
బిగ్‌బాస్ విన్నర్, బాలిక వధు సీరియల్ ఫేం సిద్ధార్థ్ శుక్లా గత నెలలో మరణించిన విషయం తెలిసిందే. దాని గురించి ఎవరూ మర్చిపోకముందే హిందీ టీవీ పరిశ్రమలో మరో యాక్టర్ మరణం సంభవించింది. జీ టీవీ షో ‘జోధా అక్బర్’లో సలీమా బేగం పాత్రను పోషించిన టెలివిజన్ నటి మనీషా యాదవ్ శుక్రవారం మరణించింది. ఆమె మరణానికి కారణం మెదడులో రక్తస్రావం జరగడం అని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఆమె కో యాక్ట్రెస్ పరిధి శర్మ తన బాధని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నటి మరణం గురించి ఓ ఇంటర్వూలో పరిధి మాట్లాడుతూ.. ‘జోధా అక్బర్ షో ముగిసిన తర్వాత ఆమెతో అంతగా టచ్‌లో లేను. షోలో బేగమ్‌గా నటించిన అందరం కలిసి మొఘల్స్ అనే పేరు ఉన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే అందులో షేర్ చేసుకుంటాం. శనివారం మనీషా మరణం గురించి గ్రూప్‌లో చూసి షాక్ గురయ్యాను’ అని తెలిపింది. మనీషాకి ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడని, ఆ బాబు పరిస్థితి గురించి ఆలోచిస్తేనే ఎంతో ఆందోళనగా ఉందని బాధని వ్యక్తం చేసింది. మనీషా ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన పరిధి ‘ఈ వార్త చాలా హృదయ విదారకంగా ఉంది. నీ ఆత్మకు శాంతి కలగాలి మనీషా’ అని రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment