
జయా బచ్చన్.. ఒకప్పుడు హిందీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. అందాల ఆరబోతకు ఓ అడుగు దూరంగా ఉండే ఆమె తన సహజసిద్ధ నటనతో ఎంతోమంది మనసులు గెలుచుకుంది. 1971లో గుడ్డి సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. నేడు (ఏప్రిల్ 9) ఆమె పుట్టినరోజు. ఈ రోజు ఆమె 75వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జయా బచ్చన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విషయాలను ఆమె మాటల్లోనే..
'1972లో బీఆర్ ఇషారా డైరెక్షన్‌లో ఏక్ నజర్ సినిమా చేశాను. ఇందులో అమితాబ్ హీరో. ఈ మూవీలో సుధీర్ అనే వ్యక్తి నాపై అత్యాచారం చేయాల్సి ఉంటుంది. నా బట్టలు చింపుకోమన్నారు. నేనేమో కుదరదు, అందుకు అంగీకరించనని తెగేసి చెప్పాను. చాలాసేవు వాదనలు జరిగాయి. నేను ఒప్పుకోకపోతే సినిమా ఆపేస్తానని డైరెక్టర్ హెచ్చరించాడు. నీకు నచ్చింది చేసుకోపో అన్నాను. అదే కనక జరిగితే ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేస్తానని నిర్మాత బెదిరించాడు.
ఏదైనా చేసుకో అన్నాను, కానీ అస్సలు తగ్గలేదు. కాదూ, కూడదని బలవంతంగా నాతో ఆ సీన్ చేయిస్తే దాన్ని ఎలా నాశనం చేస్తానో మీరే చూస్తారని వార్నింగ్ ఇచ్చాను. అలా ఆరోజు షూటింగ్ క్యాన్సల్ చేశారు. రెండు రోజులదాకా షూట్ ఊసే ఎత్తలేదు. దీంతో అమితాబ్ జోక్యం చేసుకుని నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇది నీ రోల్.. అక్కడేం చెప్తే అది చేయాల్సిందే! చేయనని ఎలా ఎదురుతిరుగుతావు? అన్నాడు.
నాకు బట్టలు చింపుకోవడం ఇష్టం లేదు. నేనలా చిరిగిన బట్టలతో స్క్రీన్‌పై కనిపించాలనుకోవడం లేదని బదులిచ్చాను. మొత్తానికి ఎలాగోలా నేనే కొంత వెనక్కు తగ్గాను. అత్యాచార సన్నివేశంలో చాలా సహజంగా నటించమన్నారు. పాపం ఆ విలన్ నా దగ్గరకు రాగానే ఇష్టమొచ్చినట్లు కొట్టాను. దీంతో అతడు నేను ఈ రేప్ సీన్ చేయను అని ఏడుపుముఖం పెట్టాడు' అంటూ నవ్వుతూ ఆనాటి సంఘటనను షేర్ చేసుకుంది జయా బచ్చన్.
Comments
Please login to add a commentAdd a comment