ఏఎల్ విజయ్, అరవింద్ స్వామి, కంగనా, విజయేంద్రప్రసాద్
‘‘తెలుగు, తమిళంలో నట వారసత్వం ఉన్నప్పటికీ గ్రూపిజమ్, గ్యాంగిజమ్ ఉండవు. అన్ని భాషలవారినీ ఆదరిస్తారు. దక్షిణాదిలో నాకు లభించిన ప్రోత్సాహం, అభిమానం చూస్తే ఇక్కడే మరికొన్ని చిత్రాల్లో నటించాలనిపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్‌గారు సిఫారసు చేయకపోయి ఉంటే ‘తలైవి’ అవకాశం నాకు వచ్చేది కాదు. నేనీ పాత్రకు సరిపోతానని నమ్మి విజయ్ నన్ను ఒప్పించారు’’ అని కంగనా రనౌత్ అన్నారు. దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. జయలలిత పాత్రను కంగనా రనౌత్, ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
మంగళవారం కంగనా పుట్టినరోజు సందర్భంగా ‘తలైవి’ ట్రైలర్‌ని చెన్నైలో విడుదల చేశారు. ‘‘తలైవి అంటే లీడర్.. నిజ జీవితంలోనూ కంగనా ఓ గొప్ప నాయకురాలవుతుంది’’ అన్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ‘‘పురుషాధిపత్యంలోంచి ఓ మహిళ ఎలా నిలబడింది? ఎలా విజయం సాధించింది? అనేది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు ఏఎల్ విజయ్. ‘‘తలైవి’ టీజర్ విడుదలయ్యాక అందరూ నా ఎంజీఆర్ లుక్‌పై ప్రశంసలు కురిపించారు.. ఎంతో కష్టపడ్డావ్ అన్నారు. కానీ నేనీ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాను’’ అన్నారు అరవింద్ స్వామి. విష్ణు వర్ధన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ బృందా ప్రసాద్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment