- దర్శన్‌కు జ్యుడీషియల్ కస్టడీ
- పరప్పన అగ్రహార జైలుకు దర్శన్
- బెయిల్ కోసం ప్రముఖ లాయర్లు
కర్ణాటకలో సంచలనం రేపిన ఆటోడ్రైవర్ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌కు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హత్య కేసులో గత 12రోజులుగా ఆయన్ను పోలీసులు విచారించారు. హత్య జరిగిన ప్రదేశంతో పాటు పలు చోట్ల 139 వస్తువులను సాక్ష్యాలుగా పోలీసులు సేకరించారు. అన్నిటికంటే ముఖ్యంగా దర్శన్ అనుచరుడు వినయ్ ఫోన్‌లో చాటింగ్ చేసిన మెసేజ్‌లు కేసులో కీలకంగా మారనున్నాయి. రేణుకాస్వామిపై దర్శన్ దాడి చేసిన దృశ్యాన్ని ముగ్గురు యువకులు మొబైల్‌లో వీడియో తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీడియోలను సేకరించారు.
దర్శన్‌తో పాటు అతని సహచరులు వినయ్, ప్రదుష్, ధనరాజ్‌లను శనివారం నగరంలోని 24వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. దర్శన్‌తో పాటు ఆయన ముఠాను జులై 04 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ తాజాగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేణుకాస్వామి దారుణ హత్య నేపథ్యంలో ఏ1 నిందితురాలు పవిత్రగౌడ్‌తో పాటు మరో 13 మంది ఇప్పటికే పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఇప్పుడు దర్శన్ గ్యాంగ్ కూడా పరప్పన అగ్రహారంలో చేరారు, అందువల్ల హత్య కేసులో ప్రమేయం ఉన్న 17 మంది నిందితులకు జులై 4 వరకు కస్టడీ విధించారు.
దర్శన్ బెయిల్ కోసం ప్రముఖ లాయర్లు
రేణుకాస్వామి హత్య కేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్ పిటిషన్ పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. దర్శన్ కేసు వాదించడానికి అనిల్, బాబు, రంగనాథ్‌రెడ్డి అనే లాయర్‌లను నియమించుకున్నారు. అదేవిధంగా సీనియర్ లాయర్ సీవీ నాగేశ్‌ను కూడా దర్శన్ నియమించుకున్నారు. ఇటీవల జైలుపాలైన మాజీ మంత్రి రేవన్న కేసును నాగేశ్ వాదించి బెయిలు ఇప్పించారు.
అనేక క్రిమినల్ కేసులు వాదించిన అనుభవం ఆయనకు ఉంది. దర్శన్‌కు కూడా బెయిల్ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా లాయర్ నాగేశ్, అసిస్టెంట్ లాయర్ రాఘవేంద్ర ఇప్పటికే అన్నపూర్ణేశ్వరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment