
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ శరీరంలో మార్పులు రావడం సాధారణమే! అయితే హీరోయిన్లు మాత్రం ఈ మార్పుల కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల కాజల్.. తన సోదరి నిషా అగర్వాల్ కొడుకుతో ఒక యాడ్ చేసింది. ఇందులో కాజల్ శరీరాకృతి గురించి చాలామంది నెగెటివ్‌గా కామెంట్ చేశారు. తాజాగా దీనిపై కాజల్ గట్టిగానే స్పందించింది. 'నా జీవితంలో, నా శరీరంలో, ఇంట్లో, పని ప్రదేశంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి, వాటన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ కామెంట్లు, మీమ్స్ వల్ల నాకెలాంటి ఉపయోగం లేదు. కష్టంగా అనిపించినా సరే కానీ ముందు దయతో ఎలా మెదలాలో నేర్చుకోండి. మీరు బతకండి, ఇతరులనూ బతకనివ్వండి..
నాలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నవారికి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. గర్భధారణ సమయంలో బరువు పెరగడంతో సహా మన శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. కడుపులో బిడ్డ పెరిగేకొద్దీ పొట్ట పెద్దదవుతుంది. శరీరం సాగినప్పుడు కొందరికి స్ట్రెచ్ మార్క్స్ కూడా ఏర్పడుతాయి. మరికొన్నిసార్లు చర్మం చిట్లుతుంది. సాధారణ సమయంలో కంటే ప్రెగ్నెన్సీ టైంలో త్వరగా అలిసిపోతాం, మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి.
ప్రతికూలంగా ఆలోచించడం వల్ల అనారోగ్యంబారిన పడతాం. ఇక బిడ్డ పుట్టాక మళ్లీ మునుపటిలా అవడానికి కొంత సమయం పట్టవచ్చు, లేదంటే మునుపటి స్థితికి మన శరీరం రాకపోవచ్చు కూడా. అయినా సరే, ఏం పర్లేదు. ఈ మార్పులన్నీ సర్వసాధారణమే. మన జీవితాల్లోకి ఓ పాపాయి రాబోతుందన్నప్పుడు వాటన్నింటినీ పట్టుకుని వేలాడుతూ అసౌకర్యంగా, ఒత్తిడిగా ఫీలవకండి. చిన్నారికి జన్మనివ్వడం అనేది వేడుక అన్న విషయాన్ని గుర్తుంచుకోండి' అని కాజల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment