‘‘నేనిప్పటికే యాక్షన్ సినిమాలు చేశాను కాబట్టి ఓ నమ్మకం వచ్చింది. కానీ, నేను కామెడీ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అనే క్యూరియాసిటీ ఉంది. నేను బయట చాలా సరదాగా ఉంటాను కాబట్టి ‘రాజా విక్రమార్క’లో కామెడీ చేయడం కష్టం అనిపించలేదు. ట్రైలర్ విడుదలయ్యాక నా కామెడీ టైమింగ్ బావుందని చెప్పినప్పుడు సంతోషపడ్డాను’’ అని కార్తికేయ అన్నారు. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఆదిరెడ్డి టి. సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు...
శ్రీ సరిపల్లి చెప్పిన ‘రాజా విక్రమార్క’ కథ నచ్చింది.. తనతో పది నిమిషాలు మాట్లాడిన తర్వాత నిజాయతీగా చేయగలడనే నమ్మకం వచ్చింది. కథను చెప్పినట్టే చక్కగా తెరకెక్కించారు. రెండు కరోనా వేవ్స్ వచ్చినా పట్టుదలతో థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్న రామారెడ్డి, ఆదిరెడ్డిలకు థ్యాంక్స్. ∙ఈ చిత్రంలో యాక్షన్ కూడా స్టయిలిష్‌గా ఉంటుంది. ఎన్‌ఐఏ ఏజెంట్‌గా డ్రస్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. రెండున్నర గంటలు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే చిత్రమిది. ∙ఒక రోజు శ్రీతో ‘రాజా విక్రమార్క’ టైటిల్ బావుంది.. పెట్టేద్దాం అన్నాను. ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు.
టైటిల్ రిజిస్టర్ చేశాక చిరంజీవిగారికి పంపించాను. ఆయన ‘గుడ్ లక్’ అన్నారు. చిరంజీవిగారి మీద అభిమానంతో ఆయన సినిమా టైటిల్ పెట్టుకున్నాను. ∙ఇమేజ్, మార్కెట్ అంటూ భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటే తెలియకుండా ఒత్తిడిలోకి వెళ్లి కథలో బేసిక్ పాయింట్స్ మిస్ అవుతున్నాను. ఓ ప్రేక్షకుడిగా కథ వినాలని నిర్ణయించుకున్నా. నా ఫిజిక్ వల్లే ‘ఆర్‌ఎక్స్ 100’, ‘గ్యాంగ్ లీడర్’, ‘వలిమై’ చిత్రాల్లో అవకాశాలు ఇచ్చినట్లు ఆయా చిత్ర దర్శకులే చెప్పారు.
బాడీ అలా మెయింటైన్ చేయడం కష్టమే.. అయితే అవకాశాలు వస్తున్నప్పుడు కష్టపడొచ్చు. ∙అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా ‘వలిమై’లో విలన్‌గా చేస్తున్నాను. ఈ సినిమా కోసం కొంచెం తమిళ్ నేర్చుకున్నాను. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత క్లాక్స్ అనే డైరెక్టర్‌తో ఓ సినిమా ఉంటుంది. శివలెంక కృష్ణప్రసాద్‌గారి శ్రీదేవి మూవీస్ సంస్థలో ఓ సినిమా ఓకే అయింది.
‘రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ వేడుకలో లోహితకు ప్రపోజ్ చేసి, సర్‌ప్రైజ్ ఇచ్చాను. ఇన్ని రోజుల నుంచి తనతో ప్రేమలో ఉన్నా ఎప్పుడూ ప్రాపర్‌గా ప్రపోజ్ చేయలేదు. ఫోనులో ఇష్టమని చెప్పడం తప్ప ‘ఐ లవ్ యు’ అని చెప్పలేదు. జీవితాంతం మా ఇద్దరికీ ఓ అందమైన అనుభూతిగా ఉంటుందని ఆ వేదిక మీద ప్రపోజ్ చేశాను.
Comments
Please login to add a commentAdd a comment