Kamal Haasan: అప్పట్లో ప్రమాదం జరిగితే.. | Kamal Haasan attends Vijay Sethupathi event after Discharge from hospital | Sakshi
Sakshi News home page

Kamal Haasan: అప్పట్లో ప్రమాదం జరిగితే..

Published Sun, Nov 27 2022 7:03 AM | Last Updated on Sun, Nov 27 2022 7:03 AM

Kamal Haasan attends Vijay Sethupathi event after Discharge from hospital - Sakshi

 కమలహాసన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న విజయ్‌ సేతుపతి

నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ఇటీవల నటించినా విక్రమ్‌  చిత్రం ఘన విజయంతో చాలా జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌ – 2 చిత్రంలో నటిస్తూ, మరోపక్క బిగ్‌బాస్‌ రియాల్టీ గేమ్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 23న అనూహ్యంగా ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాతి రోజు ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

కాగా నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డీఎస్పీ. స్టోన్‌ బెంచ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై పొన్‌రామ్‌ దర్శకత్వంలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ట్రేడ్‌ సెంటర్‌ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమలహాసన్‌ మాట్లాడుతూ తాను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు. ఒకప్పుడు పెద్ద ప్రమాదానికి గురైతే పరామర్శించిన తరువాత తదుపరి చిత్రం ఏమిటి? ఎప్పుడు నటించనున్నారు? అని అడిగే వారున్నారు.

ఇప్పుడు కాలు చిన్నగా గీరుకు పోయినా పెద్దగా ప్రచారం చేస్తున్నారన్నారు. కారణం  ఒకటి మీడియా, రెండు అభిమానం అని పేర్కొన్నారు. తాను చిన్న దగ్గు సమస్య కారణంగా ఆస్పత్రిలో చేరానని స్పష్టం చేశారు. ఇకపోతే నటుడు విజయ్‌ సేతుపతి కోసమే తానీ కార్యక్రమానికి విచ్చేసినట్లు చెప్పారు. కారణం తనలాగే ఆయన సినిమా ప్రేమికుడు అని పేర్కొన్నారు. చిత్ర ట్రైలర్‌ చాలా బాగుందంటూ.. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తాను నటుడు మర్లన్‌ బ్రాండోను కలిసినప్పుడల్లా ఆయన ముందు మోకాళ్లపై నిలబడి ఆయన చేతులను ముద్దాడే వాడినన్నారు. ఈ వేదికపై విజయ్‌ సేతుపతి తన ముందు మోకాళ్లపై నిలబడి పుష్పగుచ్ఛం ఇవ్వాలని, భవిష్యత్‌లో ఆయన ముందు మరో నటుడు వంగి నిలబడుతారని కమలహాసన్‌ అన్నారు. విజయ్‌ సేతుపతి  మాట్లాడుతూ నటుడు కమలహాసన్‌తో కలిసి విక్రమ్‌ చిత్రంలో నటించినప్పుడు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. ఆయన మరో నాలుగైదు తరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement