ప్రస్తుతం జై భీమ్ సినిమా తెరకెక్కింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement