విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో కైకాలకు స్వర్ణ కంకణాన్ని తొడుగుతున్న చిరంజీవి(ఫైల్)
సాక్షి, విజయవాడ పశ్చిమ(కృష్ణా జిల్లా): కౌతవరం ముద్దుబిడ్డ కైకాల సత్యనారాయణ మృతితో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. కృష్ణాతీరం నుంచి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తరహాలో కళారంగాన్ని సుసంపన్నం చేసిన మరో ఆణిముత్యం కైకాల సత్యనారాయణ. కళాకారులు ఎవరికీ దక్కని ‘నవరస నటనా సార్వభౌమ’ బిరుదు కైకాల సొంతం. బెజవాడలో ఆయన మిత్రులు చాలా మంది ఉండేవారు. వారందరితో చక్కని సంబంధాలను కొనసాగించేవారు. సిద్ధార్థ అకాడమీలో ఆయన సభ్యు నిగా ఉన్నారు. ప్రతి ఏటా ఆయన సిఫారసు మేరకు సీట్ల కేటాయింపు కూడా జరిగేది. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో బెజవాడ నుంచే ఆయన చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
2017లో మహానటి సావిత్రి కళా పీఠం ఆయనకు విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆత్మీయ సత్కారం చేసి గౌరవించింది. కళాక్షేత్రంలోనే నటుడు ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహం ఆవిష్కరణకు మెగాస్టార్ చిరంజీవితో పాటుగా సత్యనారాయణ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సభలో చిరంజీవి సత్యనారాయణకు స్వర్ణ కంకణాన్ని తొడిగి ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. కనకదుర్గమ్మ చరిత్రపై సినిమాను చిత్రీకరించిన సమయంలోనూ విజయవాడలో ఆయన చాలా రోజులు ఇక్కడే ఉండి స్థానిక మిత్రులతో గడిపారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనప్పటికీ సరైన గుర్తింపు రాలేదనే బాధ ఆయనలో ఉండేది. టీడీపీ తనకు కేంద్ర స్థాయిలో అవార్డు రాకుండా అడ్డుకున్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా వ్యక్తం చేశారని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
కైకాలకు నివాళులు
కైకాల మరణ వార్త తెలియగానే నగరంలోని పలు సంస్థలు ఆయనకు నివాళులర్పించాయి. నగరంలోని కౌతా కళావేదిక ప్రాంగణంలో మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో కైకాల సత్యనారాయణను స్మరిస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మీ, సభ్యులు బాలాజీ కుమార్, దాసరి రమణ, పైడిపాటి వెంకన్న నివాళులర్పించారు.
కైకాల మహానటుడు : జాతీయ కాపు సమాఖ్య
కైకాల సత్యనారాయణ మహానటుడు అని జాతీయ కాపు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు నరహరశెట్టి శ్రీహరి అన్నారు. కైకాల అన్ని రకాల పాత్రల్లో గొప్ప నటనను కనబరచి యావత్ ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. ఆయన మరణం కళారంగానికి తీరని లోటని అన్నారు.
బందరు ఎంపీగా సేవలందించిన కైకాల
మచిలీపట్నంటౌన్: సినీ నటుడు కైకాల సత్యనారాయణ బందరు ఎంపీగా రెండేళ్ల పాటు సేవలు అందించారు. 1996లో మధ్యంతర ఎన్నికలు రావటంతో టీడీపీ ఎంపీ అభ్యరి్థగా పోటీ చేసి దాదాపు 70 వేలకు పైగా ఓట్ల మెజారీ్టతో కైకాల గెలుపొందారు. దాదాపు రెండేళ్ల పాటు ఆయన ఎంపీగా పనిచేశారు. ఎంపీగా ఉన్న సమయంలో మచిలీపట్నం విచ్చేసి కార్యకర్తలతో సమాలోచనలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఎంపీ నిధులతో పలు గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, బస్‌షెల్టర్లు వంటివి నిర్మించేందుకు కృషి చేశారు. మచిలీపట్నం వచ్చిన సమయంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేసి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఆ తరువాత సమీపంలోని ఆయన స్వగ్రామం కవుతరం వెళ్లేవారు. కైకాల సత్యనారాయణ మృతితో టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, బీసీ సంఘ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య తదితరులు నివాళులరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment